Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నీ కుంకుమ ఎప్పుడూ పొద్దు కుంకదమ్మా… కానీ చనిపోయేది గంగాధరం కదా..?”

June 5, 2026 by M S R

.
.
నిన్న స్వాతికిరణం సినిమా సంగతులు రాస్తుంటే… ఓ పాట దగ్గర మనసు, చూపు, మౌజ్ ఆగిపోతాయి… అలా ఆ పాట యూట్యూబ్ లింక్ వైపు వెళ్లి ఆన్ చేస్తే… జాలిగా జాబిలమ్మా అనే పాట… సిరివెన్నెల సీతారామశాస్త్రి, విశ్వనాథ్‌ల టేస్ట్, లోతైన భావం, మార్మిక వ్యక్తీకరణకు తిరుగేముంది..? సిరివెన్నెల ప్రఖ్యాత గీతాల్లో చేర్చదగిన పాట ఇది…

అయితే పాట వింటుంటే… ఓచోట ఓ సందేహం తట్టుకుంటుంది, ఓపట్టాన జవాబు దొరకదు… ఏమిటంటే..? ఆ సినిమాలో రాధిక భర్త మమ్ముట్టి ప్రఖ్యాత విద్వాంసుడు… తమ ఇంటికి వచ్చి, తన భార్యకు ఓ దత్తత కొడుకుగా మారిన జన్మప్రతిభుడు మంజునాథ్ ఒక దశలో మమ్ముట్టిని దాటిపోతాడు… మమ్ముట్టిలో ఈర్ష్య, గురువుకు ఉండకూడని అసూయ…

దాంతో ఎక్కడికక్కడ తనను డిస్కరేజ్ చేస్తుంటాడు… చివరకు గంగాధరమే (మంజునాథ్) మరణిస్తాడు… అసలు మమ్ముట్టికి ప్రాణగండం ఏమీ లేదు కదా… మరి ఈ పాటలో ఓచోట సిరివెన్నెలతో విశ్వనాథ్ ‘‘”నీ కుంకుమ ఎప్పుడూ పొద్దు కుంకదమ్మా…” అని రాయించాడు– కానీ చనిపోయింది గంగాధరమే కదా?

Ads

పాట వింటుంటే మనకు అర్థమైందనే అనిపిస్తుంది… కానీ ఏళ్ల తర్వాత మళ్లీ వింటే కొత్త ప్రశ్నలు పుడతాయి… ఇది అలాంటి పాటే… “నీ కుంకుమ ఎప్పుడూ పొద్దు కుంకదమ్మా…” ఇదీ ఆ వాక్యం… మంచి భావస్పోరకం… అమ్మా, నీ మాంగల్యానికి ఢోకా లేదమ్మా, నీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నా అని పిల్లాడే ఆ ‘అమ్మ’ను ఊరడిస్తుంటాడు…

ఈ లైన్ విన్నప్పుడు సహజంగానే ప్రేక్షకుడికి ఒక సందేహం వస్తుంది… సినిమాలో విషాదాంతం ఎదుర్కొనేది గంగాధరం… రాధిక భర్త అనంతరామశర్మకు ఏ ప్రాణగండమూ ఉండదు… మరి గంగాధరం ఎందుకు “నీ కుంకుమ చెదరకూడదు” అని పాడాడు..?

“ఇక్కడే విశ్వనాథ్- సిరివెన్నెలల జోడీ గొప్పతనం కనిపిస్తుంది. వారు కథను రాయలేదు, పాత్రల మనసులను రాశారు. అందుకే ఈ లైన్‌ను కథా సంఘటనలతో కొలిస్తే సందేహం వస్తుంది; భావోద్వేగంతో చూస్తే సమాధానం దొరుకుతుంది.”

గంగాధరం శారద బాధను చూస్తాడు… ఆమె ఎందుకు బాధపడుతోందో పూర్తిగా అర్థం కాకపోయినా, ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు… అందుకే ఒక చిన్నవాడు చెప్పగలిగే అత్యంత పెద్ద ఆశీర్వాదాన్ని ఇస్తాడు… “నీ కుంకుమ ఎప్పుడూ చెదరకూడదు…” అది భవిష్యత్తును చెప్పిన మాట కాదు. ఒక శుభాకాంక్ష…

ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం గుర్తుకు వస్తుంది. శుభలేఖ సినిమాలోని “రాగాల పల్లకిలో కోయిలమ్మా… రాలేదు ఈ వేళ ఎందుకమ్మా…” పాట కూడా ఇలాగే ఉంటుంది… అది ఒక రూపకం. ఎదురు చూపులకు, మనసులోని ఖాళీకి ప్రతీక… అలాగే జాలిగా జాబిలమ్మా పాటలో జాబిలమ్మ, పార్వతి, గణపతి రూపకాలన్నీ కథలోని పాత్రలకు నేరుగా సరిపోలవు… కానీ వారి భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయి…

