కాలగతిలో అప్పుడే నలభై రెండేళ్లయింది ఆ సినిమా వచ్చి… శివరంజని దాని పేరు… దాసరి నారాయణరావు మంచి ప్రయోగాత్మక, వైవిధ్య దర్శకుడిగా చెలరేగిపోతున్న తన కెరీర్ తొలినాళ్లు అవి… మొటిమల జయసుధ అంటే అప్పటికే జనంలో ఓ క్రేజు… నిజంగా ఆమెకు దక్కినన్ని మంచి పాత్రలు ఇంకెవరికీ తెలుగులో దక్కలేదేమో… ధన్యనటి… రమేష్‌నాయుడు సంగీతం… అందులో వేటూరి రాసిన ఒకపాట ఒకసారి వింటే… చాలాసేపు నాలుక మీద ఆడుతూనే ఉంటుంది ఆ ట్యూన్… మదిలో తిరుగుతూనే ఉంటుంది చాలాసేపు…
ఎస్, వేటూరి మంచి పాపులర్ పాటల రచయిత… కమర్షియల్ రచయిత… తను నిజంగానే మనసు పెడితే గనుక ఆ పాటకు ఇక తిరుగు లేదు… మనసు పెట్టకపోయినా సరే, నాలుగు పడికట్టు పదాలను అలా ఆ ట్యూన్లో ఇరికించేసి, కవిహృదయం అనే ఖాతాలోకి పడేసి… ఏదో మంచి లోతు భావంతోనే రాసి ఉంటాడులే అనే భ్రమల్లోకి మనల్ని తోసేసే గడుసు రచయిత కూడా…
Ads
బహుశా ఇదీ ఆ కోవలోనిదేనేమో… ‘నవమినాటి వెన్నెల నేను, దశమినాటి జాబిలి నీవు…’ అనే పదాల్ని అలా అలవోకగా రాసేసి, ఇలా ఎందుకు రాశానో మీరే ఊహించుకుని చావండి అనేశాడు… ఆ పదాల ప్రయోగానికి చాలామంది చాలా జస్టిఫికేషన్లు ఇచ్చారు గానీ అంతగా మంచి సమర్థన కుదరలేదు ఈనాటికీ… నిజానికి నవమి నాటి వెన్నెలకు గానీ, దశమి నాటి జాబిలికి గానీ ఏం ఇంపార్టెన్స్ ఉంటుంది..? మరి వేటూరి ఎందుకలా రాశాడు..?
ఓసారి ఈటీవీ వాళ్ల ఏదో ప్రోగ్రాం… తను గీతామాధురితో కలిసి ఈ పాట పాడాక బాలసుబ్రహ్మణ్యం ఓ వింత వివరణ ఇచ్చాడు… అసలే వేటూరిపై ఈగ వాలనివ్వడు కదా…
‘నవమి నాటి వెన్నెల అంటే అప్పుడే అంతగా పరిపూర్ణంగా పండి ఉండదు… పౌర్ణమి వస్తేనే కదా పండు వెన్నెల… అలాగే దశమినాటి జాబిలి కూడా సంపూర్ణంగా కనిపించదు… మరో నాలుగు రోజులు గడిస్తేనే కదా పూర్ణబింబం కనిపించేది… అయినా సరే, మనం ఇద్దరమూ కలిస్తే, అది కార్తీక పున్నమి రేయంత గొప్ప వెన్నెల కదా… ఇదీ వేటూరి కవి హృదయం అంటాడు… కొంత బాగానే ఉంది గానీ… చరణాల్లోనూ కాస్త ఆ భావం ధ్వనించేలా… చెరిసగమై, ఏ సగమో తెలియని మన తొలికలయికలో అనే తమకాన్ని, గమకాన్ని కూడా రాస్తాడు వేటూరి…
కానీ…? ఆ సినిమా కథే ఓ సినీ కథానాయిక గురించి… ఈ శివరంజని సినిమా కథలోనూ కథానాయిక ఆమే… ఇక ఈ పాట ఎత్తుకునే హీరో కూడా కుర్రాడేమీ కాదు… ఆ రెండూ పచ్చి కాయలేమీ కావు… రెండూ పక్వానికొచ్చినవే… మరి నవమి, దశమి వంటి పదాలెందుకు వాడినట్టు…? ఏదో ఆ పదాలు బాగున్నయ్ కదాని అలా వదిలి ఉంటాడంటారా..? నిజంగానే ఓ మిత్రుడు చెప్పినట్టు… హీరోకన్నా హీరోయిన్ వయస్సులో పెద్ద కాబట్టి అలా నవమి, దశమి అని తేడాల్ని గుర్తుచేస్తూ రాసి ఉంటాడా..? అయినా అదీ కన్విన్సింగుగా ఏమీ లేదే… ఏమోలెండి… వేటూరి అలా చాలా పదాల్ని, వాక్యాల్ని, భావాల్ని గుమ్మరించి… ఏ అర్థం ఏరుకుంటారో మీ ఇష్టం అనేస్తాడు కదా… ఇక్కడ ఆయన భావార్థమేమిటో మనమే వెతుక్కోవాలి… అంతే…
Share this Article