ముందుగా చిన్న డౌట్… యాంటీ మోడీ, యాంటీ బీజేపీ కూటమి అవసరమేననీ… బలమైన విపక్షం లేకపోతే ప్రజాస్వామ్యానికి బలమెక్కడిది అనీ గుర్తుచేసుకుందాం… ప్రధాని కావాలని ఎన్నేళ్లుగానో కలలు మాత్రమే కనగలుగుతున్న శరద్ పవార్ ఇంట్లో కొందరు భేటీ వేశారు… మోడీ మీద కత్తులు ఎలా తిప్పాలో మంతనాలు చేశారు… ఇది నిర్వహించింది ఎవరు..? యశ్వంత్ సిన్హా…! ఆయన ఎవరు..? మోడీ వీరవ్యతిరేకుడు..! ఆయనకు ఎందుకు కోపం..? మోడీ పవర్‌లోకి రాగానే ఈయన్ని అద్వానీ తదితరులతోపాటు అమాంతం అటకమీద పారేశాడు కాబట్టి…! నాటి నుంచీ కుతకుత ఉడికిపోతూనే ఉన్నాడు… రాష్ట్రమంచ్ అని ఓ దుకాణం తెరిచాడు… ఉసికెముడికి పెండముడి అన్నట్టు ఈమధ్య మరో వైరస్ ప్రశాంత్ కిషోర్ కలిశాడు… పవార్‌ను ఉబ్బేశారు, నువ్వే ప్రధానివి, కనీసం రాష్ట్రపతివి అన్నారు… బోలెడుమందిని పిలిచారు… ఇలా మీటింగు పెట్టారు… ఆహ్వానాలు వెళ్లింది రాష్ట్రమంచ్ పేరిట… కానీ యశ్వంత్ ఇప్పుడు టీఎంసీలో ఉన్నాడు… మరి ఈ భేటీ మమత ఆశీస్సులు ఉన్నట్టేనా..? లేక పార్టీలోనే ఉంటూ ఇలా వేర్వేరు భేటీలు వేసుకోవడానికి దయతో యశ్వంతుడికి అనుమతి ఇచ్చిందా..? ఒకవేళ మమత మద్దతు ఉన్నట్టే అయితే… ఈ సీపీఐ, ఈ సీపీఎంలతో బహిరంగంగా, అధికారికంగా కలిసి కార్యాచరణకు తన రాష్ట్రంలోనే శ్రీకారం చుడుతుందా..?
అబ్బే, ఈ థర్డ్ ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ల మీద నాకు నమ్మకం లేదు అంటున్నాడు ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే… మరి ఇప్పుడు జరిగే కసరత్తు ఏ ఫ్రంటు కోసం… కొంతకాలం అతుకుల బొంతలు ఈ దేశాన్ని పాలించి ఏం ఉద్దరించాయో చూశాం కదా… మళ్లీ ఆ దుర్దినాల్ని దేశానికి రుద్దే ప్రయత్నమా ఇది..? పోనీ, బీజేపీని దింపేయడానికి, నిలువరించడానికి ఏ ప్రయత్నమైనా స్వాగతిద్దాం అంటారా..? సరే, కానీ కాంగ్రెస్ లేకుండా యాంటీ బీజేపీ కూటమి ఏమిటి..? కేవలం ప్రాంతీయ పార్టీలతోనే కూటమి అనుకుందాం… అసలు దేశానికి సమస్యే ప్రాంతీయ, కుటుంబ పార్టీలు కదా… పోనీ, అవీ అవసరమే అనుకుంటే… జగన్, నవీన్ పట్నాయక్, స్టాలిన్, సోరెన్, దేవెగౌడ, ఠాక్రే, కేసీయార్, చంద్రబాబు వంటి ప్రాంతీయ నేతలు లేకుండా (ఎక్కువ మంది దక్షిణాది నేతలే) ఓ బలమైన నార్తరన్ కూటమి ప్రభావం చూపించగలదా..? సరే, తక్షణ అవసరాల కోసం అంటే… యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మోడీకి చుక్కలు చూపించడానికి కూటమి పెడుతున్నారూ అనుకుందాం… పంజాబ్‌లో ఎలాగూ బీజేపీ నామమాత్రం… ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బీఎస్పీని కలుపుకుని పోకుండా బీజేపీని అడ్డుకోవడం సాధ్యమేనా..?
Ads
ఓ స్థిర రాజకీయ ధోరణి, సొంత కార్యాచరణ, ఓ దిశ, ఓ దశ లేకుండా కొట్టుకుపోతున్న సీపీఐ, సీపీఎంలను వదిలేస్తే ఈ పవార్ ఇంటభేటీకి వచ్చిన వాళ్లెవరు..? ఆప్, నేషనల్ కాన్ఫరెన్స్… ఆప్ ఎప్పుడు బండి దిగిపోతుందో, ఎప్పుడు బండి ఎక్కుతుందో దానికే తెలియదు… నేషనల్ కాన్ఫరెన్స్‌కు సొంతింట్లోనే ఇప్పుడు బలం లేదు… అన్నింటికీ మించి ‘‘కాంగ్రెస్ రహిత రాజకీయాలు’’ అభిలషణీయం అయినప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ మద్దతు తీసుకుని సర్కారులో ఎందుకు ఉండాలి పవార్..? ఈ ఫెడరల్ రాజకీయాలు చేసీ చేసీ కేసీయార్, చంద్రబాబు ఎట్సెట్రా నాయకులు అన్నీ చాలించుకున్నారు… ఈ కాలం చెల్లిన పవార్, యశ్వంత్‌లతో అయ్యేదేమిటి..? అన్నింటికీ మించి సిద్ధాంతాల నడుమ పోరాటాలకు కాలం చెల్లిపోయి.., సోషల్ మీడియా పోరాటాలు, జనాన్ని మభ్యపెట్టే క్షుద్ర రాజకీయ ఎత్తుగడలతో ‘కథలు నడిపిస్తున్న’ ప్రశాంత్ కిషోరా వీళ్లకు ఇప్పుడు ఆదర్శం..? బీజేపీని అడ్డుకోవడానికి ఈ అతుకుల బొంతలు సరిపోవు, తాత్కాలికంగా క్లిక్కయినా సరే దీర్ఘకాలం నిలబడవు… ఓ బలమైన విపక్షం అంటే బలమైన మరో జాతీయ పార్టీ మాత్రమే… (ప్రస్తుతానికి)… చట్టసభల్లో ఒక్క సీటూ గెలవలేని ధీరులు సైతం ఇలాంటి భేటీల్లో కత్తులు తిప్పితే ఒరిగేదేముంది..? జనం తిరస్కరించిన శక్తులు ఎవరిని దునుమాడతాయి..? దురదృష్టవశాత్తూ చారిత్రక పార్టీ కాంగ్రెస్‌కు ఇప్పుడు దుర్దినాలు… నాయకత్వలోపం, దిశారాహిత్యం… నెహ్రూ కుటుంబం కాడికింద పడేస్తే మోసేవాడు లేడు, ఆ కుటుంబ వారసత్వం పార్టీని ఇక బతికించేట్టు లేదు… పతనావస్థ… అదే అసలైన విషాదం… మోడీకి కాలం అనుకూలిస్తోంది… అంతే..!!
Share this Article