మరో కోణం నుంచి చూద్దాం… మహేష్ కత్తికి ప్రమాదం జరిగినట్టు ఎవరో మిత్రులు ఫేస్బుక్లో పోస్టు పెట్టింది మొదలు… ఇప్పటిదాకా సోషల్ మీడియా హోరెత్తిపోతోంది… తిట్టేవాళ్లు, బాగైందిలే అని కసికసిగా కామెంట్లు పెట్టేవాళ్లు, మనసులో తిట్టుకుంటూనే కోలుకో మిత్రమా అని ముసుగు వ్యాఖ్యలు తగిలించేవాళ్లు, మనస్పూర్తిగానే మన మహేష్ కోలుకోవాలని కోరుకునేవాళ్లు, విభేదించుకున్నా సరే నువ్వు క్షేమంగా వేగంగా కోలుకో అని ఆకాంక్షించేవాళ్లు… మీమ్స్, వ్యంగ్య వ్యాఖ్యలు, బొమ్మలు, కార్టూన్లు… ఈ స్థితిలోనూ తనపై దారుణమైన ట్రోలింగు మరోవైపు…. ఓ ఎమ్మెల్యే, ఓ స్టార్ హీరో, ఓ మంత్రి, ఓ ఎంపీ, ఇంకెవరో పెద్ద సెలబ్రిటీ విషయంలో కూడా ఈ రేంజ్ చర్చ జరగదేమో బహుశా… మంచో, చెడో, తటస్థమో… మహేష్ తెలుగు సమాజం మీద తన ముద్రను ఇంత బలంగా వేశాడా..? ఇన్ని వేల మంది తన గురించి ఆలోచించేలా చేసుకున్నాడా..? అదీ ఆశ్చర్యాన్ని కలిగించింది…
తెలుగు సోషల్ మీడియాలో మహేష్ కత్తి స్థాయిలో దారుణమైన ట్రోలింగును ఎదుర్కున్నవారు మరొకరు లేరేమో బహుశా… జనసేన, పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి స్టార్టయ్యింది… సామాజిక వేదికలు, టీవీ డిబేట్లలోనే కాదు, తనకు నేరుగా కాల్స్ చేసి, తిట్టి, బెదిరించి, దాడులకు ప్రయత్నించి… చివరకు జబర్దస్త్ వంటి కామెడీ షోలలో తన మీద పంచులు వేయించి… ఈ దాడిని మహేష్ కత్తి తట్టుకున్న తీరు కూడా అప్పట్లో ఆశ్చర్యపరిచింది… ఇప్పటికీ జనసేనకు మహేష్ అనే పేరంటేనే పడదు… అసలు మహేష్ ఎవరు..? ఓ ఫిలిమ్ క్రిటిక్, ఓ నటుడు, ఓ చిన్న స్థాయి దర్శకుడు… స్థూలంగా చూస్తే ఇంతే…, కానీ సినిమాల మీద బాగా అవగాహన పెంచుకున్నవాడు… అంతేకాదు, అనేక సబ్జెక్టుల మీద లోతైన జ్ఞానం కలిగినవాడు, కడుపులో ఉన్న భావాన్ని ఏ వికారమూ లేకుండా కక్కేసేవాడు… అదుగో అక్కడే వచ్చింది…
Ads
పవన్ కల్యాణ్ కారణంగా మొత్తం మెగా క్యాంపు అంతా తనకు వ్యతిరేకి… తెలుగుదేశం- చంద్రబాబు విధానాల్ని విమర్శించేవాడు కాబట్టి ఆ సెక్షన్ మొత్తానికీ పడదు… ప్రత్యేకించి తను నాస్తికుడు, హేతువాది… పలు సందర్భాలలో రామాయణం, రాముడి మీద హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడాడు… మహేష్ కత్తి వ్యాఖ్యలు మంటపెట్టడానికి మీడియాకు బాగా ఉపయోగపడ్డయ్… మధ్యలో ఎవరో స్వాములవారు దూరి ఇంకాస్త పెట్రోల్ పోశాడు… కొన్నాళ్లు రాష్ట్ర బహిష్కారం… ఐతేనేం… తను అలాగే తన వాదనల మీద నిలబడ్డాడు… అందుకే హిందూవాదులకు మహేష్ అంటే కోపం… నిజానికి తను హిందూద్వేషి కాదు, మతద్వేషి… హిందూమతం మీద కోపంతో క్రిస్టియానిటీనో, మరో మతాన్నో ఏమీ వెనకేసుకురాలేదు… కానీ హిందూ దేవుళ్లతో వివాదం కారణంగా హిందూ సమాజానికి దూరమయ్యాడు… ఎస్సీ, దళిత స్పృహ ఉన్నవాడు… ఇండియన్ సొసైటీ మీద కులం ప్రభావాన్ని అర్థం చేసుకున్నవాడు… కానీ ఆ ఉపకుల పంచాయితీలోనూ కొందరు తనను ద్వేషించేవారు… వైసీపీ విధానాల పట్ల కొంత సానుకూలత కనబర్చినా, జగన్ ఒకటీరెండు నిర్ణయాల్ని కూడా మహేష్ వ్యతిరేకించాడు… ఇలా కారణాలు వేర్వేరు, కానీ లక్షల మందికి అయిష్టుడు తాను… కానీ వీటన్నింటికీ భయపడకుండా తన పంథాలో తను వెళ్తూనే ఉన్నాడు… ఉంటాడు…
ఎటొచ్చీ ఇక్కడ విస్తుగొలిపే అంశం ఏమిటంటే..? ఓ వ్యక్తి ప్రమాదానికి గురై, అచేతనంగా ఐసీయూలో ప్రాణాలు నిలబెట్టుకోవడానికి పోరాడుతుంటే… అయ్యో పాపం అనకుండా, ఆ దేవుడు శిక్షించాడు, మా దేవుడి జోలికొస్తే అంతే అనే ధోరణి కనిపించడం… సోషల్ మీడియా, మీడియా డిబేట్లు సమాజంలోని ఏదో స్పష్టంగా నిర్వచించలేని సెన్సిటివిటీనీ క్రమేపీ చంపేస్తున్నాయా..? రోజూ అనేక ప్రమాదాలు జరుగుతున్నయ్… రోగాలు విజృంభిస్తున్నయ్… నాస్తికులు, ఆస్తికులు, ధనికులు, పేదలు, సెలబ్రిటీలు ఎందరో మరణిస్తున్నారు… ఎవరు శాశ్వతం ఇక్కడ..? మరణశయ్య మీద ఉన్నవాడు ప్రత్యర్థి అయినా సరే, తన మీద జాలి కనబర్చడం మన సమాజపు ఔన్నత్యం… అది కూడా ఎందుకిప్పుడు మసకబారుతోంది..? మహేష్ కత్తి అభిప్రాయాలు, విమర్శలు, ప్రశ్నలకు సమర్థంగా సమాధానాలు చెప్పేవాళ్లయితే, చెప్పగలమని భావించే వాళ్లయితే తన మరణాన్ని కోరుకోరు… కోరుకునేవాళ్లకు ఆ కత్తికి బదులు చెప్పే తెలివిడి లేనట్టే… లేదని వాళ్లూ అంగీకరిస్తున్నట్టే..!!
Share this Article