ఇదేమీ ఉక్కుక్రమశిక్షణ కలిగిన పార్టీ ఏమీ కాదు… వెరీమచ్ లిబరల్… ఓవర్ డెమోక్రటిక్… పార్టీలోని స్వేచ్ఛ పార్టీవాదులకే భయం కలిగిస్తూ ఉంటుంది అప్పుడప్పుడూ… అంత స్వేచ్చ అన్నమాట… వచ్చేవాళ్లు వస్తుంటారు, పోయేవాళ్లు పోతుంటారు… కాంగ్రెస్ పార్టీ అంటేనే ఓ రైల్వే ప్లాట్‌ఫారం… ఇదేమీ కుటుంబ పార్టీయో, వ్యక్తి కేంద్రిత పార్టీయో, సిద్ధాంతాలు, రాద్ధాంతాల పార్టీయో కాదు… ఎప్పటికెయ్యది ప్రస్తుతమో ఆ నినాదం పట్టుకుని వెళ్తూనే ఉంటుంది… తాము ఆశించిన పదవులు, పార్టీ హోదాలు, టికెట్లు గట్రా రాకపోయినా నిరసనలు, ఆందోళనలు, నిరాహారదీక్షలు కూడా సాగుతూనే ఉంటయ్… అవి కొన్నిసార్లు తీవ్రంగా కూడా ఉంటయ్… అప్పట్లో పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఏకంగా పార్టీ ఆఫీసునే తగులబెట్టిన ఉదాహరణ లేదా ఏం..? సో, రేవంత్‌రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు కాగానే కొన్ని నిరసనలు, అలకలు, ఆగ్రహాలు ఉంటాయని ఊహించిందే… అనూహ్యమేమీ కాదు, అసాధారణం కూడా కాదు…
ఒక మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ రాజీనామా…! ఎన్నికల సమన్వయ కమిటీ పదవికి మర్రి శశిధర్‌రెడ్డి రాజీనామా… కానీ పార్టీలోనే ఉంటాడుట… వేరే గత్యంతరం ఏముందని…!? కోమటిరెడ్డి వెంకటరెడ్డి రుసరుస… ఐనా పార్టీలోనే ఉంటాడు, పాదయాత్ర చేస్తాడు, రెండు నియోజకవర్గాలకే పరిమితం అవుతాడుట… బహుశా రాజగోపాలరెడ్డి బీజేపీ వైపు వెళ్తాడేమో… నిజానికి కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఏ కమిటీలోనూ చాన్స్ ఇవ్వలేదు అంటేనే వాళ్లను హైకమాండ్ లైట్ తీసుకున్నట్టు లెక్క… వాళ్లు ఎప్పుడూ ఓ ఎంపీ స్థానం దాటి బయటికి రావడం లేదు… కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కావల్సింది రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా సరే పార్టీ కేడర్ స్వాగతించే నాయకుడు… ఆ యాక్సెప్టెన్సీ రేవంత్‌కు వేరే నేతలతో పోలిస్తే కాస్త ఎక్కువే వచ్చింది… పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి డబ్బు తీసుకుని, రేవంత్‌కు అమ్ముడుబోయాడు, తప్పుడు రిపోర్టులు ఇచ్చాడు అనే ఆరోపణ తీవ్రమైందే కానీ నిలవదు… ఎందుకంటే… హైకమాండ్ వేరే మార్గాల్లో కసరత్తులు చేశాకే ఓ నిర్ణయానికి వచ్చింది… పైగా ఇన్నేళ్లుగా పనిచేసేవాళ్లను కాదని, నిన్నగాకమొన్న వచ్చిన టీడీపీ కోవర్టుకు, వోటుకునోటు కేసు నిందితుడికి పార్టీ పగ్గాలు ఇస్తారా అనే విమర్శలోనూ పంచ్ లేదు… ఎందుకంటే..?
