.
( ప్రియదర్శిని కృష్ణ ) ……… ఈ బైజూస్ రవీంద్రన్ కథ వింటుంటే… నడమంత్రపు సిరి నెత్తికెక్కితే నడిసముద్రంలో నావ మునిగినట్టు అనిపించక మానదు… ఒకప్పుడు దేశంలో ప్రతి ఇంటా వినిపించిన పేరు… ఇవాళ కోర్టు మెట్లు, జైలు గోడల మధ్య నలిగిపోతోంది… ఈ బైజూస్ సామ్రాజ్యం కూలిపోయిన కథాకమామిషు ఇదీ…
బైజూస్…: ‘యూనికార్న్’ నుంచి ‘జీరో’ కి చేరిన స్వయంకృతాపరాధం! “పెరుగుట విరుగుట కొరకే”… ఈ సామెతను బైజూస్ కంటే పర్ఫెక్ట్‌గా ఏ కంపెనీ కూడా నిరూపించలేదు కాబోలు! 2011లో ఓ మామూలు ప్రైవేట్ ట్యుటోరియల్‌గా మొదలై… చేతిలో స్మార్ట్‌ఫోన్, నెత్తిన ఐడియా ఉన్న ప్రతి ఒక్కరికీ ‘ఎడ్యుకేషన్ బాస్’ లా కనిపించాడు ఈ బైజూ రవీంద్రన్.
Ads
2015 నుంచి నిన్నమొన్నటి పాండమిక్ (కరోనా) కాలం వరకు ఈ పేరు ఒక సంచలనం. పిల్లలకి చదువు చెప్పించాలనే తల్లిదండ్రుల ఆరాటాన్ని క్యాష్ చేసుకుంటూ, 22 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ‘యూనికార్న్’ స్టార్టప్‌గా ఎగబాకింది.
కట్ చేస్తే… ఇవాళ ఆ 22 బిలియన్ల సామ్రాజ్యం ‘బిగ్ జీరో’ దగ్గరకొచ్చి ఆగింది. నిన్న గాక మొన్న సింగపూర్ కోర్టు ఈ బైజూ రవీంద్రన్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ రూలింగ్ ఇచ్చింది. ఎందుకంటారా?
కంపెనీ మునిగిపోతున్న తరుణంలో ‘ఖతార్ హోల్డింగ్స్’ అనే ఇన్వెస్టర్ సంస్థ… బైజూస్ ఆస్తుల వివరాలు (Asset-Disclosure) బయటపెట్టమని కేసు వేసింది. కోర్టు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా మనోడు లైట్ తీసుకున్నాడు. దాంతో కోర్టు ధిక్కరణ (Contempt of Court) కింద సింగపూర్ న్యాయస్థానం ఊచలు లెక్కపెట్టమంది!
అసలు ఎక్కడ తేడా కొట్టింది?
డబ్బులు ఊరికే రావు… వచ్చిన డబ్బును ఎలా దాచుకోవాలో, ఎలా ఖర్చు పెట్టాలో తెలియకపోతే ఏమవుతుందో బైజూస్ చేసి చూపించింది.
అత్యాశ – విచ్చలవిడి ఖర్చులు: చేతిలోకి ఇన్వెస్ట్‌మెంట్లు రాగానే కన్నుమిన్ను కానకుండా ఖర్చు పెట్టేశారు. క్రికెట్ ఎండార్స్‌మెంట్లు, భారీ అడ్వర్టైజ్‌మెంట్లు… అంతెందుకు, ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీని బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకోవడానికి కోట్లు గుమ్మరించారు.
విద్య వ్యాపారమైంది… సేల్స్ మాఫియా పెరిగింది: చదువు చెప్పడం పక్కన పెట్టి, ట్యాబ్‌లు అమ్మడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. మార్కెటింగ్ ఏజెంట్లను అప్పుల వసూలు చేసే గూండాలకంటే ఘోరంగా తల్లిదండ్రుల మీదకు వదిలారు. మీ పిల్లవాడు బాగుపడాలంటే ఈ ట్యాబ్ కొనాల్సిందేనంటూ పీడించి, వారి నమ్మకాన్ని, జేబుల్ని గుల్ల చేశారు.
సొమ్ము ఇక్కడ… సోకులు అక్కడ: ఇక్కడ భారత్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులు, జీతాలు లేని టీచర్లు రోడ్డున పడుతుంటే… ఈ ప్రమోటర్లు మాత్రం దుబాయ్‌కి లగేజ్ సర్దేసి, ప్రపంచవ్యాప్తంగా ఆస్తులు కూడబెట్టుకోవడంలో బిజీ అయిపోయారు.
అడ్డంగా బుక్కైన ‘థింక్ & లెర్న్’!
ఇంత పెద్ద సామ్రాజ్యానికి, విచిత్రంగా తమకంటూ ఒక పక్కా CFO (చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్) లేకపోవడం వీళ్ల దరిద్రం! బైజూస్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన ‘Think & Learn’ కి మొదటి నుంచి డెలాయిట్ (Deloitte) ఆడిటర్‌గా ఉండేది. అయితే, ఒక 12 బిలియన్ డాలర్ల టర్మ్ లోన్ వ్యవహారాన్ని వీళ్లు ఆడిటర్ల దగ్గర దాచారు. “మాకేం చెప్పకుండా మీ ఇష్టమొచ్చినట్టు చేస్తారా?” అంటూ విసిగిపోయిన డెలాయిట్ సంస్థ… మధ్యలోనే చేతులెత్తేసి రిజైన్ చేసింది.
మరోపక్క ‘వైట్ హ్యాట్ జూనియర్’ (WhiteHat Jr) అనే కోడింగ్ కంపెనీని భారీ రేటుకి కొని… దాన్ని ఒక ‘వైట్ ఎలిఫెంట్’ (తెల్ల ఏనుగు) లా మార్చుకున్నారు. అది తెచ్చిన నష్టాలు భరించలేక ఉద్యోగులను కుక్కల్ని తీసేసినట్టు లేఆఫ్‌లు చేశారు.

క్లైమాక్స్ సీన్
ఒకపక్క ఇన్వెస్టర్లు బ్యాకప్ అయిపోవడం, మరోపక్క స్పాన్సర్‌షిప్ బకాయిల కోసం సాక్షాత్తూ దేశీ క్రికెట్ బోర్డు BCCI… బైజూస్ మీద ఇన్సాల్వెన్సీ (దివాలా) పిటిషన్ వేయడం… ఇవన్నీ తడిసి మోపెడై రవీంద్రన్ మెడకు చుట్టుకున్నాయి.
ముచ్చటగా నిజం చెప్పుకోవాలంటే… నడమంత్రపు సిరి, దానికి తోడు మితిమీరిన అత్యాశ తోడైతే ఎంతటి సామ్రాజ్యమైనా మట్టికొట్టుకుపోతుందని చెప్పడానికి బైజూస్ ఒక పక్కా ఉదాహరణ. ఇదంతా ఎవరో చేసిన కుట్ర కాదు… ముమ్మాటికీ బైజూ రవీంద్రన్ చేతులారా చేసుకున్న ‘స్వయంకృతాపరాధం’!

Share this Article