ముందుగా వార్త చదవండి… అవి రెండు మామిడి చెట్లు… ఉన్నవే ఏడు కాయలు… కానీ ఆ మామిడి కాయల ఓనర్ వాటి రక్షణకు ఏకంగా ఆరు వేటకుక్కలు, నలుగురు మ్యాంగో గార్డ్స్ పెట్టాడు… కిలోకు రెండున్నర లక్షల రూపాయల ధర పలికే ఈ మామిడి పళ్ల స్పెషాలిటీయే వేరు… అత్యంత అరుదైన రకం… అందుకే వాటి రక్షణకు ఇన్ని తిప్పలు, ఇంత ఖర్చు అంటూ నిన్న చాలామంది రాశారు, ఇంకా రాస్తూనే ఉన్నారు… ఇది మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన వార్త… సదరు మామిడి కాయల ఓనర్ సంకల్ప్ పరిహార్… ఒక్కొక్కటీ 300 నుంచి 350 గ్రాముల బరువు ఉంటాయట… అంటే ఏడు కాయలూ కలిపి రెండు కిలోల దాకా… అంటే అయిదు లక్షల రూపాయల పంట..!!
నిజానికి గత ఏడాది కొన్ని కాయలు కాశాయట… అరుదైన రకం, అద్భుతమైన రుచి అని ప్రచారం జరిగి దొంగతనంగా వాటిని కోసుకుని పోయారట దుండగులు… ఈసారి కూడా పోయినవి పోగా ఈ ఏడు కాయలకు ఇక రక్షణ ఏర్పాటు చేసుకున్నాడు సంకల్ప్… అసలు ఈ మామిడి ఎంత గ్రేట్ తెలుసా..? మామూలు మామిడికి 15 రెట్లు తీపి… ఫుల్ యాంటీ యాక్సిడెంట్స్, బీటా కెరొటిన్లు, ఫోలిక్ ఆసిడ్… వాట్ నాట్… ఇది తింటే తీయని ఔషధాన్ని తిన్నట్టే… మసకబారుతున్న కంటిచూపుకు ఇది శ్రీరామరక్ష…కేన్సర్ నివారిణి… ఇలా రాసేస్తున్నారు… ఇది తింటే కరోనా పరార్ అని మాత్రం రాయడం లేదు… అక్కడికి సంతోషం… జపాన్‌లో ‘‘సూర్యుడి గుడ్లు’’ (Taiyo no Tamago) అంటారు… డైనోసార్ గుడ్ల షేప్ ఉంటయ్…
Ads
ఈ మామిడి రకం పేరు ఏమిటంటే..? మియాజాకి..! జపాన్‌లో మియాజాకి అనే ఓ కోస్తా పట్టణం ఉంది… ఆ పరిసరాల్లో ఇది ఎక్కువగా పండుతుంది కాబట్టి ఈ పేరు వచ్చింది… 1970ల నుంచే ఈ రకానికి ప్రాచుర్యం పెరిగింది… ఇప్పుడు జపాన్ మార్కెట్లలో విరివిగా దొరుకుతుంది… మామూలు యెల్లో కలర్ పెలికాన్ రకం మన దేశాల్లో బాగా ప్రసిద్ధి… కానీ ఇది రెడ్ కలర్, థిక్ రెడ్ కలర్‌లో దొరికే ఇర్విన్ రకం… ఇతర మామిడి పళ్లతో పోలిస్తే 15 శాతం వరకూ సుగర్ శాతం ఎక్కువ ఉండి, తీపి ఎక్కువ… అంతే తప్ప మరీ 15 రెట్ల తీపి కాదు… అంత తీపి ఉంటే మనిషి నాలుకకు కూడా రాసుకోలేడు… యాంటీ యాక్సిడెంట్స్, బీటా కెరొటిన్లు, ఫోలిక్ ఆసిడ్స్ గట్రా ఇతర మామిడిరకాలతో పోల్చితే ఎక్కువ… అంతే… మరి ఎందుకింత ఖరీదు..?
