Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పొలిటిషయన్ తెలివి ముందు జర్నలిస్టుల తెలివి… జస్ట్ ఓ జుజుబీ…

March 22, 2026 by M S R

.

Murali Buddha …. 
జర్నలిస్ట్ లు – రాజకీయ నాయకులు… ఎవరు తెలివైనవారు అని ప్రశ్నిస్తే ? ఇదేం ప్రశ్న..? మహాత్మా గాంధీ , జవహర్ లాల్ , ప్రకాశం పంతులు మొదలుకొని తెలుగు తేజాలు బూర్గుల రామకృష్ణారావు వరకు నాయకులు అంతా ముందు జర్నలిజం నుంచే రాజకీయాల్లోకి వచ్చారు కదా ? సమాజాన్ని రాజకీయ నాయకులను అందరినీ చైతన్యపరిచే జర్నలిజమే గొప్ప, జర్నలిస్ట్ లే తెలివైనవారు అనే సమాధానం వస్తుంది . చరిత్రను చదివినవారి నుంచి …!! అదే సినిమా జ్ఞానం ఉంటే ఇదో ప్రశ్ననా? రాజకీయ నాయకులు అంటే విదూషకులలాంటి వాళ్ళు , విలన్ లు , అంగుటా చాప్ లు అని చెబుతారు …



సరిగ్గా 21 ఏళ్ళ క్రితం నాటి విషయం …. పాత సినిమాల్లోని రింగులు రింగులు కనిపించాక… అక్కడికి వెళితే …

Ads

కుందూరు జానారెడ్డి హోమ్ మంత్రి… టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది … ఎక్కడ చూసినా తెల్ల చొక్కాల హడావుడి … జానారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే బిలబిలమంటూ పెద్ద సంఖ్యలో జర్నలిస్ట్ లు … అంతకు కొంతకాలం ముందు ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నా ఓ పది మంది ఉండేవారు … టివిలు , పత్రికలు పెరిగాయి . వీటికన్నా రిపోర్టర్ల సంఖ్య ఇంకా పెరిగిపోయింది …

సచివాలయంలో హోమ్ మంత్రి ఛాంబర్ పెద్దదే కానీ వచ్చిన విలేకరుల సంఖ్య ముందు ఆ ఛాంబర్ చిన్నబోయింది … కొందరు కుర్చీల్లో కూర్చున్నారు . కొందరు నిలబడ్డారు … కొందరు కనీసం నిలబడలేకపోతున్నారు .. దేశాన్ని వణికించిన శేషన్ వస్తేlనే ఆయన టేబుల్‌పైనే ఎక్కాము … మాకు యేది అడ్డురాదు, ఇదో లెక్కా అన్నట్టు ఫోటోగ్రాఫర్లు ధీమాగా ఉన్నారు …

జానారెడ్డి వచ్చి తన సీట్‌లో కూర్చున్నారు … ఇక్కడ సరిపోవడం లేదు .. కింద ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్‌కు వెళదాం అని కొందరు కోరస్ గా పలికారు . ఆ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అదే కోరస్ తో మరికొందరు … ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కానీ పరిస్థితి .. పోకిరి సినిమాలో మహేష్ బాబు ఈ తొక్కలో మీటింగ్ ఏంటో అర్థం కావడం లేదు, వేసేయమంటావా ? అని అందరినీ చూసినట్టు జానారెడ్డి అందరి వైపు ఓసారి చూసి …
మీరంతా ఏకాభిప్రాయంతో ఓ నిర్ణయానికి రండి అని కాన్ఫరెన్స్ హాల్ కు వెళదామా ? ఇక్కడేనా తేల్చుకోండి అని అందరి వైపు చూశారు …

అక్కడ ఎంత మంది ఉన్నారో అన్ని గ్రూప్ లుగా విడిపోయారు .. ముందు వరుసలో కూర్చున్న వారు ఇక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్ అని పట్టుపట్టారు . కొంచం వెనుక వైపు కూర్చున్న వారు ఎక్కడైనా సరే అన్నారు . నిలబడి ఉన్నవారు కింద కాన్ఫరెన్స్ హాల్ కు వెళ్లాల్సిందే అని పట్టుపట్టారు … ఇంకో మీటింగ్ కు వెళ్ళాలి, ఏదో ఒకటి చెప్పేయండి అని కొందరు… ఎవరికి వారు తమ తమ అనుకూల వాదనలు వినిపించారు .

