ఒక గొప్ప అవకాశం… నెత్తుటిచుక్క చిందకుండా… ప్రజాస్వామిక, గాంధేయ పద్ధతుల్లో సాధించిన ఓ ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ… కేసీయార్ శుక్రమహర్దశో, కాలానుగ్రహమో… తనే దీన్ని సాధించాడనే పేరొచ్చింది… తన జీవితానికి ఇంకేం కావాలి..? ఉద్యమవేళ ఏం చేశాడో వదిలేస్తే, ఒక మహానేతగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే బంగారు అవకాశం… కానీ తన వంద తరాలు సుఖంగా కూర్చుని తన పరివారమే బతకాలనే ఓ దురాశ దేనికి…!? సర్లే, మనకెందుకు…? తన వ్యక్తిత్వంలోనే ఏదో తేడా… వక్రమార్గం పట్టిన ఓ మేధస్సు… తెలంగాణ సమాజం అనుభవించాల్సిందే… లేకపోతే ఆ వాసాలమర్రి ఏమిటి..? కోట్ల ఖర్చుతో ఆ సహపంక్తి భోజనం ఏమిటి..? అందులో కొందరు అస్వస్థతకు గురి కావడం ఏమిటి..? ఈ కరోనా విపత్తువేళ ఈ రోగక్రీడ ఏమిటి..? అసలు పాలకుడి ఆలోచనల్లోనే ఏదో అపభ్రంశం… ఏదో వైరస్… కులం, ధనం, స్వార్థం ఎట్సెట్రా బోలెడు, దానికి తగ్గట్టే ఈ ఆలోచనలు, కార్యాచరణలు…
‘‘నేను పుట్టిన ఊరు, నేను చదివిన ఊరు, నేను కబడ్డీ ఆడిన ఊరు, నేను మూడో ఎక్కం నేర్చిన ఊరు, నేను ఈతలు కొట్టిన ఊరు’’… అనే పేరిట చింతమడక ఎట్సెట్రా గ్రామాలకు కోట్లకుకోట్లు ధారాదత్తం చేసినప్పుడు… నేను దత్తత తీసుకున్న ఊళ్లు, నేను పయనించే ఊళ్లు, నేను, నేను, నేను అనే ఆభిజాత్యం కనిపించినప్పుడే అర్థం కావాలె… కానీ కావడం లేదు, కాదు… తెలంగాణ సమాజం పేరుకే చైతన్యశీలం, పోరాటశీలం… కేసీయార్ వంటి నేతలు కుర్చీపై కూర్చుంటే అది అంతా హంబగ్… మామూలు తెలంగాణ ప్రజానీకానికి అర్థం కాదు… అలా అర్థంగాకుండా పాలించడమే కేసీయార్ వైశిష్ట్యం… నువ్వు ఉండాల్సినవాడివే దొరవారూ… ఈ చిల్లర, అజ్ఞాన సమాజానికి తగిన శాస్తి జరగాల్సిందే… (ఆస్తులు అమ్మి, బెడ్స్ దొరక్క, అప్పులు చేసి, ఆగమాగమై పోయి, ప్రాణాలు కోల్పోయి వేల కుటుంబాలు చితికిపోతే…. నయాపైసా సాయం చేయకుండా, పట్టించుకోకుండా… ఇప్పుడు రెండు డోలోలు వేసుకున్నా, అదొక రోగమా..? అనే వ్యాఖ్యలు ఎవరిని కించపరుస్తున్నట్టు..? జనం హౌలాగాళ్లా..? ఈ డాక్టర్లు పిచ్చోళ్లా..? ఒక కుటుంబంలో ముగ్గురి చికిత్సకు కోటి రూపాయలు ఖర్చు పెట్టారట, మరి నువ్వు చేసిందేమిటి..? ఇదా పాలకస్థానం వ్యాఖ్యల తీరు..?)
Ads
లేకపోతే ఆ వాసాలమర్రి ఏమిటి..? ఆ కోట్ల ఖర్చుతో భోజనాలు ఏమిటి..? ఓ రాజనీతిజ్ఞుడు తన పాలనప్రాంతంలోని ప్రతి అంగుళాన్ని ప్రేమించాలి… ఒక ఊరు, ఒక కుటుంబం, ఒక వీథి కాదు… తనకంటూ సక్రమ పాలన విధానాలుంటే… ప్రతి ఊరూ తన ఊరే కావాలి… చింతమడకకన్నా తెలంగాణలోని ఏ ఊరు భిన్నం..? అక్కడ ఇంటికి 10 లక్షల సంతర్పణలు దేనికి..? ఈ వాసాలమర్రి బంతిభోజనాలు దేనికి..? వేరే ఊరివాళ్లు వస్తే తరిమివేయడం దేనికి..? ఓ నీతి, ఓ రీతి, ఓ రివాజు ఏమైనా ఉన్నాయా..? అసలు ఈ ఊరు మాత్రమే నాది అనే డొల్ల రాజనీతిజ్ఞత ఎప్పుడైనా కన్నామా రాజుల చరిత్రలో..? విన్నామా..? అంటే నీ మొహం చూసి ప్రేమగా వోట్లు వేసిన మిగతా ఊళ్ల జనమంతా ఎడ్డోళ్లా..? తప్పు చేశాంరా భయ్ అనుకోవాలా ఇప్పుడు..? ఇదేనా 70, 80 వేల పుస్తకాలు చదివిన విజ్ఞత… నిజానికి తెలంగాణ సమాజం తరతరాలుగా ఓ శాపగ్రస్త… తప్పులో కాలేస్తూనే ఉంటుంది, ఇదీ అదే… ప్రభువుల మొహాలు మాత్రమే మారినయ్… అంతే…
ఎంతసేపూ రాజకీయాలే… పదవి పదిలం చేసుకునే పన్నాగాలే… కుటుంబ వారసత్వపు పోకడలే… కులకుటుంబ జాడ్యపు ఛాయలే… ఒక జాతికి పితగా భాసిల్లే బంగారు అవకాశాల్ని కాలదన్ని… డబ్బు, అధికారం, కుటుంబం, క్షుద్ర రాజకీయ ఎత్తుగడలు…. ఇవేనా..? నిజానికి జాలిపడాల్సింది తెలంగాణ సమాజాన్ని చూసి…! వాసాలమర్రిలో కేసీయార్ పక్కన కూర్చుని భోంచేసి, అస్వస్థతపాలైన ఆగమ్మ గురించి కాదు… ఆగమ్మది ఏముంది..? యావత్ తెలంగాణే ఆగమాగం అవుతుంటే…!! బంతి భోజనంలో ఏం కూరలు పెట్టారో తరచి తరచి వార్తలు పంచే క్షుద్ర మీడియా అజ్ఞానులు ఒక శాపం… విపక్షనేతల నపుంసత్వం మరో శాపం… కేసీయార్ మార్క్ పాలనకు నిర్వేదపు చప్పట్లు కొడుతూ ఇలా బతికేయాలి… అటు ఆ తెలుగు పాలకుడు అలా… ఇటు ఈ తెలుగు పాలకుడు ఇలా… తెలుగు ప్రజలే జాతిరీత్యా శాపగ్రస్తులు… అంతే…! ఆ హస్తిన శూన్యమెదళ్ల మీద ఆశలు పెంచుకుంటే అది మరీ దరిద్రం… మహాదరిద్రం…!! మీ పదవుల కోసం, మీ డబ్బుల కోసం, మీ విలాసాల కోసం, మీ సుఖభోగాల కోసం ఇన్నేళ్లూ డప్పులు కొట్టిన మేధావులు, గాయకులు, రచయితలు, కళాకారులూ… ఆత్మజ్ఞానం ఏమైనా ప్రబోధిస్తోందా..?! లేక ఇంకా కొత్త డప్పులు కట్టి భజనలు చేస్తానంటోందా..?! అవునూ… Stateman, Statesman తేడా తెలుసా ప్రభూ…!!
Share this Article