చాలామందికి అర్థం కానిదేమిటీ అంటే..? జమ్ము కాశ్మీర్లో నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించడం ఏమిటి..?! ఆ అవసరం ఏమొచ్చింది..? నిజానికి 2026 వరకు ఎక్కడా నియోజకవర్గాల్లో మార్పులు జరగకుండా ఎన్నికల సంఘం ఫ్రీజింగు పెట్టుకుంది కదా… మరి ఇక్కడ కథేమిటి..? మీడియాలో పెద్ద పెద్ద వ్యాసాలు వస్తున్నయ్… ప్రధానంగా జాతీయ మీడియాలో..! ఒక్కసారి కాస్త సరళంగా చెప్పుకుందాం మనం… ముందుగా నిన్న మోడీ సమక్షంలో జరిగిన అఖిల పక్షం కథేమిటో చూద్దాం… ఆర్టికల్ 370 ఎత్తిపారేసినప్పుడే కేంద్రం స్పష్టంగా చెప్పింది… ప్రస్తుతానికి జమ్ము-కాశ్మీర్ మరియు లడఖ్ వేర్వేరుగా కేంద్ర పాలిత ప్రాంతాలుగానే ఉంచుతాం, పరిస్థితులు చక్కబడ్డాక జమ్ము-కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తాం అని..! సో, అందరినీ ఓసారి పిలిచి, తాను చేయదలుచుకున్నది చెప్పి, మేమయితే అందరికీ చెప్పే చేస్తున్నామహో అని ప్రకటించడమే మోడీ ప్లాన్… ఈ అఖిలపక్షానికి వచ్చిన పార్టీలు ఎలాగూ రాష్ట్ర హోదాను వ్యతిరేకించవు… వద్దన్నా కేంద్రం ఆగదు… కాకపోతే మేం ఓ డెమక్రటిక్ పంథాలో పోతున్నాం సుమా అని చెప్పడం దాని ఉద్దేశం… అంతే…
ఈ పార్టీలకు కూడా వేరే గత్యంతరం లేదు… బీజేపీ గాకుండా మిగతా పార్టీలన్నీ గుప్కార్ కూటమిగా ఏర్పడ్డాయి… మొన్న డీడీసీ (డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్స్) ఎన్నికల్లోనూ నిలబడ్డయ్… రేప్పొద్దున అసెంబ్లీకి ఎన్నికలు జరిగినా పోటీచేస్తయ్… కాకపోతే గుప్కార్ కూటమిగా పోటీచేయడం సందేహమే… ఎందుకంటే అధికారం సొంతం చేసుకోవడం మీద ఎవరి ఆశలు వాళ్లకు విడివిడిగా ఉంటయ్… వీళ్లు వ్యతిరేకించినా, అంగీకరించినా కేంద్రం తన ప్లాన్ ప్రకారమే పోతుంది, మేం చెప్పినట్టు చేయకపోయినా సరే… ‘ఐననూ పోయిరావలె హస్తినకు’ అనే పద్ధతిలో వచ్చారు, వెళ్లిపోయారు… ఆర్టికల్ 370 పునరుద్ధరించాలి అని మరోసారి డిమాండ్ మోడీ ఎదుట పెట్టేశారు… అది రాజకీయంగా వాళ్లకు ఎలాగూ తప్పదు… బీజేపీ దాన్ని అత్యంత సహజంగా తిరస్కరిస్తుంది, అది వేరే కథ… ఒకవేళ బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ రాబోయే రోజుల్లో ఓ అతుకుల బొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా సరే, 370 ఆర్టికల్ పునరుద్ధరించాలని అనుకున్నా సరే, బీజేపీ వ్యతిరేకిస్తుంది, అడ్డుకుంటుంది, అడ్డుకోలేకపోతే దానికి ఇంకా నయం, ఎమోషన్స్ రెచ్చగొట్టడానికి మళ్లీ ఓ అంశం దొరుకుతుంది దానికి…
Ads
ఇక ఈ సీట్ల మార్పు విషయానికి వస్తే… లోకసభ సీట్లకు సంబంధించి మార్పులు చేర్పులు దేశం మొత్తమ్మీద చేసినప్పుడే జమ్ము-కాశ్మీర్లో కూడా చేశారు, అది కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనిది కాబట్టి..! కానీ అసెంబ్లీ సీట్లకు సంబంధించి అలా కుదరదు… ఎందుకంటే..? మొన్నమొన్నటి దాకా జమ్ము-కాశ్మీర్‌కు సపరేటుగా వేరే రాజ్యంగం, వేరే ప్రజాప్రాతినిధ్యచట్టం ఉన్నాయి కాబట్టి, సపరేటుగా ఓ కమిషన్ వేసి, చేయాల్సి ఉంటుంది… 1963, 1973, 1995 సంవత్సరాల్లో అలాగే చేశారు… కానీ మార్పులు చేర్పులకు బేస్‌గా తీసుకునే జనాభా లెక్కల సేకరణ ఆగిపోయింది రాష్ట్రంలో… దాంతో ఈ పునర్వ్యవస్థీకరణ కూడా ఆగిపోయింది… ఆర్టికల్ 370 ఎత్తేసినప్పుడు కేంద్రం రాష్ట్ర హోదాను ఇచ్చేముందే ఈ పునర్వ్యవస్థీకరణ కూడా చేస్తామని, అసెంబ్లీ సీట్ల సంఖ్యను కూడా 107 నుంచి 114కు పెంచుతామని చెప్పింది… ఓ కమిషన్ కూడా వేసింది… కానీ కరోనా కారణంగా పని చురుకుగా సాగలేదు… ఇంకా ఆ పని పూర్తికాలేదు… అయితే ఇక్కడ మరో విశేషం ఉందండోయ్…
పేరుకే 111 సీట్లు అక్కడ… నిజానికి ఎఫెక్టివ్ సీట్లు 87 మాత్రమే… ఎందుకంటే..? లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేశారు కదా, అక్కడి నాలుగు సీట్లు ఎగిరిపోయాయ్… మిగిలింది 107… అందులో కాశ్మీర్ 46, జమ్ము 37… మరి మిగతా 24 ఏమిటి అంటారా..? మన ఆధీనంలోని లేనిదీ, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోనివి… ఎప్పుడూ అది భారతదేశంలోని భాగమే అనేది మన విధానం కాబట్టి ఆ 24 సీట్లు అలా కాగితాల్లో ఉంటయ్… నవ్వకండి, కల్లోలిత ప్రాంతాల రాజకీయాలు అలాగే ఉంటయ్… ఇప్పుడు జమ్ములో 7 సీట్లు పెంచుతారు… జమ్ములో హిందువుల సంఖ్య ఎక్కువ, కాశ్మీర్లో ముస్లింల సంఖ్య ఎక్కువ కాబట్టి కాస్త బ్యాలెన్స్ చేస్తున్నారన్నమాట… అది బీజేపీ పొలిటికల్ స్ట్రాటజీ… మరి తరువాత ఏమిటి..? సరైన సమయం చూసి, రాష్ట్ర హోదా ఇచ్చేస్తారు, ఎన్నికలు నిర్వహిస్తారు… ఎవరు అధికారంలోకి వస్తేనేం..? దేశంలోని అన్ని రాష్ట్రాల్లాగే అదీ ఓ రాష్ట్రం… అక్కడ కేంద్ర ప్రతినిధి గవర్నర్ ఉంటాడు… ఆ ప్రాంతంపై వంద శాతం సార్వభౌమాధికారం ఢిల్లీదే…!!
Share this Article