అయితే అంతా ఒకేసారి వాదనలు వినిపించడంతో ఎవరేం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కాలేదు . గందరగోళం మధ్య ఒక్కసారిగా జానారెడ్డి టేబుల్ మీద చేయితో చరచగానే అంతా మౌనం . పాతిక మంది ఏకాభిప్రాయానికి రాలేక పోతున్నారు , ఏడు కోట్లమంది ప్రజలను పాలించే మాకు ఏదో చెబుతారు , మమ్ములను తప్పు పడతారు , మేమేం చేయాలో చెబుతారు అంటూ ఏమేమో మాట్లాడి కసి తీర్చుకొని … ఇక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్ కూర్చోండి అన్నారు …

నిజానికి ఆయనకు తన ఛాంబర్ నుంచి లేవాలి అని లేదు .. ఏకాభిప్రాయం అనే ఆయుధంతో ఎవరూ కిక్కురుమనకుండా చేసి , తాను అనుకున్నట్టు తన ఛాంబర్ లోనే మాట్లాడారు .. జానారెడ్డి ఉపన్యాసాలు విని ఆయన్ని ఓ కార్టూన్ విషయంగా భావించినవారికి ఆయన తెలివి నచ్చింది .. జానారెడ్డి ఎలాంటి వారో మాకు తెలుసు అని మీడియా వారికి ఓ ధీమా ఉండేది కానీ నిజానికి జర్నలిస్ట్ లకు జానారెడ్డి గురించి తెలిసిన దానికన్నా జర్నలిస్ట్ ల మనస్తత్వం ఏమిటో జానారెడ్డికి బాగా తెలుసు …

ఒక్క జానారెడ్డి అనే కాదు … రాజకీయ నాయకులు అంతా ఇంతే …. జర్నలిస్ట్ లకు నాయకుల గురించి తెలిసిన దానికన్నా నాయకులకు జర్నలిస్ట్ ల గురించి ఎక్కువ తెలుసు …


తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న సమయంలో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఇదే ఏకాభిప్రాయం ఆయుధాన్ని నమ్ముకున్నారు . దేశంలోని తెలుగువారంతా ఏకాభిప్రాయంతో తెలంగాణ ఏర్పాటును కోరుకుంటే తెలంగాణ ఏర్పాటుకు సిద్ధం అని ఉద్యమ కాలంలో ప్రకటించారు …
ఔను, అయితే ఏమిటీ ? అంటే …. రేవంత్ రెడ్డి ఇదే ఏకాభిప్రాయం ఆయుధాన్ని జర్నలిస్ట్ ల మీద ప్రయోగించారు .

రెండు దశాబ్దాల క్రితం రెండు లక్షల రూపాయలు చెల్లించి భూమి కొన్న జర్నలిస్టులను రెండు దశాబ్దాల నుంచి దురదృష్టం వెన్నాడుతుంటే అంతా ఏకాభిప్రాయంతో వస్తే ప్రత్యామ్నాయం చూస్తా అంటున్నారు .
ప్రజాస్వామ్యంలో మెజారిటీ అభిప్రాయం ఉంటుంది కానీ ఏకాభిప్రాయం ఉండదు .

కొరియా ఎన్నికల్లో కిమ్ ఒక్కడే పోటీ చేస్తాడు . ఓటు వేయకపోతే కఠిన శిక్షలు అమలు చేస్తారు . అయినా కిమ్ కు 99 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి . తెలంగాణలో కాంగ్రెస్ ఏకాభిప్రాయంతో గెలువలేదు . వంద ఓట్లు పోల్ అయితే 39 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ కు వచ్చాయి . 60 ఓట్లు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వచ్చాయి .

