అసలే బోలెడన్ని చిక్కుముళ్లు… ఇప్పుడు తాజాగా కేసీయార్ మరికొన్ని బిగించాడు గట్టిగా..! తెలంగాణ ప్రభుత్వం మునుపెన్నడూ లేని రీతిలో తన జలవైఖరిని దృఢంగా, ఇన్నేళ్ల వివాదాలకు కొత్త ట్విస్టులిస్తూ ప్రకటించింది… అవే తాజా ముడులు…!! పోతిరెడ్డిపాడు అక్రమం, రాయలసీమ లిఫ్టు చట్టవ్యతిరేకం అని చెప్పడం కొత్త కాదు, అది కాదు అసలు విశేషం… ఇంకొన్ని చెప్పుకోదగిన అసలు విశేషాలున్నయ్… అది రెండు రాష్ట్రాల నడుమ నీటినిప్పును ఇంకాస్త రగిలించడం ఖాయం… అయితే..? ముందుగా కేసీయార్‌కు ఐదారు ప్రశ్నలు వేసి, మిగతా అంశాలు చెప్పుకుందాం… 1) కొత్త ట్రిబ్యునల్ కోసం వేసిన కేసు విత్‌డ్రా చేసుకోవడానికి ఎందుకు అంగీకరించినట్టు..? కేంద్రం హామీ ఏమైనా లిఖితపూర్వకంగా, మినట్స్ రూపంలో వచ్చిందా..? 2) పోతిరెడ్డిపాడు పొక్క వెడల్పీకరణ, రాయలసీమ లిఫ్టుల మీద ఇన్నేళ్ల మౌనం వెనుక మర్మం ఏమిటి..? 3) రాష్ట్ర విభజన తరువాత ఈ ఏడేళ్లలో కొత్త ట్రిబ్యునల్, తెలంగాణ వాటాల పునఃకేటాయింపు మీద జరిగిన కృషి ఏమిటి..? 4) కృష్ణా జలాల సమర్థ వాడకానికి వీలున్న దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల మీద ఈ ఏడేళ్ల నిర్లక్ష్యం మాటేమిటి..? 5) జలాల పునఃకేటాయింపుకి మహారాష్ట్ర, కర్నాటక అంగీకరిస్తాయా..? 6) అసలు ఈ దృఢవైఖరి ఇలాగే కొనసాగుతుందా..?
ఇక ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన కొత్త ధోరణుల గురించి చెప్పుకోవాలి…
Ads
- ఇన్నాళ్లూ 66ః34 నిష్పత్తిలో ఈ జలాల్ని వాడుకుంటున్నాయి ఏపీ, తెలంగాణ… మా గోస, మా మొర ఎవరూ వినడం లేదు, పైగా నీళ్లను అక్రమంగా తీసుకుపోతానంటున్నారు… ఇకపై ఏపీ, తెలంగాణల ఉమ్మడి వాటా 811 టీఎంసీల నికరజలాల్లో మేం సగం వాడేసుకుంటాం… ఇదీ ప్రకటన… ఇక ట్రిబ్యునల్ వేస్తారా, కోర్టుకు లాగుతారా, కేంద్రం వద్దకు పిలుస్తారా, ఏం చేస్తారో చూస్తాం అనే తెగింపు నిర్ణయం… ఓ సవాల్…
- జలాల స్థూల కేటాయింపుల్ని ఏపీ తనకిష్టం వచ్చినచోట వాడుకోవడానికి వీల్లేదు… పక్కాగా కేటాయింపులున్న ప్రాజెక్టులకే వాడుకోవాలి… ఏ పోలవరం నుంచో, పట్టిసీమ లిఫ్టు నుంచో గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు వాడేసుకుని, దాని కేటాయింపులను ఇతర కృష్ణా ప్రాజెక్టులకు వాడతాం అంటే తెలంగాణ అంగీకరించదన్నమాట… సీమజలాలకు మెలిక…
- బోర్డు త్రిసభ్య సమావేశం కాదు, పూర్తి స్థాయి భేటీ పెట్టాలి, మా వాదనల్ని ఎజెండాలో పెట్టండి… అసలు విద్యుదుత్పత్తి ఆపాలని ఆదేశించే హక్కు బోర్డుకు ఎక్కడిది..? ఇదీ ధిక్కరణే… బోర్డు ఏం చేయగలదో చూస్తాంలే అనే ధోరణి… కేంద్రానికి ఓ చిక్కుప్రశ్న.,.
