.
తెలంగాణ సాధనలో జర్నలిస్టుల పాత్ర తక్కువేమీ కాదు… ఇదే కేసీయార్‌ను, అప్పటి టీఆర్ఎస్ పార్టీని నెత్తిన మోసింది జర్నలిస్టు సమూహం… కానీ ఏం ఒరిగింది..? చాలామందికి మొండిచేయి చూపినట్టే జర్నలిస్టులకూ తీరని అన్యాయం చేశాడు కేసీయార్… కాగా నిన్నటి మీట్ ది ప్రెస్‌లో కేటీయార్ ఏదో కవరింగుకు ప్రయత్నించాడు… కానీ నిజానికి తను ఆత్మవంచన కాదు, ఆత్మసమీక్ష చేసుకోవాలి… (ఈ మీట్ ది ప్రెస్‌లకు ఇప్పుడు సందర్భం ఏమిటో అర్థం కాలేదు)…
జర్నలిస్టులు ఫ్యూచర్ సిటీ అనబడే ఓ ఊహాజనిత నగరంపై ఆశలు పెట్టుకోకుండా మంచిరేవుల, బుద్వెల్ వంటి చోట్ల 100 ఎకరాలు అడగాలని ఓ ఉచిత సలహా విసిరేశాడు… ఇళ్లపట్టాలు ఇచ్చే చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే కేటాయించిన స్థలాల్లోనే ఇవ్వాలని డిమాండ్ చేశాడు… శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు అనే మాటకు నిలువెత్తు నిదర్శనం కేటీయార్, కేసీయార్…
Ads
నిజానికి 1100 మంది జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య తనకు తెలియదా..? సుప్రీంకోర్టు పాజిటివ్ ఆర్డర్ ఇచ్చినా సరే, భూమి అప్పగించకుండా, కనీసం జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా, ఒక్క మాట మాట్లాడకుండా ఉద్దేశపూర్వక ద్రోహం చేసింది ఎవరు…? కేసీయార్..!
సుప్రీంకోర్టులో సొసైటీ కేసు ఓడిపోయింది, ఇప్పటి భూముల్లోనే ఇళ్లస్థలాలు ఇవ్వడానికి దారులు మూసుకుపోయాయి… అది తెలిసీ, ఓ వెక్కిరింపు ధోరణితో ‘అక్కడే ఇళ్లస్థలాలు ఇవ్వాలి చిత్తశుద్ధి ఉంటే’ అని మాట్లాడుతున్నాడు చిన్నదొరవారు… మరి నువ్వెందుకు ఇవ్వలేదు..? పోనీ, అదే మంచిరేవుల, బుద్వెల్లో ఇవ్వాలని ఎందుకు అనుకోలేదు..? 

మస్తు మందికి మేం అక్రెడిటేషన్లు ఇచ్చాం అంటున్నాడు… అదా జర్నలిస్టు సంక్షేమం..? చివరకు బీమా పథకం కింద కూడా జర్నలిస్టులను అడ్డా కూలీలు, హమాలీల వంటి అసంఘటిత కార్మికుల జాబితాలో చేర్చింది కేసీయార్… చివరకు మీ సర్కారు ఇచ్చిన హెల్త్ కార్డులను ఏ హాస్పిటల్ కూడా పట్టించుకోలేదు… బస్‌పాసులు తప్ప నీ అక్రెడిటేషన్లతో ఒరిగిందేమిటి కేటీయార్..?
జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా, వాటిని స్వాధీనం చేసుకోవాలనుకున్నది కేసీయార్… నిన్న కూడా అదే చెబుతున్నాడు, విలువైన భూముల వల్లే జర్నలిస్టులకు ఇవ్వలేకపోయాం అని… మరి నువ్వు ఇవ్వలేదు సరే, అవే విలువైన భూములు, అక్కడే ఇవ్వాలని ఎలా డిమాండ్ చేస్తున్నట్టు..? మళ్లీ నువ్వే మంచిరేవుల, బుద్వెల్ అంటావు, ఏమిటో… తప్పు, అన్యాయం కప్పిపుచ్చుకోవడం కూడా ఓ కళ మాస్టారూ…
ఓసారి ఏదో ప్రెస్మీట్లో ఎవరో సాహసించి అడిగితే… మమ్మల్ని తిట్టేవాళ్లకు కూడా స్థలాలు ఇవ్వాలా అన్నాడు కేసీయార్, వెంటనే తమాయించుకుని, తెలంగాణను తిట్టేవాళ్లకు అని సవరించుకున్నాడు… అప్పట్లో ఆంధ్రజ్యోతితో ఏదో వైరంతో…! బీఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీ అని తనే అన్నాడు, తెలంగాణ ద్రోహులకు మంచి పదవులు ఇచ్చాడు… తనను విమర్శిస్తే తెలంగాణను విమర్శించినట్టు అవుతుందా..? మీడియా బీఆర్ఎస్కు ఊడిగం చేయాలా..?
ఏదేని పత్రికల యాజమాన్యాలతో వైరం ఉంటే అది వేరు, పనిచేసే జర్నలిస్టులపై ఆ కోపం, ఆ కక్ష దేనికి..? ఐనా స్థలాలు ఇవ్వాలని ఉంటే కదా..! జవహర్లాల్ హౌజింగు సొసైటీలోని 1100 మందికి అన్యాయం చేశాడు కదా, అందులో దాదాపు 60 మంది వరకూ మనోవ్యధతో మరణించారు… మొన్నటి ఎన్నికల్లో వాళ్ల ఉసురే తగిలిందేమో…
రేవంత్ రెడ్డి ఆ భూముల్పి అప్పగిస్తూ… బహిరంగంగా, వందలాది జర్నలిస్టు కుటుంబాల ఎదుట ఉత్తర్వులు ఇచ్చాడు… సరే, సొసైటీ దురదృష్టం కొద్దీ సుప్రీంకోర్టులో ఓడిపోయి, జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరిగిపోయింది… ఐనాసరే, రేవంత్ రెడ్డి సానుకూల దృక్పథంతో ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు… దానికీ కట్టెలు పెట్టే ప్రయత్నం కేటీయార్ మాటలు… ఫ్యూచర్ సిటీనే రద్దు చేస్తామంటూ హరీష్ కట్టెలు…
మీడియా సంస్థలనే బెదిరించి దారికి తెచ్చుకున్నాం, ఈ జర్నలిస్టులతో ఏం పని అనేదే కేసీయార్ ధోరణి… ఎవరో కొందరిని ‘అర్సుకుంటే’ చాలు అనే పోకడ… కానీ రేవంత్ రెడ్డి ఆ సొసైటీయే కాదు, కొత్త జర్నలిస్టులకు కూడా స్థలాలు ఇస్తానంటున్నాడు… సంకల్ప శుద్ధి ఉంది తనకు… ఒక కేసీయార్, ఒక కేటీయార్, ఒక హరీష్ రావులకు వీటిపై మాట్లాడే నైతికత ఉందా అసలు..? పైగా వెటకారాలు, ఉచిత సలహాలు, కాళ్లల్లో కట్టెలు పెట్టే ఎత్తుగడలు…
Share this Article