దాని టేస్టు అది… జపాన్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్లను బట్టి ఇండియన్ కరెన్సీలో లెక్కలు వేస్తున్నారు… మీడియా లెక్కలు… ఒకసారి 3744 డాలర్ల దాకా ధర పలికింది అనే ఒకే ఒక వాక్యాన్ని నెట్‌లో చదివి, దాన్ని ప్రస్తుత డాలర్ రేటుతో గుణించి… కిలోకు 2.7 లక్షలు అని దాని రేటును తేల్చిపారేశారు… ఖరీదైందే కానీ మరీ అంత ఖరీదు కాదు… ఇది ఒక్క జపాన్‌లోనే కాదు, చాలా చోట్లకు అమ్మకాలు సాగుతాయి ప్రతి ఏటా… నిజానికి ఈ రకం ఇండియాలో కూడా అక్కడక్కడా ఉన్నట్టుంది… లేకపోతే ఈ రకం మామిడి మొక్కల్ని ఈ దంపతులకు రైళ్లో ఎవరో అపరిచితుడు ఇవ్వడం ఏమిటి..? కాకపోతే బయటికి రాలేదు, ఈ ప్రచారం దక్కలేదు… ఈ సంకల్ప్ దంపతులు ఓసారి చెన్నైకి రైళ్లో వెళ్తుంటే అనుకోకుండా ఒకాయన పరిచయమయ్యాడు… మామిడి రకాల ప్రస్తావన వచ్చింది… చాలాసేపు మాట్లాడుకున్నారు, ఆయన రైలు దిగిపోతూ ఈ మొక్కలు ఇచ్చి, పాపల్లా పెంచుకొండి అని చెప్పి వెళ్లిపోయాడట… ఈ జంటకు ఆ రకం ఏమిటో తెలియదు, సంకల్ప్ తల్లి దామిని పేరు దీనికి పెట్టుకుని, జాగ్రత్తగా పెంచాడు…
ఇదీ కథ… ఇప్పుడు దాని విశిష్టత తెలిసొచ్చింది అంటున్నది ఈ జంట… ముంబైకి చెందిన ఓ నగల వర్తకుడు ఒక్కో కాయకు 21 వేలు ఇస్తాను అన్నాడట… ప్రచారం అలా పెరిగిపోయింది… ‘‘నో, ఈసారి అమ్మడానికి సిద్ధంగా లేం… ఈ ఏడు కాయల టెంకలనూ పాతి, కొత్త చెట్లను పెంచుతాం…’’ అంటున్నారు… ఎస్, అది గత ఏడాది నుంచే చేయాల్సింది… ఆ మొక్కల్ని తాము పెంచడమో, వేరేవాళ్లకు అమ్మడమో చేసి ఉండాల్సింది… అంటుకట్టడమో, మరో పద్ధతో విస్తీర్ణం పెరగాలి… నిజానికి ఎక్కువ వర్షపాతం, ఎక్కువ పగలు అవసరం ఈ చెట్లకు… జబల్‌పూర్‌లో పెరిగిందీ, బతికిందీ అంటే ఈరకం మామిడి మన దేశంలోనూ పెరగానికి ఆస్కారం ఉన్నట్టే కదా… మియాజాకి పేరే ఉంచనక్కర్లేదు, దామిని పేరుతోనూ చలామణీ చేయొచ్చు..!! ఈ చెట్లు పెరిగి, విరివిగా కాయలొచ్చి, మన లోకల్ రకాలతో అంటుగట్టి, ఆ హైబ్రీడ్లూ వచ్చేస్తే… అవి మన మామిడి వర్తకుల చేతుల్లో పడితే… 2.7 లక్షల రేటును కాస్తా 2700కు తీసుకొస్తారు… అది మాత్రం గ్యారంటీ…!!
Share this Article