డ్రగ్ మాఫియాలు, వేక్సిన్ మాఫియాలు, కార్పొరేట్ హాస్పిటళ్లు… వాటికి డప్పు కొట్టే పాలసీలు, బ్యూరోక్రాట్లు… ఆర్టీపీసీఆర్ పరీక్ష దగ్గర్నుంచి చితిపై పేర్చేదాకా… మనుషుల ప్రాణాలతో సాగుతున్న దందా మొత్తం మానవత్వం మీదే విశ్వాసాన్ని చంపేస్తున్న వేళ… ఈ దుర్మార్గపు, దుర్గంధపు వాతావరణంలోనూ… కొందరు నిశ్శబ్దంగా కారుణ్యానికీ, ఔదార్యానికీ కొత్త ఎత్తులు చూపిస్తున్నారు… ఈ కరోనా విపత్తులో తమ హృదయాలు సంపూర్ణంగా తెరిచి ఆకాశమంత ప్రేమను పంచుతున్నారు… వినమ్రంగా ప్రణమిల్లడం తప్ప మనం ఇంకేం చేయగలం..? అది ఒక రతన్ టాటా కావచ్చు… ఒక అజీం ప్రేమ్‌జీ కావచ్చు..! కోవిడ్‌పై పోరాటానికి 1125 కోట్లను, మీరు చదివింది నిజమే… 1125 కోట్లను ఖర్చు చేయనున్నట్టు ప్రకటించిన అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఇప్పుడు దాన్ని మరో 1000 కోట్లు పెంచి, మొత్తం 2125 కోట్లుగా ప్రకటించింది… అక్షరాలా రెండువేల కోట్లకుపైగా… ఏటేటా ధనికుల టాప్ జాబితాల్లో పేర్లు చూసుకుని మురిసిపోయే ఘనులంతా ఎక్కడ పోయార్రా బాబులూ…
‘‘కరోనాపై పోరాటం దిశలో మరిన్ని నిధులు అవసరమని గుర్తించాం… అందుకే కేటాయింపుల్ని పెంచాం… దాదాపు పది రాష్ట్రాల్లో వేక్సినేషన్‌కు సపోర్ట్ చేస్తాం… నిజంగానే ఈ కష్టకాలంలో ప్రజలకు అవసరమైతే ఈ కేటాయింపుల్ని మరింత పెంచడానికి కూడా మేం సిద్ధంగా ఉన్నాం..’’ అని ఫౌండేషన్ ప్రతినిధులు ప్రకటించారు… ‘‘వేక్సినేషన్ పట్ల జనాన్ని చైతన్యపరచాలి, వాళ్లలో భయాన్ని తొలగించాలి, వేక్సిన్లు వేయించాలి, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, కర్నాటక, పుదుచ్చేరి, తెలంగాణ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో కరోనాపై పోరాటం కష్టంగా ఉన్న దాదాపు 100 జిల్లాల్లోని 15 కోట్ల మందికి ఈ సేవలు విస్తృతంగా అందాల్సి ఉంది, ఈ పాండెమిక్ వాతావరణమే కాదు, శాశ్వతంగా జనానికి ఉపయోగపడే వైద్య సౌకర్యాల గురించీ ఆలోచించాలి’’ అంటోంది ఫౌండేషన్…
Ads
కరోనా టెస్టింగు, శాంపిల్ కలెక్షన్స్, చికిత్స సౌకర్యాల మీద దృష్టి పెట్టిన ఫౌండేషన్ ఇప్పటివరకూ 10 వేల ఆక్సిజనేటెడ్ బెడ్స్, 1000 ఐసీయూ బెడ్స్, 18 పీఎస్ఏ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్, 10 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, 80 వెంటిలేటర్లు, 300 Bi-PAP మెషిన్లు, 600 High Flow Nasal Cannulas (HFNC) సమకూర్చడమే కాదు, హాస్పిటల్ పైపింగు, సిలిండర్లు వంటి ఐసీయూ అవసరమైన ఎక్విప్‌మెంట్‌నూ సమకూర్చింది… రెండు లక్షల పీపీఈ కిట్స్, 50 వేల పల్స్ ఆక్సీమీటర్లు అదనం… ఈ అంకెలు చూస్తేనే తెలుస్తోందిగా ఈ ఫౌండేషన్ ఎంతగా కరోనాపై పోరులో ఎఫర్ట్ పెడుతున్నదో..! ఎంత తేడా..? కరోనా దందాలతో వేలకువేల కోట్లు దండుకుంటున్న కంపెనీలు ఒకవైపు… సంపాదించిన సొమ్ములో వేల కోట్లను కరోనా బాధితుల కోసం వెచ్చిస్తున్న కంపెనీలు మరోవైపు…! హేట్సాఫ్ అజీం హషీం ప్రేమ్‌జీ…!!
Share this Article