ముందుగా అసలు వివాదం ఏమిటో చూద్దాం… ‘‘హైపర్ ఆది బతుకమ్మ, గౌరమ్మలను, తద్వారా తెలంగాణ సంస్కృతిని కించపరిచాడు… క్షమాపణ చెప్పాలి…’’ ఇదీ వివాదం… ఈటీవీలో మొన్నామధ్య ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కామెడీ షో… జంబలకిడిపంబ అనే ఓ పాత సినిమాకు స్పూఫ్‌గా ఒక స్కిట్ చేశారు… అందులో ఆడవాళ్లుగా మారిన మగవాళ్లు ఓచోట బతుకమ్మ, గౌరమ్మ పాటలు పాడతారు… అదుగో అక్కడ పుట్టింది వివాదం… తెలంగాణ జాగృతి స్టూడెంట్ వింగ్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది… ఆదితోపాటు స్క్రిప్ట్ రైటర్, మల్లెమాల ప్రొడక్షన్స్‌ను కూడా తప్పుపట్టారు… ఇందులో తన తప్పేమీ లేదనీ, ఒకవేళ నా తప్పు ఉందని ఎవరైనా భావిస్తే క్షమాపణలు చెబుతున్నాను అని ఆది స్పష్టంగానే సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చాడు…. సీన్ కట్ చేస్తే… యూట్యూబ్‌లో ఇప్పుడు ఆ స్కిట్ పార్ట్‌లో బతుకమ్మ, గౌరమ్మ పాటలు, ఆ ఖూనీరాగాలు కనిపించడం లేదు… గాయబ్, ఇట్స్ గాన్, పొయిపొచ్చి, పోయిందే… అన్నట్టుగా అలా ఎలా తీసేశారబ్బా..?
వీడియో వివరాలు చూస్తేనేమో 13న అప్‌లోడ్ చేసినట్టుగానే కనిపిస్తోంది… ఈ వివాదం వచ్చాక తీసేశారు అనుకుందామంటే… మరి అదే తేదీ చూపిస్తోంది..? ఏ వివరాలూ మార్చాల్సిన పనిలేకుండా వీడియో ఎడిట్ చేసేయొచ్చా..? పాత ప్రొమోలు కూడా కనిపించడం లేదు… యూట్యూబ్‌లో తీసేస్తే ఇక తప్పు కడుక్కున్నట్టేనా..? ఆల్‌రెడీ కోట్ల మంది చూసేశారు కదా, దాన్నేం చేస్తారు..? కంట్రవర్సీ వచ్చినప్పుడు వివరణ ఇవ్వడమో, లేక మేం చేసింది కరెక్టే అనుకునే పక్షంలో సమర్థనో అవసరం… హేమిటో, ఈ మల్లెమాలకూ, ఈ ఈటీవీకి ఎప్పుడొస్తుందో..?! ఇక అసలు విషయానికి వద్దాం… ఈ వివాదం మీద సోషల్ మీడియాలో ఖండనమండనలు జోరుగా సాగుతున్నయ్… ఆది ఏం తప్పు చేశాడనే వర్గం ఒకవైపు… తప్పే చేశాడు అనే వర్గం మరోవైపు… ఎవరి దృక్కోణం వాళ్లది… అయితే…?
Ads
హైపర్ ఆది గతంలో మహేష్ కత్తిని టార్గెట్ చేస్తూ, నాగబాబు మెప్పు పొందేలా తన స్కిట్లలో వేసిన ఉద్దేశపూర్వక పంచ్ డైలాగుల దగ్గర్నుంచి ఇటీవల అదుపు తప్పి ప్రయోగిస్తున్న బూతు భాష వరకూ… చాలామందికి ఆది పట్ల చాలా అంశాల్లో అభ్యంతరాలున్నయ్… అయితే ఇక్కడ మాత్రం అతని తప్పు ఏముంది అనేదే ఓ ప్రశ్న… వోకే, స్కిట్‌లోని ఆ పార్ట్ తెలంగాణ సంస్కృతిని కించపరిచేలా ఉందనేది నిజం అనుకున్నా… దానికి ఆది ఎలా బాధ్యుడు అవుతాడు..? అక్కడ పద్నాలుగు మంది కమెడియన్లు కలిసి ఆ స్కిట్ చేస్తున్నారు… బతుకమ్మే కాదు, ముత్యమంత పసుపు ముఖమెంతో ఛాయ వంటి ఓల్డ్ సాంగ్స్ కూడా పాడుతున్నారు… ఇస్తినమ్మ వాయినం అంటూ జోక్‌గా ఏదో యాక్ట్ చేస్తున్నారు… స్క్రిప్ట్ తనది కాదు, నిర్మాతలు మల్లెమాల ప్రొడక్షన్స్… వాళ్ల టేస్ట్, వాళ్ల జబర్దస్త్ షో క్వాలిటీ అందరికీ తెలిసిందే కదా… ప్రసారం చేసింది ఈటీవీ… సో, పెడితే ముందుగా ఈటీవీ మీద, మల్లెమాల మీద కేసులు పెట్టాలి… ఇక్కడ ఆది కేవలం నటుడు… తెలంగాణ జాగృతి చీఫ్ కవితకు తెలిసే ఈ కేసు పెట్టారా..? ఫైట్ ఎప్పుడూ సీరియస్ ఇష్యూస్ మీద కదా సాగాల్సింది…!!
Share this Article