తెలంగాణ కోసం నేను మొక్కుకున్నా… దేవుళ్లందరికీ మొక్కులు తీర్చుకుంటా… నా మొక్కే తెలంగాణ మొక్కు, నేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే నేను అనుకుంటూ కోట్లకుకోట్లు ఖజానా నుంచి తీసి, తెలంగాణ ఏర్పాటు కోసం దీవించిన ఆంధ్రా దేవుళ్లకు కూడా మస్తు నగలు పెట్టాడు కేసీయార్… ఆయన మొక్కు తెలంగాణ మొక్కు ఎట్లయితదని ఎవరూ అడగలే… యాంటీ-సెంటిమెంట్ అవుతుంది కాబట్టి..! సేమ్, ప్రతి అడుగు అదే… నేను, నేను, నేను… ఒకరకమైన చిత్రమైన మానసిక స్థితి ఇది… నేను పుట్టిన ఊరు… ఛలో ఇంటింటికీ 10 లక్షల ప్యాకేజీ… తీసుకోకపోతే మర్యాద దక్కదు… ఎందుకు ఈ విశిష్టత..? కేసీయార్ పుట్టాడు కాబట్టి… సో వాట్… ఈ అనంత కాలగమనంలో ఎందరో పుడతారు, పోతారు కదా అనొద్దు… కేసీయార్ పుట్టిన మట్టి అంటే దానికి ఓ ఘన పవిత్రత ఆపాదించబడాలి కదా మరి… కేసీయార్ పొలం కొన్న ఊరు… ఎర్రవల్లి ఓ స్పెషల్, దానికీ పవిత్రత… తను పోటీచేసిన గజ్వెల్, అది మరీ ఘనత… తను ఈతకొట్టిన బాయి, తను సైకిల్ తొక్కిన బాట, తను ప్యాంట్లు కుట్టించుకున్న టైలర్, తను పాత జీపు, తొలిసారి కొన్న కారు… చివరకు ఇలా వెళ్లిపోబోవడం లేదు కదా…!! ఈ ఫోటో చూడండి… పది కోట్లతో ఓ సర్కారు బడిని ఇలా ‘బంగారు బడి’గా పునర్నిర్మించాడు…
నిజంగా ఒక సర్కారు బడి ఇలా ఓ మాన్యుమెంట్ తరహాలో తళతళలాడుతూ, పది మందికీ నాణ్యమైన విద్యాభిక్ష పెడితే… అసలు ఒక సర్కారు బడికి ఈ రూపు కనిపిస్తేనే అదొక సంబరం… కానీ..? కానీ..? అది ఈ బడే ఎందుకు కావాలి..? కేసీయార్ చదివాడు కాబట్టి…!! అందుకే దానికి ఆ విశిష్టత… అందుకే పదికోట్ల ఖర్చు, మూడు అంతస్థులు, ల్యాబు, లైబ్రరీ, అదొక రాజభవనం ఇప్పుడు… మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేల సర్కారు బళ్ల గతేమిటి..? పట్టణాల్లో పంతుళ్లుంటారు, పిల్లలుండరు… పల్లెల్లో పిల్లలుంటారు, పంతుళ్లుండరు… గదులు సరిపోవు, మరుగుదొడ్లకూ దిక్కుండదు, ఏనాటివో పాత భవనాలు… వాటి గురించి ఆలోచన ఎందుకు లేదు..? కేసీయార్‌ను మావాడే, మనవాడే అని గుండెలకు హత్తుకుని, ప్రేమగా వోట్లేసి, సీఎం కుర్చీలో కూర్చోబెట్టి మురిసిన వేల పల్లెల మాటేమిటి..? ఆ పల్లెల్లోని పిల్లల మాటేమిటి..? ఫాఫం, అవేం పాపం చేశాయి..?
Ads
ఒకసారి అలా పక్కనే ఉన్న ఏపీ వైపు చూద్దాం… మొన్నమొన్నటిదాకా వాళ్లూవీళ్లూ ఒకటేగా… ఇప్పుడంటే దాయాదులం అయిపోయాం గానీ…! ఇదే కేసీయార్ వెంటబడి తరిమేసిన ఓ దళిత ఐఏఎస్ ఆకునూరి మురళిని సలహాదారుగా పెట్టుకున్నాడు జగన్… నాడు-నేడు పేరిట ప్రతి సర్కారు బడి రూపురేఖలు మార్చేస్తున్నారు… కేంద్ర నిధులే, రాష్ట్రం మ్యాచింగ్ నిధులో… ఏవైతేనేం, సైలెంటుగా ప్రతి సర్కారు బడి ‘పునర్జన్మ’ను పొందుతోంది… ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టారు… స్ట్రెంత్‌ను బట్టి స్కూళ్లను రీఆర్గనైజ్ చేస్తున్నారు… పిల్లల పేరిట తల్లులకు పైసలొస్తున్నయ్… నా ఇడుపులపాయ, నా పులివెందుల, నా కడప అనే కథలేం లేవు… అన్నీ మనవే… అందరికీ అన్నీ దక్కాలి… ఇప్పుడదే మోడల్‌ను తెలంగాణ అధ్యయనం చేస్తున్నదట… అదీ ఐరనీ… వంగరలో పుట్టిన మాజీ ప్రధాని పీవీ ఎప్పుడూ తన సొంతూరులో వీథిదీపాల గురించి, హ్యాండ్ బోర్ల గురించి, మురికి కాలువల క్లీనింగు గురించి ఆలోచించలేదు… నాకు సమాజం ఏ బాధ్యత అప్పగించింది…? దేశం మొత్తానికీ పనికొచ్చే పనులేమిటా అనే ఆలోచించాడు..? రాజనీతిజ్ఞత అంటే అదీ…!! సరళంగా చెప్పాలంటే… రాజు తన రాజ్యంలోని ప్రతి అంగుళాన్నీ ప్రేమించాలి, ప్రతి ఊరూ తను పుట్టిన సొంత ఊరుగానే కనిపించాలి..!! అన్నట్టు బీజేపీ రఘునందన్ భయ్యా… ఆ దుబ్బాక చుట్టుపక్కల సర్కారు బళ్ల అసలు స్థితిగతుల మీద నువ్వేమైనా చెప్పగలవా..?!
Share this Article