ప్రపంచంలో చాలామంది పుడుతుంటారు, గిడుతుంటారు… అయితేనేం..? తమ బతుకుల్ని సార్థకం చేసుకున్నవాడే కదా చరిత్రలో నాలుగు రోజులు నిలబడేది… పది మందీ గుర్తుతెచ్చుకుని భేష్ అని మెచ్చుకునేది… అంబానీలు, ఆదానీలు, మేఘాలు, మైహోంలు కూడా పుట్టుకొస్తారు… నాలుగు నాళ్లు ప్రపంచంలోకెల్లా ధనికుల జాబితాల్లో ఉంటారు, పోతారు… కానీ కొందరు మాత్రమే నిలుస్తారు, మన జ్ఞాపకాల్లో… వాళ్లు పోయినప్పుడు అనుకోకుండానే రెండు కన్నీటి బొట్లు రాలుస్తాం… వారిలో ఒకడు ఎండీహెచ్ మసాలా కంపెనీ ఓనర్… మహాశయ్ ధర్మపాల్ గులాటీ… నిజమే… తను మహాశయుడు, ధర్మపాలుడు…
97 సంవత్సరాల వయస్సులో కాలం చేశాడు తాను… పరిపూర్ణ జీవనం… నిస్పందేహంగా, ఏ హిపోక్రసీ లేకుండా చెప్పుకుని, చప్పట్లు కొట్టాల్సిన జీవితం తనది… అరె, సక్సెస్, ఫెయిల్యూర్ అనేది వదిలేయండి… నిజమైన సక్సెస్ అంటే ఏమిటి అనేది తన జీవితం నుంచి నేర్చుకోవాలి…
Ads
ఎండీహెచ్ బ్రాండ్ మసాలాలు అందరికీ తెలుసు… కల్తీ ఉండదు, మోసం ఉండదు… అదీ బ్రాండ్ వాల్యూ… అనేక ఫ్యాక్టరీలు, బ్రాంచులు, బ్రాండులు, అనేక దేశాలకు ఎగుమతులు… అసలు ఓ చిన్న పాన్ షాపు వంటి టిక్కీలో వ్యాపారం స్టార్ట్ చేసిన ఆయన ఏకంగా 2000 కోట్ల టర్నోవర్ స్థాయికి దాన్ని తీసుకెళ్లి… రోజూ మన జఠరాగ్నికి రుచులు సమకూరుస్తున్న మనిషి ఆయన…
ఇప్పటి పాకిస్థాన్ తన జన్మస్థలి… దేశవిభజన సందర్భంలో కోట్లమందిలో ఒకడుగా ఇండియాకు వచ్చేశాడు… ఆయన తండ్రికి తెలిసింది మసాలాల వ్యాపారమే కాదు… సబ్బులు, దుస్తులు, బియ్యం… అన్నీ అమ్మేవాళ్లు…
ఢిల్లీకి చేరుకునేటప్పటికి ధర్మపాల్ వద్ద ఉన్నవి కేవలం రూ.1500… అందులో నుంచే 650 ఖర్చు పెట్టి ఓ టాంగా కొన్నాడు. దాని సహాయంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి కుతుబ్ రోడ్, కరోల్ బాగ్, బారా హిందురావు ఏరియాలకు 2 అణాలకు టాంగా నడిపేవాడు… తరువాత కొన్నేళ్లకు ఆ టాంగాను అమ్మి, తన సోదరుడు సత్పాల్ తో కలిసి మళ్లీ తమకు వారసత్వంగా వచ్చిన ఆ మసాలా వ్యాపారం ప్రారంభించాడు… ఓ శుభముహూర్తాన ఓ చిన్న షాపు తెరిచాడు…
ఇంతై… ఇంతింతై… అన్నట్టుగా పెరిగిపోయింది… విస్తరించాడు… ఎండీహెచ్ బ్రాండ్‌కు తిరుగులేదు… మార్కెట్లోకి వందల బ్రాండ్లు వచ్చినా దాన్ని కొట్టగలిగిందీ లేదు, కొట్టిందీ లేదు… క్రెడిబులిటీ, నాణ్యత… సరే, ఆ వ్యాపారాన్ని అలా వదిలేద్దాం… మనిషిగా సార్థకజీవుడు ఎలా అయ్యాడు అనేదే కదా ప్రశ్న…
90 శాతం… ఎస్, అక్షరాలా 90 శాతం జనానికే ఖర్చు చేసేవాడు… ఓ ట్రస్టు ఏర్పాటు చేసి, దాని ద్వారా స్కూళ్లు, హాస్పిటల్స్ నడిపేవాడు… తిరుగులేదు… తన జీవితానికి ఎవ్వడూ వంకపెట్టడానికి వీల్లేదు… వీలు కాదు… అదీ అసలైన సక్సెస్ అంటే… ఏ ఫోర్బ్స్ జాబితాలోనూ తన పేరు కనిపించాల్సిన పనిలేదు… అసలు ఆ జాబితాకే విలువ లేదు… చిల్లిగవ్వపాటి విలువ కూడా… ఎందుకంటే… అది డబ్బును, ఆస్తుల్ని చూస్తుంది… ఎండీహెచ్ ధర్మపాల్ పుణ్యాన్ని, సంపాదించుకున్న ఆత్మతృప్తినీ చూసుకున్నాడు… అది అమూల్యం… ఈ సోకాల్డ్ ట్రేడింగ్ వ్యవస్థలకు ఇంకా అర్థం కానిది…
దేశం తన సేవల్ని గుర్తించింది… 2019లో పద్మభూషణ్ పురస్కారం ప్రదానం చేసి గౌరవించింది… ఈరోజు ధర్మపాల్లు లేరని కాదు… టాటా లేడా..? అజీమ్ ప్రేమ్‌జీ లేడా..? శివనాడార్ లేడా..? బోలెడు మంది… ఎటొచ్చీ… సంపాదించిన దాంట్లో ఎవరు ఏమేరకు సామాజిక సేవకు వెచ్చిస్తున్నారు అనేదే అసలైన సక్సెస్‌కు కొలమానం… నో డౌట్… ఇప్పుడు మరణించిన ధర్మపాలుడు నిస్సందేహంగా మొదటి వరుసలోనే ఉంటాడు… సద్గతి ప్రాప్తిరస్తు మహాశయా…!
Share this Article