2019… జనరల్ ఎలక్షన్స్ తరువాత… రాజ్యసభలో రాంవిలాస్ పాశ్వాన్… లోకసభలో కొడుకు చిరాగ్ పాశ్వాన్, తమ్ముడు పశుపతి పరస్, చిన్న తమ్ముడు రాంచంద్ర పాశ్వాన్… మొత్తం పార్లమెంటులో నలుగురు సభ్యుల పెద్ద రాజకీయ కుటుంబం… రాంచంద్రపాశ్వాన్ మరణించాక ఉపఎన్నికలో ఆయన కొడుకు ప్రిన్స్ పాశ్వాన్‌ను నిలబెట్టి గెలిపించారు… సో, బీహార్ రాజకీయాలకు సంబంధించి ఆ కుటుంబం, వాళ్ల పార్టీ లోకజనశక్తిని తక్కువ అంచనా వేయలేం… సీన్ కట్ చేస్తే… పాశ్వాన్ మరణించాడు… తమ్ముడు పశుపతికీ, పాశ్వాన్ కొడుకు చిరాగ్‌కూ పడటం లేదు… పశుపతి అయిదుగురు పార్టీ ఎంపీలతో కలిసి అన్నకొడుకు మీద తిరగబడ్డాడు… లోకసభలో వేరేవర్గంగా ఏర్పడ్డారు… చిరాగ్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు… ఒకే ఒక ఎమ్మెల్యే కాస్తా జేడీయూలోకి వెళ్లిపోయాడు… చివరకు ఇప్పుడు చిరాగ్ ఒంటరివాడు అయిపోయాడు… పార్టీ అతలాకుతలం…
మరి మనం ఎందుకు చెప్పుకోవాలీ అంటారా..? చెప్పుకోవాలి..! వ్యక్తి కేంద్రిత పార్టీలు, కుటుంబ పార్టీల యవ్వారం ఒక్కసారిగా ఎలా తల్లకిందులు అవుతుందో… చెప్పడానికి ప్రబలమైన తాజా ఉదాహరణ ఇది… ఒక వ్యక్తి దూరమైతే, అప్పటిదాకా పరోక్షంగా పెత్తనాలు చేస్తున్న కుటుంబసభ్యులు పార్టీని ఏం చేస్తారో చెప్పడానికి ఇది ఓ నిదర్శనం… కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశంలో బోలెడు పార్టీలు ఇలాంటివే… చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు… అధికారంలో ఉండొచ్చు, లేకపోవచ్చు… కానీ సుస్థిర రాజకీయాలకు ఇలాంటి ‘‘ఇంటి పార్టీలు’’ ఏమాత్రం ఉపయోగపడవని చెప్పడానికి కూడా లోకజనశక్తి రాజకీయాల్నితాజా తార్కాణంగా చెప్పుకోవచ్చు… ప్రాంతీయ ఆకాంక్షలకు రక్షణలాగా ప్రాంతీయ పార్టీలు ఉపయోగపడతాయనేది స్థూలంగా నిజమే కావచ్చు గాక… కానీ వ్యక్తుల ఇష్టాయిష్టాల మీద ఆధారపడి రాజకీయాలు సాగించే ‘‘ప్రాంతీయ కుటుంబ పార్టీల’’తో ప్రజాస్వామిక స్పూర్తికి ఏం ఉపయోగం అనేదీ డిబేటబుల్… ఆయా పార్టీల ‘‘ఓనర్ షిప్’’, ముఖ్య నిర్ణయాలు, ఆధిపత్యం పూర్తిగా ఆయా వ్యక్తులదే, ఆ కుటుంబాలదే… ప్రశ్నిస్తే ‘ఎగ్జిట్ గేటు’ చూపించబడుతుంది…
Ads
మళ్లీ లోకజనశక్తి వ్యవహారానికి వద్దాం… పాశ్వాన్ కొడుకు చిరాగ్ వయస్సు రీత్యా, రాజకీయంగా ఇంకా చిన్నవాడే… 38 ఏళ్లు… తండ్రి మరణానంతరం వారసత్వంగా ఆ పగ్గాలు తీసుకున్నాడు… కానీ మన రాజకీయాల సరళి ఇంకా ఒంటబట్టలేదు… లౌక్యం తెలియదు… తన బాబాయ్ ఈ రాజకీయాల్లో దిట్ట… అన్న బతికి ఉన్నప్పుడే పార్టీలో హవా చలాయించేవాడు… కానీ అన్న చనిపోయాక, చిరాగ్ చేతికి పగ్గాలు వచ్చాక, ఈ బాబాయ్‌కు ఎటూ తోచడం లేదు… చిరాగ్ సొంత నిర్ణయాలతో విసిగీ విసిగీ ఇక ‘ఎహెఫోరా’ అని విడిపోయాడు… ‘‘నేనంటే మొదటి నుంచీ బాబాయ్‌కు పడదు, నాన్న ఐసీయూలో ఉన్నప్పుడే బాబాయ్ వ్యవహారాలు తెలిసి మందలించాడు… నాన్న అంత్యక్రియలకు అమ్మ 25 లక్షలు ఇస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేదు… పార్టీలో చీలికలు వద్దంటూ మాట్లాడాలని వెళ్తే, బాబాయ్ ఇంటి ముందు గంటన్నర వెయిట్ చేశాను కానీ తను మాట్లాడలేదు…’ అని చిరాగ్ ఏదేదో చెబుతున్నా సరే, పార్టీ కేడర్ డీలాపడిపోయింది… జరగాల్సిన నష్టం జరిగిపోయింది… పంటి కింద రాయిలా మారిన ఎల్‌జేపీ మీద… తనకు గత ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేసిన చిరాగ్ మీద బీహార్ సీఎం నితిశ్ ఇలా ప్రతీకారం తీర్చుకున్నాడు… తన పలుకుబడి వల్లే పశుపతి వర్గానికి సపరేట్ గ్రూపుగా గుర్తింపు, ఎల్‌జేపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా అవకాశం దక్కాయి… మరిప్పుడు చిరాగ్ ఏం చేయాలి..? వారసత్వం ఓ అవకాశం కాదు, ఓ పరీక్ష, ఓ బాధ్యత… చేతకాకపోతే… ఇదుగో… ఇలాగే…!!
Share this Article