కాంగ్రెస్ పార్టీతో ఏదీ సజావుగా ఉండదు… ఏదైనా పెద్ద పార్టీకి తోకగా ఉంటే… అంటే తమిళనాడు తరహాలో… పెద్ద ప్రాబ్లం ఉండదు, అందరూ అన్నీ మూసుకుని కూర్చుంటారు… కానీ తమ మద్దతు మీద ఆధారపడిన ప్రభుత్వం ఉంటే మాత్రం, ఎప్పుడూ కెలకడమే పని…! ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అంతే… శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వం కదా… కాంగ్రెస్ మద్దతు లేకపోతే ఆ ప్రభుత్వం లేదు… మొన్నీమధ్య సీఎం ఠాక్రే వెళ్లి మోడీని కలిసివచ్చాడు… ఆంతరంగిక భేటీ… వెంటనే పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌట్ భాష మారిపోయింది… మోడీ, బీజేపీ అంటే కొంతకాలంగా పరుషవ్యాఖ్యలతో చెలరేగిపోతున్న రౌట్ నేల మీదకు దిగివచ్చాడు వెంటనే… ఇంకోవైపు వచ్చే ఎన్నికల్లో ఎన్సీపీతో కలిసి పోటీచేస్తామని శివసేనవర్గాలు వ్యాఖ్యానాలకు దిగుతున్నయ్… అంటే మా పని మక్కీచూజేనా అనుకున్న కాంగ్రెస్కు చుర్రుమంది… పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోల్ మా పార్టీ ఒంటరిగానే ఎన్నికలకు పోతుందన్నాడు… ముంబై పార్టీ చీఫ్ వచ్చే ముంబై నగరపాలిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తామని ప్రకటించాడు…
అది అసలే శివసేన… దాని రాజకీయాల పద్ధతే వేరు… రౌట్ భాషలోనే చెప్పాలంటే గూండాల పద్థతి… కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమెంత..? ఈ నీలుగుడు ఏంటి అనుకున్నట్టున్నారు… శివసేన నుంచి కౌంటర్స్ స్టార్టయ్యాయి… సెకండ్ కేడర్ కాదు, ఏకంగా ఠాక్రేయే పార్టీ 55వ వార్షికోత్సవం సందర్భంగా మాట్లాడుతూ… కాంగ్రస్ పార్టీని ఉద్దేశించి పరోక్షంగా… ‘‘ఎప్పుడూ రాజకీయాలే మాట్లాడితే జనం చెప్పులతో కొడతారు… జనానికి మనం ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించకుండా ఎంతసేపూ పాలిటిక్సేనా..?’’ అని తీవ్ర వ్యాఖ్య చేశాడు… అరె పోరా భయ్, ఈ సర్కారులో ఉంటే ఉండు, పోతేపో అన్నట్టుగా ఉంది… వెంటనే సామ్నా పత్రిక, దాని ప్రతినిధి రౌట్ కూడా కాంగ్రెస్ నేతలనుద్దేశించి వెటకారాలకు దిగాయి/ దిగారు…
Ads
అప్పుడే అయిపోలేదు… ఈ కాంగ్రెస్, ఈ ఎన్సీపీ మన పార్టీని దెబ్బతీస్తున్నాయి, వెంటనే బీజేపీతో కలవడం మంచిది అంటూ ఓ శివసేన ఎమ్మెల్యే లేఖ రాశాడు… ED బాధితుడు ఆయన… ఇప్పుడు అదీ చర్చనీయాంశమైంది… వద్దూ, వద్దూ ఠాక్రే, త్వరపడకు, అయిదేళ్లూ కలిసి ఉంటామని మాట ఇచ్చావ్, మాట తప్పకు అంటూ శరద్ పవార్ సర్దుబాట్లకు ప్రయత్నిస్తున్నాడు… కానీ శివసేన, కాంగ్రెస్ నడుమ కయ్యం పెరుగుతున్నట్టే కనిపిస్తోంది… ఇది క్రమేపీ ‘మహావికాస్ అవధి’ సంకీర్ణ ప్రభుత్వ పతనం వైపు దారితీయబోతోందా..? ఈ చర్చ సాగుతోంది రాష్ట్రంలో..! ‘ఏదేమైనా సరే, మహారాష్ట్ర సీఎం పోస్టు శివసేనదే…’’ అంటున్నాడు తాజాగా రౌట్… అకస్మాత్తుగా ఈ వ్యాఖ్యలు ఎందుకొస్తున్నాయి..? అంటే… ఒకవేళ బీజేపీ గనుక ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి గ్యారంటీ ఇస్తే… ఎన్సీపీని, కాంగ్రెస్ను అరేబియా సముద్రంలోకి విసిరేసి… బీజేపీతో మళ్లీ కలిసిపోవడానికి రెడీ అనే సంకేతాలు ఇస్తున్నట్టా..? మొత్తానికి ఏదో జరుగుతోంది..! కానీ ఓ డౌటు… కాంగ్రెస్ ఏదో అలా పైపైన ఝలక్కులు ఇస్తుంది తప్ప అధికారాన్ని వదలదు, సో, ఠాక్రే ‘చెప్పు దెబ్బల’ వ్యాఖ్యలతో సైలెంట్ అయిపోతుందా..?!
Share this Article