.
ట్రంపరితనం అందరికీ తెలిసిందే కదా… ఎవరినైనా సరే బజారుకులాగి పంచాయితీ పెట్టుకుంటాడు… అదెక్కడిదాకా వెళ్లిందంటే నేనే దేవుడిని అనే అర్థమొచ్చేలా తనే ఓ గ్రాఫిక్ ఇమేజ్ క్రియేట్ చేసి, తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం మీద పోస్ట్ చేసుకునేంత… సకల క్రైస్తవ ప్రపంచం ఆరాధించే పోప్ ఎంపికను కూడా కించపరిచేంత… బహుశా ఇలాంటి కేరక్టర్‌ను ప్రపంచం మళ్లీ చూడలేదేమో…
మాట్లాడితే సుంకాలు అంటాడు, స్వాధీనం అంటాడు, యుద్ధం అంటాడు… నిత్యకలకలం, విశ్వకలవరం… ఇదీ తనకు సరిగ్గా సరిపోయే మాట… తాజాగా ఏమిటంంటే..,? ఆధ్యాత్మిక కేంద్రం వాటికన్ వర్సెస్ వైట్ హౌస్… పచ్చగడ్డి వేస్తే భగ్గు…. వివాదం ఎక్కడ మొదలైందంటే..?
Ads
ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు వైఖరిని పోప్ లియో XIV తీవ్రంగా ఖండించారు. తాను ఎవరికీ, ముఖ్యంగా ట్రంప్ నిర్ణయాలకు తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడి సందేశాలను, మతాన్ని వాడుకుంటూ యుద్ధాలు చేయడం అత్యంత విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “దేవుడి పేరుతో వేలాది మంది అమాయకులను బలి తీసుకోవడం ఆపండి” అంటూ ట్రంపు నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. శాంతి కోసం తన గళం ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటానని, యుద్ధం ఏ సమస్యకూ పరి ష్కారం కాదని పోప్ పునరుద్ఘాటించారు.
ట్రంపు కదా, మండిపోయింది… తన మాటల్ని, తన ధోరణుల్ని ఎవరు వ్యతిరేకించినా సహించడు, చివరకు పోప్ అయినా సరే, దేవుడైనా సరే… అందుకే వెంటనే రియాక్టయ్యాడు… తన ‘ట్రూత్ సోషల్ ‘ వేదికగా విరుచుకుపడ్డాడు… అమెరికా విదేశాంగ విధానంలో జోక్యం చేసుకునే అధికారం పోప్‌కు లేదని ఆయన మండిపడ్డాడు…
“నేను భారీ మె జారిటీతో ప్రజలచే ఎన్నుకోబడిన అధ్యక్షుడిని. నా దేశ భద్రత కోసం నేను తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించే అర్హత ఎవరికీ లేదు” అని ట్రంప్ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు… అక్కడితో ఆగలేదు… ఆగితే ట్రంప్ ఎలా అవుతాడు మరి..? పోప్ లియో ఎన్నికపై కూడా ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు…
పోప్ పదవి కోసం సిద్దం చేసిన జాబితాలో అసలు లియో పేరే లేదని, ఆయన ఎంపిక ఒక “షాకింగ్ సర్ప్రైజ్” అని ఎద్దేవా చేశాడు… పోప్ పదవి దక్కినందుకు ఆయన కృతజ్ఞతతో ఉండాలి తప్ప, తనపై విమర్శలు చేయడం సరికాదని, తన జోలికి రావద్దని ట్రంప్ వ్యాఖ్యానించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ వర్గాల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది…
ప్రస్తుతం అమెరికా- ఇరాన్ చర్చలు విఫలమవ్వడం, హర్మూజ్ జలసంధి దిగ్బంధనం,, యుద్ధవ్యయం, మొహం చాటేస్తున్న మిత్రదేశాలు, స్వదేశంలో ప్రజావ్యతిరేకత వంటి అనేక పరిణామాల మధ్య సైతం ట్రంప్ స్థిరంగా తను అనుకున్న దారిలో వెళ్తున్నాడు మొండిగా… చివరకు మత ప్రముఖులు చెప్పినా సరే, వినకుండా..! ఆధ్యాత్మిక ధర్మవ్యాప్తి వేరు, పాలన అవసరాలు- విధానాలు వేరు అని ట్రంప్ ఓ గీత గీశాడు… ఇంట్రస్టింగ్..!!
- ఇరాన్ వార్‌ను ఓ కొలిక్కి తీసుకురావడం… అంటే పరోక్షంగా చైనా, రష్యాలను ఓడించడం… అమెరికా ఆర్థిక ఆధిపత్యాన్ని నిలబెట్టడం నుంచి ఇంకొన్ని చిన్న దేశాల ఆక్రమణ దాకా ట్రంపు జాబితాలో చాలా పనులున్నాయి… ఈ మార్గంలో ఎవరేమన్నా సహించేట్టు లేడు, ఆగేట్టు అసలే లేడు..!!
Share this Article