‘‘ఎంత మాటంటివి జగన్… నువ్వేనా, ఇంత మాట అన్నది… నా గుండెను ఛిద్రం చేస్తివి కదా… నువ్వూ మా రామ్‌తో ఈక్వల్, దేవుడిచ్చిన బిడ్డవు అంటిని కదా… అలాంటిది నువ్వేనా నన్ను గాయపరిచే మాటలంటున్నది… ఏందీ..? తెలంగాణలో మీ ప్రజలున్నారు కాబట్టి సంయమనం పాటిస్తున్నావా..? ఆంధ్రోళ్లంతా నా ప్రజలే అని నేను ముందే చెప్పలేదా..? ఎన్ని వేల మంది ఆంధ్రోళ్ల కాళ్లలో ముళ్లు విరిగితే నా పంటితో పీకేశాను, గుర్తులేదా జగన్..? అంటే, ఏమైనా తేడా వస్తే నీ ప్రజల్ని నేను పీక్కుతింటానా ఏం..? మేమెలా కనిపిస్తున్నాం మీకు..? మొన్నటి ఎన్నికల్లోనే కదా నీకు ఎంత సాయం చేశాను..? మరిచిపోయినవా..? గెలిచినాక నా సొంత మనిషే గెలిచి వస్తున్నాడు అని స్వాగతం చెబితిని, అలుముకుంటిని, దావత్ ఇస్తిని, కలిసి ప్రాజెక్టులు కట్టుకుందాం బిడ్డా అని కూడా చెప్పితిని కాదా..? నువ్వే కదా ఆ ఉభయతారక ప్రతిపాదనల్ని ఎడమకాలితో తన్నేశావు…
ఆంధ్రావాలా భాగో అని మా తెలంగాణ వాళ్లలో ఉత్తేజాన్ని నింపడం కోసం ఏదో అన్నాను గానీ… ఉద్యమం వేళ గానీ, నా సర్కారు వచ్చిన ఈ ఏడేళ్లలో గానీ ఒక్కరంటే ఒక్క ‘‘నీ ప్రజల’’ మీద చేయి పడిందా చెప్పు..? మా గూడ అంజన్నను వదిలేశాను గానీ, మీ రామానాయుడిని, మీ హరికృష్ణను వదిలేశానా..? ఎంత గౌరవించాను..? చివరకు తప్పతాగిన మీ నారాయణ కొడుకు పిల్లర్ గుద్ది చచ్చిపోతే దగ్గరుండి అన్నీ చూసుకున్నాం తప్ప ‘మనోడు’ కాదులే అని వదిలేశామా..? అసలు ఈరోజుకూ మీపాలనే నడుస్తున్నది అన్నట్టుగా జాగ్రత్తపడుతున్నానా లేదా..? చివరకు మా నయీంను చంపుకున్నామే తప్ప, మీ కబ్జాదారుల జోలికొస్తినా..? నాగార్జున ఎన్ కన్వెన్షన్ దగ్గర నుంచి మొన్నమొన్నటి భూమా వారి అఖిల భూయవ్వారం మీద కూడా సానుకూలంగానే ఉన్నాం తప్ప ఇంకేమైనా అంటిమా..? నా బిడ్డే కదా ఏదో సెటిల్ చేసి, ఫుల్ స్టాప్ పెట్టింది… అన్నీ మరిచిపోతివా..?
Ads
ఉద్యమవేళ లక్ష అంటాం, అన్నింటికీ కట్టుబడతామా ఏం..? చివరకు మీరు పదే పదే వెక్కిరించిన మా భాషను కూడా వదిలేసి, మీ భాషే మా భాష అని ప్రకటించేసి, మహాసభలు పెట్టేశాం మరిచినవా..? ఎన్ని..? ఎన్నని..? ఎన్నెన్నని..? ఒక్కరికీ కోపం రావొద్దని ఎన్ని త్యాగాలు చేస్తిని… పోతిరెడ్డిపాడు పొక్కను వదిలేస్తిని, ఆ పొక్క వెడల్పు చేస్తానంటే కళ్లప్పగించి చూస్తిని తప్ప, ఏమైనా అంటినా..? సీమ లిఫ్టు అనీ, ఆర్డీఎస్ కాల్వ అనీ, మీ నీళ్లు తోడుకుపోతా అనీ నువ్వు ఏదేదో హంగామా చేస్తుంటే చూస్తున్నాను గానీ కిమ్మంటినా చెప్పు..? మా దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను వదిలేసి, కృష్ణాలో ముంచేసి, వాటి కెపాసిటీలు తగ్గించేసి త్యాగాలు చేశానే తప్ప నిన్నేమైనా అంటినా..? చివరకు నువ్వు మనసులో ఏదో పెట్టుకుని చెల్లెబాణం వదిలితే ఒక్కటంటే ఒక్క మాట అంటినా చెప్పు..? ఆ చంద్రబాబును తిట్టిపోశానే తప్ప నిన్నేమైనా అంటినా..? మీ మీడియాను ఏమైనా అంటినా..? మీ సినిమావాళ్లను ఏమైనా అంటినా..? మీ వ్యాపారాల జోలికి వస్తినా..? మీ పాత కబ్జాల జోలికి వస్తినా..? ఏం చేశానని ఇప్పుడు ‘‘మా వాళ్లున్నారు’’ అని రాగాలు తీస్తున్నవ్..? మీ వాళ్లు లేకపోతే ఏం చేసేవాడివి జగన్..? పాత కేసీయార్ ఇక జన్మలో కనిపించడు అనే కదా నీ ధైర్యం..? అదేకదా నీ ధీమా..? నీకు నీళ్లు రాకుండా చేస్తున్నానా..? అసలు మా నీళ్లనే నేను వాడుకునే సీన్ లేదు, నీ నీళ్లను నేనేం చేసుకోవాలి..? కానీ, ఏదేమైనా ఆంధ్రా ప్రజల హృదయవిజేతగా నిలిచిన నన్ను ఇన్నేసి మాటలని గాయపరచడం బాగాలేదు జగన్… ఏం బాగాలేదు…!! ప్లీజ్, మళ్లీ ఇలాంటి మాటలనకు… సరేనా…?! లేకపోతే… మీవాళ్లంటే ఎవరో, మావాళ్లంటే ఎవరో నిర్వచనం డిసైడ్ చేయి…’’
Share this Article