- నీళ్లున్నంతవరకూ జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల దగ్గర పవర్ జనరేట్ చేస్తూనే ఉంటాం… మా వాటాకొచ్చే నీళ్లతో, మా హక్కుగా ఉన్న కరెంటునే ఉత్పత్తి చేసుకుంటున్నాం… ఇదీ గట్టి సవాల్ విసరడమే…
- కరెంటు ఉత్పత్తి తరువాత వృథాగా సముద్రంలోకి జలాలు వెళ్లకుండా… ప్రకాశం బ్యారేజీ దిగువన వాడుకో, పట్టిసీమ లిఫ్టు ఖర్చు తగ్గించుకో అనేది అనవసర సలహా… అది వెక్కిరింపు తరహాలో ఉంది, బేసబబుగానూ ఉంది…
- పోతిరెడ్డిపాడుకు, సీమ లిఫ్టుకు, విద్యుదుత్పత్తి ఆపమనడానికి ఏపీ ప్రభుత్వం తాగునీటికే ప్రథమప్రాధాన్యం అనే రూల్ ముందుపెడుతోంది కదా… అవును మరి, మాకూ హైదరాబాద్, మిషన్ భగీరథ అవసరాలున్నయ్, వాటికీ కరెంటు అవసరముంది, అందుకే ఈ ఉత్పత్తి అని తెలంగాణ దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది… కానీ ఇది ఏపీ వాదనలాగే పెద్ద పదునుగా లేదు…
- 51 శాతం క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసుకోవాలని కేంద్రం కొత్తగా చెబుతోంది కదా, సో, అందుకే ఈ జలవిద్యుత్తు ఉత్పత్తి అనేది మరో వాదన… మరో మెలిక… (ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు పెరిగాక, సరిపడా నీళ్లొచ్చాక ఎంతైనా జనరేట్ చేసుకో, అంతేతప్ప మొత్తానికే ఉత్పత్తి చేయొద్దు అని మేం అనడం లేదు కదా అంటోంది ఏపీ… పైగా క్లీన్ ఎనర్జీ అంటే కేవలం హైడల్ మాత్రమే కాదు…)
- శ్రీశైలం కట్టించే విద్యుత్తు కోసం… ఉత్పత్తి వద్దంటే ఎలా అనే ప్రశ్నతోపాటు…. తెలంగాణ సాగునీటి అవసరాల కోసం నీటిని లిఫ్టు చేయాల్సిందే, అంటే కరెంటు కావాల్సిందే… సో, మాకు పవర్ జనరేషనే ప్రయారిటీ అని తేల్చిచెబుతోంది తెలంగాణ… ఇదీ ఒక కోణంలో హేతుబద్దమే… అయితే కరెంటు ఉత్పత్తి ఎప్పుడు చేయాలి అనేది కదా ఇప్పుడు పంచాయితీని రేపుతున్న ప్రశ్న…
- అసలు రివర్ బేసిన్ అవసరాలు తీరాక కదా, సర్‌ప్లస్ వాటర్ ఉంటే కదా, ఇతర బేసిన్ల అవసరాలకు నీటి మళ్లించాల్సింది అని కేసీయార్ మరో ట్విస్టు ఇచ్చాడు… అంటే కృష్ణా అవసరాలు తీరితే కదా, పెన్నాకు తీసుకెళ్లేది అనేది మెలిక… కానీ గోదావరి నుంచి కృష్ణాకు మళ్లించుకోవడం లేదా..? జగన్‌తో కలిసి కేసీయార్ ప్లాన్ చేసిన ఓ బృహత్తర లిఫ్టు పథకం కూడా గోదావరి టు పెన్నాయే కదా… మరి అప్పుడు ఈ వైఖరి ఎందుకు లేదు..?
- మా టెరేన్ ప్రతికూలతలు అధిగమించాలంటే మేం నీళ్లు ఎత్తిపోసుకోవాలి, దానికి కరెంటు కావాలి, మా వాటా నీళ్లతో ఆ కరెంటు ఉత్పత్తి చేసుకుంటున్నాం… అంతే… ఇదీ తెలంగాణ వాదన… దీంతో మరో జబర్దస్త్ చిక్కుముడి పడిపోయింది ఇప్పుడు…!!
Share this Article