ఈ భూమి అన్ని జీవులదీ…. కాదు అంటాడు మనిషి… ఇది నాదే… అక్కరకొచ్చేవి, నా పంటికిందకు వచ్చే జంతువులు నా చెరువుల్లో, నా ఫారాల్లో, నా దొడ్లలో మాత్రమే పెరగాలి… క్రూర జంతువులు సైతం కూర జంతువులు కావాలి అంటాడు… అడవులు నరికేస్తూ ఉన్నాడు… ఈ మనిషి, ఇతర ప్రాణుల ఘర్షణ చూస్తూనే ఉన్నాం… చివరకు మనిషి తన తోటి ఆడమనిషిని సైతం సహించడు… అది (అవును, అదే) పక్కకొచ్చే పనికి కావాలి, ప్రతి పనికీ కావాలి, తనకు దీటుగా నిలబడితే సహించేది లేదు… ఈ విశ్వం, జీవం ఏదైనా సరే కేవలం మగమనిషి కోసమే అంటాడు… ఇదీ ఓ ఘర్షణే… బాలీవుడ్ ఆడపులి విద్యాబాలన్ నటించిన షేర్ని సినిమా ఇవేకాదు, ఇంకా చాలా చర్చిస్తుంది… నో, నో… చర్చించదు, అది అభిప్రాయాలు చెప్పదు… కథ చెబుతుంది… దట్టమైన అడవుల్లోకి తీసుకెళ్లి, వెన్నులో చలిపుట్టించే రాత్రిళ్లను, భయాల్ని… ఆకుపచ్చటి ఉషోదయాల్ని, ప్రకృతి సోయగాల్ని… జీవజాలం ఉనికిపాట్లను… వాటి జీవశబ్దాల్ని… మనకు చూపిస్తుంది, వినిపిస్తుంది… అంతే… అవును, కథ చెప్పడం వరకే కథకుడి బాధ్యత… అభిప్రాయం, బాష్యం, అర్థం చేసుకోవడం ప్రేక్షకుడి బాధ్యత… వాడి విజ్ఞత…
ఈ షేర్ని కథలోకి వెళ్లే ముందు ఇంకో కథ చెప్పుకోవాలి మనం… ఆల్రెడీ మనం ‘ముచ్చట’లో చెప్పుకున్నాం… మధ్యప్రదేశ్ అడవుల్లో ఈ సినిమా షూటింగు చేసుకునేటప్పుడు… ఓ ఆటవిక మంత్రికి, అవును, ఆటవికమంత్రే… పేరు విజయ్ షా… ఈ ఆడపులి విద్యాబాలన్‌పై మనసైంది… డర్టీ పిక్చర్ సినిమా ఎన్నిసార్లు చూశాడో… అసలే మంత్రి… అధికారం తలకెక్కి, ఆటవికలక్షణం ప్రకోపిస్తూ ఉంటుంది కదా సహజంగానే… తనకు సంబంధించిన శాఖ… ఇంకేముంది..? అప్పటికి కరోనాకు ముందు కొంత సినిమా తీశారు, కరోనా వచ్చిపడి కొన్నాళ్లు ఆపేశారు… తిరిగి పర్మిషన్ తీసుకుని షూటింగు ప్రారంభించే సమయానికి మంత్రికి బాలాఘాట్ అడవుల్లో తీస్తున్న ఈ సినిమా గుర్తొచ్చింది, అందులోని విద్యాబాలన్ గుర్తొచ్చింది…
Ads
బాలాఘాట్ వెళ్లాడు… డిన్నర్‌కు పిలిచాడు ఆమెను… సరదాగానో పిలిచాడో, సరసానికే పిలిచాడో… ఆమె అసలే విద్యాబాలన్ కదా, ఫోఫోవోయ్, నువ్వు అటవీ మంత్రివి అయితే నాకేంటి..? ఈ అడవులకు రాజువయితే నాకేంటి..? అనుకుని బ్లంటుగా రెఫ్యూజ్ చేసిపారేసింది… శెభాష్.., కానీ ఎంకి పెళ్లి సుబ్బి చావుకొస్తుంది కదా… మంత్రికి కోపమొచ్చింది… అటవీ అధికారులను పిలిచి బండబూతులు తిట్టాడు… వాళ్లు తెల్లవారే సినిమా షూటింగ్ వ్యాన్లను అడవుల్లోకి పోనివ్వలేదు… ఇదేమిటయ్యా, అనుమతి తీసుకున్నాం కదా అంటే… జస్ట్, రెండు వాహనాలను మాత్రమే లోపలకు అనుమతిస్తాం అని బాలాఘాట్ జిల్లా అటవీ శాఖాధికారి తేల్చిచెప్పేశాడు… వాడూ మంత్రిచాటు అధికారి కదా… రెండు వాహనాల్లో వెళ్లి షూటింగ్ ఎలా..? దీంతో షూటింగ్ ఆగిపోయింది… వీళ్లు అడవుల్లోకి వెళ్లనివ్వరు… అంతా గందరగోళం… ఇది కాస్తా రచ్చరచ్చ అయ్యింది… పత్రికల్లో వార్తలొచ్చాయి… అసలే మహిళాగౌరవం, మన్ననా, మన్నూమశానం అంటారు కదా మీ బీజేపీ వాళ్లు, మరి ఇదేమిటి సారూ అంటూ కొందరు విలేఖరులు ఆయన్ని పట్టుకుని కడిగేశారు, సారీ, అడిగేశారు… కానీ తను రాజకీయ నాయకుడు కదా…
‘అబ్బెబ్బే… మీరంతా తప్పులో కాలేశారోయ్… నిజానికి నేను బాలాఘాట్ వచ్చానని తెలిసి… ఎవరైతే షూటింగులకు అటవీ అనుమతులు తీసుకున్నారో వాళ్లే నన్ను రాత్రి విందుకు గానీ, మధ్యాహ్నభోజనానికి గానీ రమ్మని ఆహ్వానించారు… నేనేమో మస్తు బిజీ, మీకు తెలుసు కదా… ఇప్పుడు కాదు లేవోయ్, మహారాష్ట్రకు వచ్చినప్పుడు కలుస్తానులే అన్నాను… ఇందులో ఆమె నా ఆహ్వానాన్ని తిరస్కరించడం మాటేముంది..?’ అని ప్లేటు మార్చేశాడు… ప్చ్… సినిమా వాళ్ల కష్టాలు నిజంగా సినిమా కష్టాలే సుమీ… అవును మరి, ఆడపులి అయితేనేం..? సివంగి అయితేనేం..? అది పిలిచినప్పుడు పక్కకు రావాలి, పక్కలోకి రావాలి అనే టైపు… మనిషే కదా… మనమనిషి… పైగా అధికారం రుచిమరిగిన మ్యాన్ ఈటర్… సారీ, వుమన్ ఈటర్…
ఈ షేర్ని సినిమా ఇలాంటి మగమనుషుల తీరును, అవినీతి అధికారుల తీరును, వేటకు ప్రసిద్ధులై జీవకారుణ్యవేత్తలుగా ప్రచారం పొందే లీడర్లను, లింగవివక్ష చూపే మగసిబ్బందిని, అత్తింటి వివక్షను, మన వ్యవస్థ దిక్కుమాలిన పయనాన్ని గట్రా చాలా చూపిస్తుంది… అవన్నీ తట్టుకుని నిలబడే ఓ కథానాయికనూ చూస్తాం… అంతేకాదు, అడవి మీద ఆధారపడిన జీవాల్ని, జీవుల్ని… వాటికి మనుషుల నుంచి ముప్పుని కూడా చూపిస్తుంది… చూడాలి… ఆమధ్య న్యూటన్ అనే సినిమా తీశాడు కదా, అమిత్ మాసర్కర్… ఆయనే తీశాడు ఇది కూడా… ‘‘పులి ఉంటేనే అడవి, అడవి ఉంటేనే వాన, వాన ఉంటేనే నీరు, నీరుంటేనే మనం’’ ‘‘నువ్వు పులి వేట కోసం వెళ్లినప్పుడు… నువ్వు దాన్ని చూసేలోపు అది నిన్ను 99సార్లు చూసి ఉంటుంది…’’ వావ్, ఏం డైలాగులు…
అప్పట్లో అవని అనే ఆడపులి కథ గుర్తుందా..? 13 మందిని చంపేసింది… తినేసింది, మానవభక్షకిగా మారింది… అని ప్రచారం చేశారు… 2018లో కాల్చి చంపారు… మహారాష్ట్రలో, యావత్మాల్లో జరిగిన కథ… చంపింది కూడా ఎవరో కాదు, మన హైదరాబాదీ లైసెన్సుడ్ షూటర్ నవాజ్ షఫత్ఖాన్ కొడుకు అస్ఘర్ అలీ ఖాన్… మరి దాని రెండు పిల్లలు ఏమయ్యాయ్..? సుప్రీం దాకా వెళ్లిన ఈ పులి కథ ఏమైంది..? అదంతా చెబితే ఇక్కడ కథ ఒడవదు, తెగదు… కానీ దాని కథనే మెయిన్ లైన్‌గా తీసుకుని, దాన్ని భిన్నాంశాలతో తను క్రియేటివ్‌గా డెవలప్ చేసుకున్నాడు దర్శకుడు…
కానీ ఓ ఆడపులిని మనిషి వేటాడే కథే ఇది కూడా… దాని చుట్టూ అనేకానేక సమాజపు అవకరాల తీరును గుదిగుచ్చి చూపిస్తాడు దర్శకుడు మనకు… కథకు తగ్గ ప్రయాస కనిపిస్తుంది… నిజానికి ఓటీటీల్లో… అమెజాన్‌లో వచ్చిపడింది గానీ… ఈ సీన్లను, ఈ సౌండ్స్‌ను ఫీల్ కావాలంటే పెద్ద థియేటరే బెటర్… ఇక నటులు అంటారా..? విద్యాబాలనే రియల్ షేర్ని… ఆమెకు మనం కొత్తగా సర్టిఫికెట్ ఇచ్చేదేముంది..? సోకాల్డ్, బాలీవుడ్ మగపులులు, సింహాలు కూడా ఆప్టరాల్…!!
Share this Article