మరీ వెనక్కి అవసరం లేదు… కాస్త వెనక్కి… ఇప్పుడంటే… పండించిన వడ్లు అమ్ముకోవాలి, దుకాణాల్లో బియ్యం కొనుక్కోవాలి కదా ట్రెండు… కానీ గతం… సన్నవో, దొడ్డువో… వడ్లు వడ్లే… (వడ్లు అంటే ఏమిటని అడిగే తరం ఇది…) వడ్లు అంటే ఇంకా ప్రాసెస్ చేయబడని బియ్యం… సరే, రాళ్లూరప్పా, మట్టీబేడా లేకుండా చూసి, తమ వడ్లను తీసుకుని గిర్నికి తీసుకుపోయేవాళ్లు రైతులు… చిన్న చిన్న గిర్నీలు ప్రతి ఊరిలోనూ ఉండేవి… (గిర్నీ అంటే మినీ రైస్ మిల్…)… బియ్యం, పరం, నూకలు, తవుడు, ఊక విడిపోతయ్… అందులో ఊక వదిలేస్తే తవుడు, పరం తమ పశువుల దాణా కోసమే విడిగా మూటగట్టుకుంటాడు రైతు… బియ్యం సరేసరి… మరి నూకలు..? (బ్రోకెన్ రైస్… విరిగిన బియ్యం… ఇంత వివరంగా చెప్పడం దేనికీ అంటే… ప్రజెంట్ అర్బన్ జనరేషన్ కోసం… నూకలు అంటే తెలియనివాళ్లు లక్షల్లో ఉన్నారు కాబట్టి…) నూకల్ని ఏం చేసేవాళ్లు..?
నూకలతో కిచిడీ, ఉప్మా చేసుకోవచ్చు… పిండిగిర్నిలో పోస్తే పిండికి ఎక్కువగా, నూకలకు తక్కువగా రవ్వ వచ్చేది… ఎప్పుడంటే అప్పుడు దాంతోనే ఉప్మా… ఇంటికి చుట్టాలు ఎవరొచ్చినా ఇన్‌స్టంట్‌గా చేసి పెట్టే వంటకం అదే… ఇంకాస్త పిండి పెట్టించేవాళ్లు… అది రొట్టెలకు…! ఒట్టి రొట్టెలు లేదా వరి రొట్టెలు… దానికి అంచు ఉల్లిగడ్డమిరం… అదే సూపర్ కాంబినేషన్ ఈరోజుకూ… (ఉల్లిగడ్డమిరం లేదా ఉల్లికారం రెసిపీ ఇక్కడ చెప్పుకోలేం…) ఇక మిగతా నూకల్ని అత్తెసరు చేసుకునేవాళ్లు… అత్తెసరు అంటే గంజివార్చకుండా కాస్త మెత్తగా వండుకునేది… మరిప్పుడు కుక్కర్లలో అలాగే వండుకుంటున్నాం కదా అంటారా..? అవున్లెండి… మనం నూకల అత్తెసరు గురించి చెప్పుకుందాం…
Ads
కొత్త బియ్యం కొన్ని రోజులపాటు మెత్తగా అయిపోతుంది, ముద్దముద్దగా ఉంటుంది… మరిక సైజు తక్కువ కొత్త నూకలు వండితే ఇంకెలా ఉంటుంది..? ఎస్, జుర్రుకునే చోష్యంకన్నా కాస్త చిక్కగా, నాకే లేహ్యంకన్నా కాస్త పతలా, అంటే పలుచగా అవుతుంది… ముందే చెప్పినట్టు గంజి వార్చడం అంటూ ఉండదు… అసలు అత్తెసరులో గంజి మీకు కనిపిస్తే కదా వార్చడానికి..? అది వేడివేడిగా ఉన్నప్పుడే… కాస్త నెయ్యి, వెల్లుల్లి కారం… వేరుశెనగనూనె, మామిడికాయ సోగి… చివరకు కలేమాకు (కరివేపాకు) పొడి కూడా బాగానే ఉంటుంది… అదీ నూకల అత్తెసరు స్పెషాలిటీ… ఛీ, నూకలతో అన్నం ఏమిటీ అని దీర్ఘాలు తీయకండి… అదేదో నాగార్జున సినిమాలో చెప్పినట్టు… తాగి చూస్తే కదా కాఫీ నచ్చుతుందో లేదో తెలిసేది అని…! కొత్త నూకల అత్తెసరు, దానికి తగ్గ కాంబినేషన్ దొరికితే వదిలిపెట్టరు ఇక… అసలు దీనికి కరెక్టు మ్యాచ్ పచ్చిపులుసు… లేదా చింతకాయ పులుసు… తొక్కు కూడా… కాకపోతే పచ్చిపులుసు కాస్త ఘాటుగా చేసుకోవాలి… దీన్ని ఒక్కొక్కరు ఒక్కోరకంగా చేసుకుంటారు… కాస్త ఎక్కువ ఉల్లిగడ్డ ముక్కలు, ఎక్కువ మిరపకాయముక్కలు… కొత్తిమీర, కరివేపాకు… ఇక అంచుకు కారంగా కరకరమనే సల్లమిరపకాయ కూడా ఉందంటే… నమిలేది ఏమీ ఉండదు ఇక… గొంతులోకి జరజరా… బిరబిరా జారిపోవడమే…!! యూట్యూబుల్లో కనిపించే వింత అత్తెసర్లు, పులగం, కిచిడీ తదితర జాబితాల్లోకి దీన్ని చేర్చకండమ్మా… ఇది పూర్తిగా డిఫరెంటు..!!
Share this Article