.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గర్వంగా కాలర్ ఎగరేసే ముఖచిత్రం ఇది… కేసీయార్ కుర్చీ దిగాక, రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక రాష్ట్రం ఆర్థికంగా తిరోగమనంలో ఉందనే కువిమర్శలకు సరైన జవాబు ఈ అంకెలు, అంచనాలు… 2026-27 తలసరి జీడీపీ అంచనాల పట్టికలు పరిశీలిస్తే, తెలంగాణ దేశంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రాలనూ దాటేసి, అగ్రగామిగా నిలుస్తోంది… అనేకానేక ఉచిత సంక్షేమ పథకాలకు ఖజానా నుంచి బోలెడంత ఖర్చు పెడుతున్నా సరే, రాష్ట్రం ఆర్థికంగా బలంగా ఉండటమే కాదు, ఎదుగుతోందనీ, ప్రభుత్వం ఆశిస్తున్న త్రీ ట్రిలియన్ ఎకానమీ ఆచరణ సాధ్యమేననీ అర్థమవుతుంది…
ఆర్థిక విశ్లేషణాత్మక నివేదిక • iipmaps డేటా ఆధారంగా… మార్పిడి రేటు అంచనా: 1 USD = 95.69 INR …
Ads

పైన చార్ట్ గమనించండి… ఢిల్లీ, గోవా, సిక్కిం, లడఖ్… ఆయా ప్రాంతాల ప్రత్యేక పరిస్థితుల కారణంగా, చిన్న రాష్ట్రాలు, చిన్న ఎకానమీలు కాబట్టి వాటిని కాస్త పక్కన పెడితే… ఇక మొత్తం దేశంలోనే తెలంగాణ సగటు జీడీపీ అంచనాల్లో టాప్ వన్ ప్లేసు…
మనం అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా భావించే మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులను కూడా తెలంగాణ దాటేసింది… $5,302 సగటు జీడీపీ… ఐటీ ఎగుమతులు, ఫార్మాస్యూటికల్స్, హైదరాబాద్ కేంద్రీకృత వృద్ధి పటిష్టమైన ఆర్థిక పునాదిని కల్పించాయి… ఫ్యూచర్ సిటీ, ప్యూర్, క్యూర్, రేర్ ప్రణాళికలు ఆశించిన రీతిలో క్లిక్కయితే ఈ టాప్ వన్ ప్లేసు సుస్థిరం ఖాయం…
తమిళనాడు ($5,110) & కర్ణాటక ($5,001)…: తయారీ రంగం (Automobile), ఎలక్ట్రానిక్స్, బెంగళూరు టెక్ హబ్ కేంద్రాలుగా ఈ రెండు రాష్ట్రాలు $5,000 మార్కును దాటాయి…
మహారాష్ట్ర ($4,362) & గుజరాత్ ($4,674)…: దేశ ఆర్థిక రాజధాని ముంబై, గుజరాత్ లోని పారిశ్రామిక కారిడార్లు వీటి స్థానాన్ని స్థిరపరిచాయి… ఈ నాలుగు రాష్ట్రాలనూ తెలంగాణ దాటేస్తోంది…
ఆంధ్రప్రదేశ్ ($3,841)…: వ్యవసాయం, ఆక్వాకల్చర్, సుదీర్ఘ తీరప్రాంత ఆధారిత పరిశ్రమలతో జాతీయ సగటు కంటే మెరుగైన స్థానంలో నిలిచింది… కానీ మేమే తోపులం, మావల్లే హైదరాబాద్, తెలంగాణ వృద్ధి, మేం లేకపోతే తెలంగాణలో చీకట్లే, పేదరికమే అని ఏతులు (గొప్పలు- ప్రగల్భాలు పలికిన ఆంధ్ర ఆర్థిక ముఖచిత్రం తెలంగాణకు చాలాదూరంలో ఉండిపోయింది, అదీ గమనార్హం…
ఇటీవలి iipmaps గణాంకాల ప్రకారం, 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ సగటు వార్షిక తలసరి ఆదాయం (GDP per capita) $3,073 గా అంచనా వేయబడింది… ఈ సగటుతో పోలిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నట్టే…
ప్రస్తుతం జాతీయ సగటు వృద్ధి రేటు 8.2% ఉండగా, తెలంగాణ 10.7% వృద్ధి రేటుతో దూసుకుపోతోంది… కాబట్టి రేవంత్ రెడ్డి చెబుతున్నట్టు 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం సాధించదగిందే, దేశానికి 5 శాతం జీడీపీ అందించడమూ సాధ్యమే…
(నియోజకవర్గాల పునర్విభజనకు నిజంగానే కేంద్రం మిక్స్‌డ్ ఫార్ములాను పాటిస్తే… అంటే 50 శాతం సీట్లను గనుక పెంచే పక్షంలో, అందులో వృద్ధి రేటుకూ సగం క్రైటీరియా ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు కదా… అదే జరిగితే తెలంగాణకు పార్లమెంటు ప్రాతినిధ్యంలో మంచి వాటా వస్తుంది)…
రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తున్న మరో అంశాన్నీ తీసుకుందాం… దక్షిణాది కేంద్రానికి సమకూరుస్తున్న ఆదాయ వాటా చాలా అధికం… కానీ తిరిగి పొందుతున్నది తక్కువ, పైగా రాజకీయ ప్రాతినిధ్యంలోనూ అన్యాయం… నిజంగానే దేశ ఆర్థిక వృద్ధికి దక్షిణాది రాష్ట్రాలే గ్రోత్ ఇంజన్లుగా పనిచేస్తున్నాయి… ముఖ్యంగా పారిశ్రామికీకరణ, సేవా రంగం (IT & Services), విదేశీ పెట్టుబడులను (FDI) ఆకర్షించడంలో ఈ రాష్ట్రాలు ముందుండటమే దీనికి ప్రధాన కారణం…
ముఖ్యంగా బీహార్ దేశంలోనే అత్యల్పంగా $1,030 తలసరి ఆదాయాన్ని నమోదు చేస్తోంది… జాతీయ సగటు ($3,073) తో పోలిస్తే ఇది దాదాపు మూడో వంతు మాత్రమే… అదేవిధంగా, భారీ ఖనిజ వనరులు ఉన్నప్పటికీ జార్ఖండ్ ($1,589), దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఉత్తర ప్రదేశ్ ($1,708) రాష్ట్రాలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి… మధ్యప్రదేశ్ సైతం $2,147 తో జాతీయ సగటు కంటే వెనుకబడే ఉంది…
ప్రధాన ప్రాంతాల మధ్య ఆదాయ వ్యత్యాసం (ఆర్థిక అంతరం)…: దేశంలోనే అత్యధిక ఆదాయం గల ఒక పెద్ద రాష్ట్రమైన తెలంగాణ ($5,302) తో అత్యల్ప ఆదాయం గల బీహార్ ($1,030) ను పోల్చి చూస్తే, ఒక సగటు తెలంగాణ పౌరుడి ఆదాయం, బీహార్ పౌరుడి ఆదాయం కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువగా ఉంది… ఈ ప్రాంతీయ వ్యత్యాసాలు దేశంలో అంతర్గత వలసలపై (Migration) తీవ్ర ప్రభావం చూపుతున్నాయి…
Share this Article