అప్పుడే జాతీయ మీడియాలో, సైట్లలో మొదలైపోయింది… యూట్యూబ్ చానెళ్ల గోల సరేసరి… ‘‘తరతరాల హిందూ అంత్యక్రియల ఆచార సంప్రదాయాల్ని మందిరా బేడీ బద్దలు కొట్టింది…’’ ఆ వార్తల కింద కామెంట్లు హోరెత్తడమూ సహజమే కదా… తప్పు లేదని కొందరు, తప్పే అనేవాళ్లు కొందరు… నిజానికి… సో వాట్..? అనే ఈ ప్రశ్న మీడియాకు వేసేవాడు లేడు… ఏ ఆచారమూ, ఏ సంప్రదాయమూ ఎప్పుడూ ఒకేరకంగా ఉండిపోదు… కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది, ఉండాలి… ఒకప్పుడు సతీసహగమనం ఓ ఆచారం, ఇప్పుడు అదే దిక్కుమాలిన దారుణ సంప్రదాయాన్ని పాటిద్దామా..? ఒకప్పుడు ఇంటి యజమాని చనిపోతే తన పెద్ద కొడుకు అంత్యక్రియల్ని, కర్మల్ని నిర్వర్తించేవాడు… అంత్యక్రియలకు కూడా మగవారసులే దిక్కు… ఇంటి యజమాని భార్య చనిపోతే మాత్రం చిన్న కొడుకులు నిర్వర్తిస్తారు…
కానీ ఈమధ్య మగవారసులు లేని వాళ్లు చనిపోతే, బిడ్డలు పాడె మోస్తున్నారు, అంత్యక్రియల్ని నిర్వర్తిస్తున్నారు… సమాజం నిరభ్యంతరంగా ఆమోదించింది… కడుపులో పుట్టినవాళ్లు ఎవరైతేనేం..? అసలు అంత్యక్రియలు ఎవరు చేస్తేనేం..? గౌరవంగా పైలోకాలకు పంపిస్తున్నామా లేదా..? అంతే… మొన్నామధ్య హైదరాబాదులో ఓ విషాదం… హాస్పిటళ్ల చుట్టూ తిరిగీ తిరిగీ, చికిత్స దొరక్క, నొప్పులతోనే ఓ నిండుగర్భిణి ప్రాణాలు వదిలింది… అంత్యక్రియలకు తీసుకెళ్తే బిడ్డను కడుపులో నుంచి తీస్తేనే అనుమతిస్తాం అన్నారు స్మశాననిర్వాహకులు… ఆ పనిచేసే హాస్పిటల్ కూడా దిక్కులేదు ఈ సహృదయ విశ్వనగరంలో… చివరకు మరుసటిరోజు ఏదో ప్రభుత్వ ఆసుపత్రిలో అలా విడదీశాకే అంత్యక్రియలు జరిగాయి… కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఇంకా ఇంకా ఇంకా మనం మారాల్సి ఉంది…
Ads
మందిరా బేడీ విషయానికొద్దాం… భార్య తన భర్త అంత్యక్రియలకు కర్తగా (Chief Mourner) వ్యవహరించవచ్చా..? హిందూ అంత్యక్రియల పద్ధతులను బట్టి చేయకూడదు… కానీ..? ఇంకో కోణంలో ఆలోచించాలి… ఈ కరోనా విపత్తులో హాస్పిటళ్ల నుంచి నేరుగా తీసుకెళ్లి, హాస్పిటళ్ల సిబ్బందే వేల శవాల్ని స్మశానాల్లో దహనం చేసేశారు… ఆ వేల మందికీ ‘‘కర్తలు’’ వాళ్లే… నిజానికి హిందూ సంప్రదాయంలోనే రకరకాలు… పెళ్లి కానివాళ్ల శవాల్ని ఖననం చేస్తారు, పెళ్లయినవాళ్లయితే కొందరు దహనం చేస్తారు, లింగధారులైతే పూడ్చివేస్తారు… శవఊరేగింపు సమయంలో కూడా పాడె మీద పడుకోబెట్టరు… కూర్చోబెడతారు…
కానీ కరోనా ధాటికి ఏ పద్ధతులూ లేవు… కట్టె కాలిందా, బూడిద మిగిలిందా..? అంతే… ఆ విషాదాలతో పోలిస్తే మందిరా బేడీ భర్త రాజ్ కౌశల్ మృతదేహానికి జరిగిన అవమానం ఏముంది..? సంప్రదాయ భగ్నం ఏముంది..? ప్రేమించి పెళ్లాడిన భర్త… పాతికేళ్ల అన్యోన్య దాంపత్యం… హఠాత్తుగా కన్నుమూశాడు… గుండె పగిలింది… రోదించింది… భర్తను దైహికంగా కూడా తనే ఈలోకం నుంచి పంపించాలని అనుకుంది… సొంత కొడుకు వీర్ కూడా ఉన్నాడు వాళ్లకు… దత్తత తీసుకున్న బిడ్డ తార కూడా ఉంది… కానీ ఆమే శవం ముందు నడిచింది, చితి అంటించింది… బంధాలన్నీ తెంపేసుకుంటున్నట్టు సింబాలిక్‌గా చితికుండను బద్దలు కొట్టేసింది… ఇందులో మనసుల్ని కదిలించే ప్రేమ ఉన్నదే తప్ప, చివుక్కుమనిపించే తప్పు ఏమీ కనిపించడం లేదు… కాకపోతే ఆ జీన్ ప్యాంట్, టీ షర్ట్, చెప్పులు… చూడటానికి కాస్త ఆడ్‌గా కనిపిస్తున్నయ్… అంతే…!!
Share this Article