విశ్వనాథ్ సినిమాల్లో పాటలు తరచూ “లాజిక్”తో కాకుండా “భావం”తో నడుస్తాయి… 

పాటలో: “సున్నిపిండిని నలిచి చిన్నారిగా మలిచి, సంతసాన మునిగింది సంతులేని పార్వతి” అంటారు… ఇక్కడ శారదను పార్వతిగా ఊహిస్తున్నారు… గంగాధరాన్ని గణపతిగా ఊహిస్తున్నారు… కానీ గంగాధరం ఆమె కుమారుడు కాదు… ఆమె నిస్సంతు… అయినా ప్రేక్షకుడికి ఆ అనుబంధం అర్థమవుతుంది… ఎందుకంటే ఇది జీవశాస్త్ర సంబంధం కాదు; భావోద్వేగ సంబంధం…

“ఇప్పటి సినిమాల్లో పాట కథకు సేవకురాలు. విశ్వనాథ్ సినిమాల్లో మాత్రం పాట కథకు సహచరి. కథ చెప్పలేని భావాలను పాట చెబుతుంది.”

అందుకే “నీ కుంకుమ ఎప్పుడూ పొద్దు కుంకదమ్మా” అనే లైన్‌ను లాజిక్‌తో చూస్తే ప్రశ్న వస్తుంది… భావంతో చూస్తే మాత్రం… ఒక అమాయక బాలుడు తనను తల్లిలా చూసుకున్న స్త్రీకి ఇచ్చిన అత్యంత పవిత్రమైన ఆశీర్వాదంగా కనిపిస్తుంది… అమ్మ బాగుండాలనే ఆకాంక్ష…

“గంగాధరం ‘ నీ కుంకుమ ఎప్పుడూ పొద్దు కుంకదమ్మా’ అన్నప్పుడు, అతను శారద భవిష్యత్తును చెప్పలేదు. ఆమె వర్తమానాన్ని ఓదార్చాడు. అదే ఈ పాట అందం. అదే సిరివెన్నెల మాయ. అదే విశ్వనాథ్ సినిమా.”



ఈ పాట పాడింది వాణీజయరాం, చిత్ర… ఇద్దరూ ఇద్దరే కదా… కేవీ మహదేవన్ సంగీతం, కానీ నిజానికి ఆయన శిష్యుడు పుహళేంది మొత్తం ఈ సినిమా సంగీతాన్ని చూసుకున్నాడని అంటారు…

ఈ పాటలోని కొన్ని లైన్లు చూస్తే సిరివెన్నెల గారి ప్రతిభ ఎంత లోతుగా ఉందో తెలుస్తుంది…

“సున్నిపిండిని నలిచి చిన్నారిగా మలిచి
సంతసాన మునిగింది సంతులేని పార్వతి”

అంటే పార్వతి తన కుమారుడు గణపతిని ప్రేమగా పెంచుకుంటున్న తల్లి. ఆ తర్వాత:

“ప్రాణపతినంటుందా? బిడ్డగతి కంటుందా?”

అని అడుగుతారు… ఇక్కడే పాట అసలు బాధ మొదలవుతుంది… భర్తకా? బిడ్డకా? అన్న తల్లి హృదయ సంఘర్షణను సిరివెన్నెల అద్భుతంగా రాశాడు… ఇలాంటి పాటలు అందుకే చిరకాలం మదిని తడుతూనే ఉంటాయి…



Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆ గోల్డ్ కంపెనీ కథేంటి..? KTR తో ఒప్పందమేంటి..? ఏం జరుగుతోంది..?
  • సూర్య కుమార్ ఔట్..! క్రికెట్ అన్ని పాఠాలూ నేర్పించే ఓ గురువు..!!
  • నీ కుంకుమ ఎప్పుడూ పొద్దు కుంకదమ్మా… కానీ చనిపోయేది గంగాధరం కదా..?”
  • శ్రీయుత గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి…
  • అసలు సమస్యలు వేరు… అవి వదిలేసి బీజేపీ హైకమాండ్ తంటాలు…
  • వాడొకడు, వీడొకడు… ఏం మోపైనార్రా భయ్… అసలెవర్రా మీరంతా…
  • కాంచి- బొంగు- సీటు … సైకిల్- ఈత నేర్వనోడు అప్పట్లో శుద్ధ మొద్దు…
  • AI పై భయమొద్దు… పనికి ఢోకా లేదు, పని తీరు మారుతుంది… అంతే…
  • జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై కేటీయార్ కవరింగులు- సన్నాయి నొక్కులు..!!
  • డీకే బలంగా నమ్మే ఒకే ఒక పేరు..! ఇంతకీ ఈ గంగాధర అజ్జయ్య ఎవరు..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions