ఏది వార్త..? ఏది వార్త కాదు..? ఏది రాయాలి..? ఏది రాయకూడదు..? ఏది ఎలా రాయాలి..? ఏది ఎలా రాయకూడదు..? వార్తలో ఏముండాలి..? ఇవన్నీ జర్నలిజంలో బేసిక్ ప్రశ్నలు… ఇవి తెలిస్తేనే జర్నలిస్టు… వీటి తరువాతే భాష, వ్యాకరణం, వాక్యనిర్మాణం, సరైన పదాల ఎంపిక, శైలి, ప్రజెంటేషన్ ఎట్సెట్రా… లెక్కకు మిక్కిలి పత్రికలు, వాటికి జిల్లా, జోన్ అనుబంధాలనే తోక పత్రికలు, అవన్నీ నింపడానికి కోకొల్లలుగా జర్నలిస్టులు… ఏదో ఒకటి నింపాలి కాబట్టి ఏదిబడితే అది వార్త అయిపోయింది… జర్నలిస్టుడు ఏది వార్త అనుకుంటే అదే వార్త… దానికిక తిరుగులేదు… దిక్కుమాలిన పత్రికలు కొన్ని ఫ్రాంచైజీ సిస్టం వ్యాప్తి చేయడంతో… ఇక పత్రికల కంటెంటు మీద ఎవరికీ నియంత్రణ లేదు… ఎవరేం రాసుకున్నా దిక్కులేదు… పైగా ఇప్పుడు ప్రింటింగే మానేశాయి కదా చాలా పత్రికలు… అన్నీ వాట్సప్ ఎడిషన్లే… ఏవేవో గ్రూపుల్లో సర్క్యులేట్ చేసుకోవాలి, అంతే…
ఎస్, ఏది వార్త అనే పాయింట్ కదా మనం డిస్కస్ చేసుకునేది… ఇప్పుడంతా సోషల్ మీడియా పోస్టుల్లాగే వార్తలు… ‘‘నేను ఈరోజు మా ఇంట్లో సర్వపిండి చేశాను, గడ్డపెరుగుతో భలే ఉంది, అంచుకు నిమ్మకాయ సోగి ఉండనే ఉంది’’ అని ఓ ఫోటో పోస్టు కనిపిస్తుంది… ఆ పోస్టు ఓనర్‌కు అదే చెప్పదగిన, రాయదగిన వార్త అన్నమాట… కేశఖండనం, రజస్వల, శోభనం, డోలారోహణం, నామకరణం… అలాంటివన్నీ సోషల్ మీడియా వార్తలే అన్నమాట… అదే మెయిన్ స్ట్రీమ్ అనబడే మీడియాలోకీ వచ్చేసింది… తప్పదు, ఒకదాన్ని మరొకటి అలా ప్రభావితం చేసుకుంటున్నాయి… చెప్పలేం, ఫలానా సుబ్బారావు చిన్నమ్మాయి రజస్వల అయ్యింది, ఫలానా కోటేశ్వరరావు పెద్దబ్బాయి శోభనోత్సవం జరిగింది, ఫలానా సమ్మారావు ఊరవతల గుడికి వెళ్లి తన ఇద్దరు కొడుకులకూ కేశఖండనం చేయించాడు… రాబోయే రోజుల్లో ఇలాంటివి వార్తలుగా కనిపిస్తే ఆశ్చర్యపోవద్దు… ఏమో, ఆల్‌రెడీ కనిపిస్తున్నాయేమో… ఈ డౌట్లన్నీ ఎందుకొస్తున్నాయంటే, ఇదుగో ఈ వార్త చదివాక…
Ads
ఒక పట్టణ కేంద్రంలో ఓ సీనియర్ జర్నలిస్టు, ఆయనకు ఓ తమ్ముడు, ఆ తమ్ముడికి ఓ కొడుకు పుట్టాడు… పుట్టాక పేరు పెట్టాలి కదా, ఊయలలో వేయాలి కదా, చిన్న ఫంక్షన్ జరపాలి కదా, పది మందినీ పిలిచి భోజనాలు పెట్టాలి కదా… ఇంకేముంది..? పదిమందీ ఒకచోట చేరే ప్రతి సంఘటనా ఇప్పుడు వార్తే, సో, ఇదీ ఓ వార్త అయిపోయింది… అసలు బారసాల అనగానేమి..? నామకరణం, డోలారోహణం అంటే కూడా అదేనా…? బారసాల ఒరిజినల్ పేరు ఏమిటి..? దగ్గర మొదలైన వార్త బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల ప్రస్తావనతో ముగిసింది… చిన్న వార్తే… కానీ వార్తేనా..? ఏం ..? ఎందుకు కాదు..? ఎందుకు కాకూడదు..? ఎవరో ఓ దిక్కుమాలిన సెలబ్రిటీ ఏదో గుడికి వస్తే, ఆ దేవుడిని దర్శించుకుంటే, ఆ దేవుడి ఉనికే ధన్యమైనట్టుగా… సదరు సెలబ్రిటీల ఫోటోలు వేసి పెద్ద పెద్ద పత్రికలే వాళ్ల పాదదాస్యం చేయడం లేదా..? ఆ ఫోటో వార్తలతో పోలిస్తే ఇవెందుకు వార్తలు కావు..? తమ పత్రికల ఓనర్లు కమ్ పొలిటిషియన్స్ తుమ్మితే వార్త, దగ్గితే వార్త… వాళ్ల ఇళ్లల్లో సత్యనారాయణ వ్రతం జరిగితే వార్త, వాళ్ల కుటుంబసభ్యులు వాయినాలు ఇచ్చుకుంటే ఫోటో వార్తలు… సో, సూర్యలో వచ్చిన ఈ బిట్ కూడా వార్తే… వార్త అంటే ఇదీ అనే నిర్వచనాలు ఇప్పుడు లేవ్… వర్తమాన ప్రమాణాల మేరకు ఇవన్నీ వార్తలే… ‘‘ఫలానా మంత్రి గారి ఎడమ చెవి మీద ఓ తెల్ల వెంట్రుక కనిపించింది’’ ‘‘ఎప్పుడూ చీరెలో కనిపించే ఫలానా లేడీ ఎమ్మెల్యే ఈమధ్య పంజాబీ డ్రెస్సుల్లో కనిపిస్తోంది…’’ అనే వార్తలు కూడా రేపు రేపు చదవాల్సి రావచ్చు… ఔను కదా, వీటిని వదిలేసి, మరీ టీవీలు చూద్దామా..? వామ్మో… అవి మరీ భీకరం, బీభత్సం, భయానకం… ఇదీ వర్తమాన పాత్రికేయం…!!
Share this Article