Ads
ఏళ్లపాటు సేవలు చేసినవాళ్లు కాదు… ఇప్పుడు ఉపయోగపడేవాళ్లు ఎవరనేదే పార్టీ దృక్కోణం… కేసీయార్‌కు లొంగిపోని కేరక్టర్లు కావాలి… పైగా గత రేవంత్‌రెడ్డి చంద్రబాబు మనిషి… చంద్రబాబు ఇప్పుడు దూరం ఉంటున్నాడు కానీ మొన్నటి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దోస్తే… ఆ పార్టీకి మస్తు ఆర్థికసాయం కూడా చేశాడు… ఆ సత్సంబంధాలు అప్పుడే పోవు కదా… అందుకని టీడీపీ కోవర్టు అనే విమర్శ కూడా నిలబడదు… సో, రకరకాల కారణాలు రేవంత్‌రెడ్డిని ఇలా కుర్చీ ఎక్కించినయ్… గత పీసీసీ అధ్యక్షుల్లాగా అందరి దగ్గరకూ వెళ్లి అయ్యా, అప్పా, కలిసి పనిచేద్దాం అని బతిమిలాడే రకమేమీ కాదు తను… మార్పులు చేర్పులు ఉంటయ్, పాత నీరు పోతే కొత్త నీరు వస్తుందిలే అనుకుంటాడు… తనకంటూ ఓ గ్రూపును డెవలప్ చేసుకుంటాడు… కాంగ్రెస్‌లో కేడర్‌కేమీ కొదువ లేదు… ఒక స్థానంలో ఒక సీనియర్ వెళ్లిపోతే పది మంది నాయకులు ఆ ప్లేసు భర్తీ చేయడానికి రెడీ ఉంటారు… ఈ సీనియర్ల బాధ ఎలా పోతుందిరా దేవుడా అని అక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీయే లబోదిబో అంటున్నాడు… ఒకవేళ టీపీసీసీలో అది జరిగితే రాహుల్ కూడా సై అంటాడు తప్ప, అడ్డుకోడు…
టీఆర్ఎస్‌లోకి వెళ్లిన వాళ్ల పరిస్థితి ఏమిటో కాంగ్రెస్ ప్రస్తుత సీనియర్లకు బాగా తెలుసు… సో, కారు ఎక్కడానికి పెద్ద స్కోప్ లేదు, అసలు కారులో స్పేస్ లేదు… ఓవర్ లోడెడ్… సో, ఈ రణగొణ ధ్వనులు, నిరసనలు వాటంతటవే చల్లబడిపోతయ్… రేవంత్‌కు సహకరించబోం అని గిరిగీసుకుని, జనంలోకి రాకపోతే, ఆయా స్థానాల్లో సెకండ్ కేడర్‌ను పైకి లేపడం గ్యారంటీ… వచ్చే ఎన్నికల వరకూ ఎటూ కదల్చకుండా ఈ కమిటీని ఇలాగే ఉంచితే… కొందరు సీనియర్లు తమ టికెట్లకే నానా కష్టాలూ పడాల్సిన పరిస్థితి రావొచ్చు… గెలుపోటముల సంగతి వేరు… వోటుకునోటు కేసు నిందితుడికి పార్టీ పగ్గాలా అనే ప్రశ్నకూ పెద్ద విలువ ఉండదు… బోలెడు మంది పార్టీ నేతలపై బోలెడు కేసులున్నయ్… పార్టీ వాటిని ఎప్పుడూ సీరియస్‌గా పట్టించుకోదు, రాజకీయాలంటేనే ఇవన్నీ సహజం అంటుంది… నిజానికి అసలు కథ ఇప్పుడు కాదు… రేవంత్‌రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించాకే ప్రారంభమవుతుంది..!! ఒకవేళ టీపీసీసీని చంద్రబాబే హైజాక్ చేసి కథలు నడిపిస్తున్నాడు అని ప్రజలు బలంగా నమ్మితే మాత్రం… కాంగ్రెస్ ముసుగు వేసుకుని మళ్లీ వస్తున్నాడురోయ్ అని భావిస్తే మాత్రం… ఇక ‘‘కాంగ్రెస్ ముక్త తెలంగాణ’’ ఖాయం..!! మొన్నటి ఎన్నికల్లోలాగే కేసీయార్ నెత్తిన పాలు పోసినట్టే…!!
Share this Article