.
నిన్న ఓ వార్త… ‘‘మద్యం దుకాణాలపై పార్థిబన్ సంచలన సూచన! తమిళనాడులో పాఠశాలలు, దేవాలయాల సమీపంలోని టాస్మాక్ దుకాణాల మూసివేత తర్వాత కొత్త చర్చ మొదలైంది. సీఎం విజయ్‌ను కలిసిన సీనియర్ నటుడు, దర్శకుడు పార్థిబన్ మద్యం షాపులను గ్రామాల వెలుపల ఉన్న శ్మశానాలు, విద్యుత్ దహనవాటికలు, సమాధుల సమీపానికి తరలించాలని సూచించారు…
“సిగరెట్ ప్యాకెట్లపై హెచ్చరికలు ఉన్నట్లే, శ్మశానాల దగ్గర మద్యం దుకాణాలు ఉంటే జీవితం చివరి గమ్యం గుర్తుకు వచ్చి మద్యం సేవనం తగ్గించే అవకాశం ఉంటుంది” అని పార్థిబన్ అభిప్రాయపడ్డారు. అలాగే గ్రామాల్లో గొడవలు తగ్గుతాయని, మహిళలు, ప్రజలకు కలిగే అసౌకర్యం కూడా తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.
Ads
ఈ విషయంపై సీఎం విజయ్ కూడా నవ్వుతూ స్పందించినట్లు పార్థిబన్ తెలిపారు. ఇప్పుడు ఈ సూచన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మద్యం నియంత్రణకు ఇది సరైన పరిష్కారమా? లేక అమలు చేయడం కష్టమా?’’ ఇదీ ఆ వార్త…
.
రియాలిటీ ఏమిటంటే… శ్మశానాల దగ్గర వైన్స్ ఉంటే అక్కడే తాగాలని ఏముంది..? తీసుకుపోయి ఇంకెక్కడో తాగుతారు, పోనీ, శ్మశానంలోనే ఓ పక్కన ‘పర్మిట్ రూం’ పెడితే (తమిళనాడులో పర్మిట్ రూం సిస్టం ఉందో లేదో తెలియదు) మందుబాబులు అక్కడే ఓ సమాధి చుట్టూ కూర్చుని, సమాధినే బార్ టేబుల్ చేసుకోగలరు… చివరకు ఆత్మలన్నీ ఘోషించే సిట్యుయేషన్ వస్తుంది… సో, అది కాదు, అసలు నిన్నామొన్నటి వార్త ఏమిటంటే..?
రాజకీయాలు… సీఎం జోసెఫ్ విజయ్ నెత్తిమీద డీఎంకే ఎప్పుడూ కత్తి వేలాడుతూ ఉంటుంది, తన డీఎంకే కూటమి సభ్యులే విజయ్ ప్రభుత్వ మనుగడకు ఆధారం… కానీ విజయ్ భయపడలేదు, ఆ స్టాలిన్‌కే ఝలక్ ఇచ్చాడు… అదేమంటే… టాస్మాక్ (తమిళనాడులో మందు అమ్మే ప్రభుత్వ సంస్థ) అమ్మకాల్లో విస్కీ కార్టన్‌కు 90, బీర్ కార్టన్‌కు 60, వైన్ కార్టన్‌కు 20 రూపాయలు… ఇలా అన్నింటికీ రేట్లు…
ఈ వసూళ్లన్నీ అనధికారికం, పార్టీ ఫండ్ పేరిట జరిగిపోయేవి, 4000 పైచిలుకు షాపుల ద్వారా నెలకు 100 కోట్ల రాబడి… మొన్నటిదాకా డీఎంకే కేడర్ ఎంజాయ్ చేసింది… దీనికి విజయ్ గండికొట్టే నిర్ణయం తీసుకున్నాడు… ఎక్కడెక్కడ (వేర్ హౌజ్, ట్రాన్స్‌పోర్ట్, ఔట్‌లెట్లు) వసూళ్లు సాగుతున్నాయో అన్నింటి మీద కేసులు పెట్టమన్నాడు… బళ్లు, గుళ్లు, ప్రార్థన స్థలాల వద్ద ఉన్న 717 లిక్కర్ షాపులను మూసేయించాడు కూడా… స్టాలిన్‌కు ఎక్కడో కాలింది…
ఆరు నెలల దాకా విజయ్ సర్కారు జోలికి వెళ్లము అన్నాడు కదా మొదట… ఇప్పుడిక 3 నెలలకన్నా ఈ ప్రభుత్వం ఉండేట్లు లేదు అంటున్నాడు, అంటే బెదిరిస్తున్నాడు… పోతేపోనీ అనుకోలేదు విజయ్… డీఎంకే మద్దతు కట్ అయిపోతే… వెంటనే పళనిస్వామి అండ్ బ్యాచ్ బేషరతుగా మద్దతు ప్రకటించే సీన్… పళనిస్వామి వద్దన్నా ఈసారి తన పార్టీలోని సగం మంది చీలిపోయి మరీ ‘జై విజయ్’ అని జై కొట్టేట్టున్నారు… అసలు కిక్కు రాజకీయాల్లోనే కనిపిస్తుంది కదా..!!
Share this Article