మొన్నమొన్ననే కదా మనం ముచ్చటించుకున్నది… ధనుష్ నటించిన జగమే తంత్రం సినిమాను ఏకంగా 17 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు… అందులో విదేశీ భాషలూ ఉన్నయ్… నువ్వు గొప్పోడివిరా బాబూ అని చప్పట్లు కొట్టి హుషారు పెంచుకున్నమ్ కదా… ఫుల్లు గాలి నింపిన బెలూన్‌కు పిన్నీసుతో పొక్కకొట్టినట్టు… తుస్సుమనిపించాడు… ఇదేం సినిమారా నాయనా అని ఈసడింపుగా చూసేట్టు చేసుకున్నాడు… ఈ సినిమా సంగతి ముందే తెలుసు నిర్మాతకు, దర్శకుడికి, హీరోకు… అందుకే ధనుష్ పేరు చెప్పి, ఈమధ్య ఆయనకు వచ్చిన మరింత పాపులారిటీని చూపించి 55 కోట్లకు అమ్మేశారు పాపం నెట్‌ఫ్లిక్స్ వాడికి… థియేటర్లలో రిలీజ్ చేయలేదు కాబట్టి బోలెడు మంది బయ్యర్లు బతికిపోయారు… ఓటీటీ వాడు వ్యూస్ సంఖ్య కూడా చెప్పుకోడు కాబట్టి ధనుష్ పరువు దక్కినట్టే…
సినిమాటోగ్రఫీ బాగుందా..? ఎడిటింగ్ బాగుందా..? సంగీతం బాగుందా..? వాడి చొక్కా బాగుందా..? హీరోయిన్ కలర్ బాగుందా..? విలనీ పండిందా వంటి కోణాల్లో రివ్యూ కూడా వేస్ట్… అసలు బేసిక్‌గా వంటకు వాడిన ఇంగ్రెడియెంట్సే కరెక్టు కాదు… ఇక ఏం మసాలాలు ఉంటే ఎంత..? లేకపోతే ఎంత..? ధనుష్ మంచి నటుడు, కొత్తగా ఎవరూ తనకు సర్టిఫికెట్టు ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఇందులో నటించడానికి ఏముందని..? సీన్లన్నీ అతి అరవ మార్క్ బిల్డప్పులే… తమిళ సినిమా అంటేనే కాస్త హీరో బిల్డప్పులు ఎక్కువ అని తెలుసు కానీ, మరీ ఈ రేంజ్..?! ఈ దర్శకుడిని ఇకపై ధనుష్ దూరం పెట్టడం తన కెరీర్‌కే బెటర్…
Ads
అసలు గ్యాంగ్స్టర్ల సినిమాలు ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో కొత్త కాదు, అసలు ప్రపంచ సినిమాలోనే కొత్త కాదు… అది యూనివర్శల్ సబ్జెక్టు… రక్తి కట్టించే తెలివి ఉండాలే గానీ అది ఎప్పుడూ పనికొచ్చే సబ్జెక్టే… కాకపోతే కొత్తగా చెప్పగలగాలి… లండన్‌లోని తమిళ శరణార్థులకూ గ్యాంగ్స్టర్లకూ లంకె వేసి, ఏదో తమిళ ఎమోషన్ పండించాలనుకున్నాడు దర్శకుడు… అబ్బే.., శరణార్థుల గురించి, బైకోర్ చట్టం గురించి చెబుతాడు గానీ అది వేరే భాషల్లోని ప్రేక్షకులకు ఏం ఆసక్తి..? పోనీ, గ్యాంగ్స్టర్ల గురించి ఏమైనా ఆసక్తికరంగా చెప్పాడా అంటే అదీ లేదు… లండన్‌ను శాసించే ఓ డాన్‌కు తన ప్రత్యర్థిని లేపేయడానికి ఓ తమిళ వీథి రౌడీ కమ్ పరోటా మాస్టర్ మాత్రమే దొరికాడట..? ఆ ప్రత్యర్థి గుట్టుమట్లన్నీ ఇట్టే తెలుసుకునే హీరోకు ఆ విలన్ బ్యాక్ గ్రౌండ్ మాత్రం తెలియదుట అదేమిటో… పైగా కాలం చెల్లిన స్మగ్లింగ్ పద్ధతులు, లాజిక్ రాహిత్యాలు చూపిస్తూ నానా కంగాళీ చేసేశాడు దర్శకుడు… రాజీ చర్చలకు పిలిచి, రివాల్వర్లు దాచి కాల్చడం సీన్ చూశాక దర్శకుడు, నిర్మాత, హీరోల మీద జాయింట్ సానుభూతి పొంగుకొస్తుంది ప్రేక్షకుడికి…
మధ్యలో హీరోయిన్… ఐశ్యర్య లెక్ష్మి… ఉందాలేదా అన్నట్టుండే ఓ పాత్ర… పేరుకు ఎనిమిది పాటలన్నారు… నెట్‌ఫ్లిక్స్ వాడు వద్దనగానే రెండు కట్ చేసేశారు… మిగిలిన వాటిల్లో ఒక్కటంటే ఒక్కటి చెవుల్లోకి ఎక్కితే ఒట్టు… ఎడిటింగూ అంతే… యాక్షన్ సీన్లు, హీరో అతి బిల్డప్పులతోనే కథంతా నడిపించేశాడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు… పేలవమైన కథాకథనాలతో సాగిన ఈ సినిమాకు ప్రధానబలం ధనుష్… పాపం, తను కూడా చివరకు చేతులెత్తేశాడు… ధనుష్ అనగానే కర్ణన్, అసురన్ గట్రా ఊహించుకోవద్దు… ఇదుగో ఈ జగమే తందిరం అలియాస్ జగమే తంత్రం బాపతు సినిమాలు కూడా ఉంటయ్… ఇంతకుమించి రాసుకోవడం, చదువుకోవడం కూడా ఈ సినిమా చూసినంత పాపం, నేరం… ఇక ఆపేద్దాం…!!
Share this Article