దేశంలో ఎదురు లేకుండా పాలిస్తున్న బీజేపీకి వందలో 35 ఓట్లు మాత్రమే వచ్చాయి . 65 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి . ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఓట్లే విజేతను నిర్ణయిస్తాయి కానీ ఏకాభిప్రాయం కాదు . పోనీ మీడియా అకాడమీ ఛైర్మెన్ ను జర్నలిస్ట్ ల ఏకాభిప్రాయంతో నియమించారా ?

ఏకాభిప్రాయంతో పదవిని పొడిగించారా ? ఎవరు వద్దన్నా , అడ్డుకున్నా నిర్ణయం తీసుకోవాలి అనుకున్నారు, తీసుకున్నారు అంతే … ఆ రోజు తెలంగాణ ఏర్పాటుకు ఏకాభిప్రాయం లింక్ పెట్టినట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి జర్నలిస్ట్ ల ఇంటి స్థలం సమస్యకు ఏకాభిప్రాయం లింక్ పెడితే పాత విషయాలు గుర్తుకు వచ్చాయి .

ప్రజాస్వామ్యంలో నాయకులను ఎన్నుకునేది, నాయకత్వ బాధ్యత అప్పగించేదే నిర్ణయాలు తీసుకోవడానికి … ఏకాభిప్రాయం పేరుతొ తప్పించుకోవడానికి కాదు …

మహా మహా జర్నలిస్టులకన్నా రాజకీయ నాయకులు చాలా తెలివైన వాళ్ళు . నటుడు దర్శకుడు చెప్పినట్టు నటిస్తాడు . రైటర్ డైలాగులు వల్లె వేస్తాడు . కెమెరా ముందు మాత్రమే నటిస్తాడు . రాజకీయ నాయకుడు తన డైలాగులు తానే రాసుకుని తన దర్శకత్వం తానే వహిస్తూ 24 గంటలు మేకప్ లేకుండా సహజంగా నటిస్తాడు .

రాజకీయ నాయకులకు రాజకీయ వ్యాపారంతో పాటు అనేక వ్యాపారాలు ఉంటాయి . రాజకీయ నాయకుల గురించి రాసే జర్నలిస్ట్ లకు రాయడం తప్ప మరో పని ఉండదు . నిజానికి రాజకీయ నాయకుల కన్నా జర్నలిస్ట్ లే రాజకీయాలు గురించి ఎక్కువ ఆలోచిస్తాడు … ఆలోచన వేరు, కార్యరంగంలోకి దిగడం వేరు అందుకే జర్నలిస్ట్ ల కన్నా నాయకులు ఎన్నో రెట్లు తెలివైన వారు .    – బుద్దా మురళి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పొలిటిషయన్ తెలివి ముందు జర్నలిస్టుల తెలివి… జస్ట్ ఓ జుజుబీ…
  • సినిమా- రాజకీయం… పడుగూపేక..!! అరవ పాలిటిక్స్ అదోరకం… ఎలాగంటే..?
  • గ్యాస్, పెట్రో, డీజిల్ మాత్రమే కాదు… ఎరువులకూ కొరత ప్రమాదం…
  • దురంధర్ లో బాగా పేలిన పాత్ర… బడే సాహెబ్… ఎవరీ నటుడంటే..?
  • భయం నుంచి విముక్తి – ఆ పచ్చిపుండు వేదన – దురందర్ మరో కోణం…
  • ఒకే వ్యక్తి తల్లి ప్లస్ తండ్రి..! ఈ ప్రచారం ఏమిటి..? అసలు నిజాలు ఏమిటి..?!
  • రాత్రి 10… సీఎం హఠాత్తుగా మాయం… ఒక్కడే కారులో ఎటో వెళ్లిపోయాడు…
  • మణిరత్నం పిలుపు ఓ అవకాశం మాత్రమే కాదు… ఓ గౌరవం, ఓ గుర్తింపు..!!
  • చిరంజీవి వ్యాఖ్యలపై ఇంత వ్యతిరేకతకు కారణాలేమిటి..?!
  • కొత్త సీసాలో పాత సారా..? కాదు.., కొత్త సీసా, కొత్త సారా, కొత్త రంగు కూడా..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions