ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు పడదు… కారణాలు అనేకం ఉండొచ్చు… కులం కావచ్చు, పార్టీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు… రాధాకృష్ణను మొదటి నుంచీ జగన్ అస్సలు పట్టించుకోని తీరు కూడా ఓ బలమైన కారణం కావచ్చు… పెద్ద పెద్ద లీడర్లే నా దగ్గరకు వస్తారు, కలుస్తారు, ఈ పోరడు మొదటి నుంచీ నన్ను దేకడు, ఇంత పొగరా అనే ఓరకమైన ఆభిజాత్యం కూడా కావచ్చు… కాకపోవచ్చు… కానీ జగన్ అంటే రాధాకృష్ణకు అస్సలు పడదు, జగన్‌కు కూడా రాధాకృష్ణ అంటే పీకల్దాకా కోపం ఉంది… ఇవయితే నిజం… రాధాకృష్ణ విశ్లేషణలు, కథనాలు, పత్రిక పోకడ గట్రా యాంటీ-జగన్ అనేదీ నిజం… అబద్దాలో, నిజాలో… జగన్‌కు వ్యతిరేకంగా గట్టిగా నాలుగు మాటలు మాట్లాడుతూ, స్థిరంగా, నువ్వేం చేస్తావో నేనూ చూస్తా అన్నట్టుగా ఆంధ్రజ్యోతి నిలబడ్డదీ నిజమే… ఎవరో ఒకరు నిర్భయంగా మాట్లాడేవాళ్లు ఉండాలి కదా సమాజంలో..! ప్రత్యేకించి జగన్ మీద రాధాకృష్ణ రాతలకు సంబంధించి… కొన్ని వ్యతిరేకిస్తాం, కొన్ని అభినందిస్తాం, కొన్నింటినీ చీదరగా తీసిపారేస్తాం… కానీ ఈసారి తను రాసిన రాతలు విపరీతమైన విస్మయాన్ని కలిగించినయ్…
తను ఏం రాశాడో ఓసారి చూద్దాం… ‘‘వైరస్ వ్యాప్తి చెందుతున్న దశలో, గత ఏడాది మార్చి 25వ తేదీన అధికారుల వద్ద ఆయన అన్న మాటలు తెలిస్తే ఎవరికైనా కళ్లు తిరుగుతాయి. కరోనా వ్యాప్తి పెరుగుతోందని అధికారులు చెప్పే ప్రయత్నం చేయగా, ‘కరోనా వైరస్ లేదూ, ఏమీ లేదు. నేను రాత్రి జీసస్‌తో మాట్లాడాను. అసలు వైరస్ లేదు. భయపడవద్దు అని జీసస్ చెప్పారు’ అని జగన్ రెడ్డి అనడంతో అధికారులు అవాక్కయ్యారు. ముఖ్యమంత్రిపై జీసస్ ప్రభావం ఇంతలా ఉంటుందనీ, తాను జీసస్‌తో మాట్లాడాననే స్థితికి ఆయన చేరుకున్నారని తాము ఊహించలేదని ఆ సమయానికి అక్కడే ఉన్న అధికారి ఒకరు చెప్పారు. అయినా అధికారులు కల్పించుకుని, ‘మీరు చెప్పింది నిజమే కావచ్చు. కానీ, కరోనా వైరస్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ప్రకటించారు’ అని సీఎంతో అన్నారు. దీంతో ఉగ్రుడైన జగన్, ‘నాకు చెప్పకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారు?’ అని ఊగిపోయారట. తాను దైవదూతనని అప్పుడప్పుడూ ఆయన అధికారుల వద్ద అంటూ ఉంటారట. గతంలో పదవీ విరమణ చేసిన ఒక ఐఏఎస్ అధికారి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరాలనుకుని జగన్ రెడ్డిని కలిశారు. ఆ సందర్భంగా జగన్ రెడ్డి మాట్లాడుతూ, తాను ప్రతిరోజూ రాత్రి 12 గంటలకు దివంగత రాజశేఖర రెడ్డితో చర్చిస్తానని చెప్పుకొచ్చారట! ఎప్పుడో చనిపోయిన రాజశేఖర రెడ్డితో మాట్లాడ్డం ఏమిటా? అని ఆశ్చర్యపోయిన సదరు అధికారి మళ్లీ అటువైపు తిరిగి చూడలేదట! ఈ అనుభవాన్ని ఆయనే స్వయంగా తన సన్నిహితులతో పంచుకున్నారు…’’ ఇదీ రాధాకృష్ణ రాసుకొచ్చింది…
Ads
ఔనా… జగన్ మానసిక స్థితి ఇదా..? ఏ రాత్రయినా సరే తను జీసస్‌తో మాట్లాడతాడా..? అలాగే అవసరాన్ని బట్టి దివంగత నేత రాజశేఖర్‌రెడ్డితో మాట్లాడుతూ ఉంటాడా..? వాళ్లు చెప్పినట్టే చేస్తాడా… మరీ కేఏ పాల్‌తో పోలిక వద్దు గానీ, తన బావ అనిల్‌కుమార్ లాగే జగన్ కూడా దైవదూతేనా..? గత మార్చిలోనే ఉన్నతాధికారులతో ఇలా మాట్లాడి ఉంటే… తరచూ తన సన్నిహితులతో ఇలా మాట్లాడుతూ ఉంటే… జగన్ క్యాంపులో చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోయే రాధాకృష్ణ ఇన్నాళ్లపాటు జగన్ మానసిక ధోరణి మీద ఒక్క వాక్యం కూడా రాయలేదెందుకు మరి..? ఇన్నిరకాల కథనాలు రాస్తున్న ఆయనకు ఒక ముఖ్యమంత్రి అసాధారణ మానసిక పరిస్థితి మీద రాయాలని ఎందుకు అనిపించలేదు..? ఈ హఠాత్ దాడికి కారణమేంటి..? జగన్‌ను ఇలా భిన్నమైన రీతిలో ఇంకా పలుచన చేయడమా..? కొత్త స్ట్రాటజీయా..? ఒక సీఎం మీద ఒక మెయిన్ స్ట్రీమ్ పత్రిక ఇలా రాసిందీ అంటే, వాటిని ఊసుపోక కబుర్లుగా కొట్టిపారేయలేం… ఇదేమీ లైటర్‌వీన్ ఫీచర్ కూడా రాదు, సీరియస్ ఎడిటోరియల్ వ్యాసకథనమే… అసలు రాధాకృష్ణ రాతల్లోనే తన డిప్రెషన్ ఏదో బయటపడుతోందా..? అసలు ఏపీలో ఎవరి మానసిక స్థితి ఏమిటో అంతా గందరగోళంగా ఉన్నట్టుంది కదా…
రుషీకేష్‌లో స్వరూపుడితో యాగాలు, పుష్కర స్నానాలు, పితృకర్మలు, తిరుమల పట్టుబట్టలు, పంచాంగశ్రవణాలు కూడా జీసస్ ఆదేశం మేరకే చేసి ఉంటాడా డియర్ ఆర్కే..? జస్ట్, ఆస్కింగ్… సరే, జగన్ రోజూ రాత్రిళ్లు తన డాడీతో, తన గాడ్‌తో మాట్లాడుతూ ఉంటాడు… వాటికన్‌లో కొలువు తీరిన పెద్ద పెద్ద పోపులకే దక్కని అదృష్టం అది… అంతటి మహత్తు, దేవుడితో డైరెక్ట్ కమ్యూనికేషన్ సౌకర్యం కలిగిన జగన్ ఈరోజుకూ చంద్రబాబును, రాధాకృష్ణను ఫలానా రూట్‌లో జైలులో పారేయవచ్చు అని తెలుసుకోలేకపోయాడా..? ‘‘ఆ ఇద్దరు బిడ్డలనూ క్షమించు’’ అని చెప్పి ఉంటాడా..? రోజూ రాత్రి సూచనలు చేస్తూ, జగన్‌ను ఆడిస్తున్నది, పాలిస్తున్నదీ రాజశేఖర్‌రెడ్డి ఆత్మే అనుకుందాం.,. రాత్రయితే చాలు, జగన్ తలుపులు బిడాయించుకుని ఆత్మలతో మాట్లాడుతూ, సలహాలు తీసుకుంటూ వ్యవహరిస్తున్నాడనే అనుకుందాం… ఆ ఆత్మలకూ రాధాకృష్ణ కొరకరాని కొయ్య అయిపోయాడా..? ఈ దేవరహస్యాన్ని బయటపెట్టినందుకు రాధాకృష్ణ మీద పడిపోతాయా ఇక..?!
Share this Article