ఏపీ కాంగ్రెస్ జారీ చేసిన ఓ పత్రిక ప్రకటన నిజంగా నవ్వొచ్చేలా ఉంది… పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఊమెన్ చాందీ మొన్న ఎక్కడో మాట్లాడుతూ ‘‘చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో లేడు’’ అని కుండబద్ధలు కొట్టేశాడు… నిజంగానే చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు గనుక.., తన కేంద్ర మంత్రి పదవి పోయాక, రాష్ట్రం రెండుగా విడిపోయాక, తన రాజ్యసభ సభ్యత్వం గడువు ముగిశాక ఎప్పుడూ ఏ పార్టీ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు గనుక… ప్రజలు కూడా ఊమెన్ చాందీ చెప్పింది నిజమేలే అనుకున్నారు… అందరికీ తెలుసు, చిరంజీవి ప్రస్తుతం మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్సులోనే కాదు, అసలు రాజకీయ వాసనలకే దూరంగా ఉంటున్నాడని..! (నిజానికి తను ప్రజారాజ్యం అమ్ముకోకుండా, సారీ, కాంగ్రెస్ పార్టీలో నిమజ్జనం చేయకుండా ఉంటే, స్వతంత్రంగా ఆ పార్టీ అలాగే కొనసాగుతూ ఉండి ఉంటే… ఇప్పుడు తను ఏపీ రాజకీయాల్లో ఓ నిర్ణయాత్మక శక్తిగా ఉండేవాడు…) ఇప్పుడు విస్మయకరంగా అనిపించింది ఏమిటీ అంటే..? ఒక పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఒక నాయకుడు మా పార్టీలో లేడు అని చెప్పాక… ఆ నాయకుడు స్పందించడం సహజం… ఉంటే ఉన్నాననీ, లేకపోతే లేననీ క్లారిటీ ఇవ్వాల్సింది తనే… కానీ ఏపీసీసీ ఉలిక్కిపడింది ఎందుకో మరి…
‘‘నో, నో, చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు… ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రజాసేవ చేస్తున్నాడు… ఆయన, ఆయన కుటుంబం ఎప్పుడూ కాంగ్రెస్‌వాదులే.., భవిష్యత్తులో పార్టీ సేవలకు అందుబాటులోకి వస్తాడు… పత్రికలు అసత్యవార్తలు రాయడం దారుణం…’’ అంటూ ఏపీసీసీ ఓ ప్రకటన జారీ చేసింది… గుడ్, పార్టీ ఏపీ శాఖ ఆశ మంచిదే… కానీ ఆయన పార్టీలో ఉన్నాడో లేదో అర్జెంటుగా పార్టీయే వివరణ ఇవ్వడం దేనికి..? చిరంజీవి, ఆయన కుటుంబం ఎప్పుడూ కాంగ్రెస్‌వాదులేననే ముద్ర వేయడం దేనికి..? ఆయన రాజకీయాల్లోకి వచ్చిందే ప్రజారాజ్యం అనే సొంత పార్టీ స్థాపనతో… అంతకుముందు తన రాజకీయాల్లోనే లేడు… తమ్ముడు పవన్ కల్యాణ్ ప్రజారాజ్యం కథ ముగిశాక జనసేన అని తను సొంత పార్టీ పెట్టుకున్నాడు… టీడీపీతో, బీజేపీతో, లెఫ్ట్ పార్టీలతో కలిసి ప్రయాణించాడు తప్ప ఎప్పుడూ తను కాంగ్రెస్ దరిదాపుల్లోకి కూడా రాలేదు… రమ్మన్నా రాడు… మరిక మెగా కుటుంబం మొదటి నుంచీ కాంగ్రెస్‌వాదులే అని చెప్పడం దేనికి ఇప్పుడు..?
Ads
నిజంగా మళ్లీ రాజకీయంగా క్రియాశీలమయ్యే సూచనలు కూడా లేవు… ఎంచక్కా తనకు అచ్చొచ్చిన సినిమారంగంలోకి తిరిగి వెళ్లిపోయాడు… తెలంగాణలో కేసీయార్‌తో, ఏపీలో జగన్‌తో మంచి సంబంధాలు మెయింటెయిన్ చేసుకుంటున్నాడు… ఒకటీరెండు నిర్ణయాలకు సంబంధించి జగన్‌ను మెచ్చుకున్నాడు కూడా… చిరంజీవికి జగన్ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతున్నాడనే ప్రచారం కూడా ఇంకా సాగుతూనే ఉంది… చిరంజీవి ఖండించలేదు, కిమ్మనలేదు… ‘‘అయ్యా, జగనూ, చిరంజీవి ఇప్పటికీ మా కాంగ్రెస్‌వాడే’’ అని చెప్పడం ద్వారా ఫాఫం, ఆ రాజ్యసభ సీటు ఆశల మీద నీళ్లు గుమ్మరిస్తున్నదా ఏపీసీసీ..? అసలు ఆ పార్టీ అస్థిత్వమే గందరగోళంగా ఉంది… పాత కేంద్ర మంత్రులు, ఎంపీలు జాడాపత్తా లేరు… కొందరు బీజేపీలోకి జంప్… కొందరు రాజకీయ తెర మీద నుంచే మాయం… పార్టీ యాక్టివిటీస్ లేవు… నిజంగా చిరంజీవి గనుక ఇంట్రస్టుగా ఉండి ఉంటే, జనంలోనే ఉండి ఉంటే… కాంగ్రెస్ తన వ్యక్తిగత చరిష్మా ఆధారంగా మెల్లిమెల్లిగానైనా కాస్త జీవగంజి పోసుకునేదేమో… నడిపించే నాయకుడు లేడు, ఆ నావలో నావికులూ లేరు… కనుచూపు మేరలో ఏ ఒడ్డూ కనిపించడం లేదు…!! చివరగా ::: చిరంజీవి ఇష్యూను మీడియా లైట్ తీసుకుంది… అర్థమైంది కదా…!!
Share this Article