దిశ డిజిటల్ పత్రికలో కనిపించిన ఓ వార్త కాస్త ఇంట్రస్టింగు అనిపించింది, కాస్త నవ్వు కూడా వచ్చింది… ఆ కథనంలో లోటుపాట్ల గురించో, నిజానిజాల గురించో కాదు మనం ఇక్కడ చెప్పుకునేది… చదివాక మనకు వెంటనే ఏమేం లెక్కలు మదిలో మెదులుతాయి అనేది పాయింట్… షర్మిల ఇప్పుడంతా తమిళ సహాయకారులు కదా… తన వ్యూహకర్త ప్రియ, మాజీ పీకే టీం మెంబర్, ఎవరో డీఎంకే తమిళ ఎమ్మెల్యే బిడ్డ… ఇప్పుడు ఓ సర్వే చేయించిందట… ఎన్‌పీసీ సంస్థ ద్వారా… అదీ తమిళనాడు బేస్డ్ సంస్థే… నేషనల్ పొలిటికల్ కన్సల్టెన్సీ… కాస్త తెలంగాణతనం తెలిసిన వాళ్లయితే బెటర్ కదా, తెలంగాణ మూడ్ సరిగ్గా తెలుస్తుంది కదా, తదుపరి కార్యాచరణకు ఉపయుక్తం కదా అని మనం సలహాలు ఇవ్వకూడదు… లోటస్ పాండ్‌లో సలహాలు ఎప్పుడూ స్వీకరించబడవు… 3 నెలలుగా షర్మిల చేయించిన సర్వే ప్రకారం 72 స్థానాల్లో మాజీ సీఎం వైఎస్ మీద ఇప్పటికీ జనంలో ప్రేమ, అభిమానం చెక్కుచెదరలేదని, పార్టీకి అనుకూలమని తేలిందట… అదీ వార్త సారాంశం… సరే, మనం వేరే లెక్కల్లోకి వెళ్దాం సరదాగా…
తెలంగాణలో ఆమె పార్టీ స్థాపించడానికి, అకస్మాత్తుగా ఆమెకు తెలంగాణ మీద ప్రేమ కుదరడానికి, హఠాత్తుగా తెలంగాణ ఆపద్బాంధవి కావడానికి… కొన్ని వేరే లెక్కలున్నయ్… అవి జగన్‌కూ తెలుసు… కేసీయార్‌కూ తెలుసు… కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే ఆమె కాన్సంట్రేట్ చేయబోతోంది… పైగా ఆమె రాజన్నరాజ్యం పేరిట వేస్తున్న రాజకీయ అడుగుల పరమార్థం, మర్మం ఏమిటనే చర్చ ఇక్కడ వదిలేద్దాం కాసేపు…. అయితే… సర్వే అంశాల్లోని రెండుమూడు ప్రశ్నలు కాస్త నవ్వొచ్చేలా ఉన్నయ్… ఆలూలేదు, చూలూలేదు అన్నట్టుగా… ఆమె వెంట అసలు పేరున్న ఒక్క లీడరూ లేడు ప్రస్తుతానికి… ఆమెకు తెలంగాణవ్యాప్తంగా యాక్సెప్టెన్సీ శాతం ఎంత, వైఎస్ సంక్షేమపథకాలపై అభిప్రాయాల వరకూ సదరు సర్వే పలు ప్రశ్నలు వేసింది, వోకే, అవి అడగాల్సిందే… కానీ టీఆర్ఎస్‌కు దీటుగా ఎవర్ని రంగంలోకి దింపాలి అనే దాకా ఆ సర్వే వెళ్లిపోయింది… అదీ నవ్వొచ్చేది… అన్నప్రాసనే కాలేదు, అప్పుడే ఆవకాయ దాకా వెళ్లిపోయింది ఆ సంస్థ… చాలా గొప్పోళ్లురా బాబూ మీరు…
Ads
నియోజకవర్గాల్లో బలమైన నేతలెవరు అని కూడా సర్వేయించారట… (చనిపోయి ఇన్నేళ్లు గడుస్తున్నా సరే, వైఎస్ మీద ఇప్పటికీ తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో, ప్రత్యేకించి పల్లెప్రాంతాల్లో ఆదరణ ఉంది… ఫీల్డులో చురుకుగా పనిచేసే జర్నలిస్టులకు, నాయకులకు, ప్రభుత్వ సిబ్బందికి కూడా తెలుసు ఈ సంగతి…) 72 ఆమెకు అనుకూలం… ఏడో ఎనిమిదో మజ్లిస్ కోటలు… సరే, 8 కలుపుదాం… 80 సీట్లు పాయె… ఇక మిగిలినవి 39… ఈ సీట్లలో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎవరికి ఎన్నో మరి…? దారితప్పి లెఫ్ట్‌కు ఏమైనా వస్తే..? పైగా ఆ టైంకు జనసేన టైగర్ గాండ్రిస్తూ బరిలోకి జంపుతుంది… అది కూడా తెలంగాణ మీద బీభత్సమైన విపరీతమైన తీవ్ర ప్రేమ కలిగిన పార్టీయే కదా… తెలంగాణకు తిండితినడం, నిద్రలేవడం, భాషాకల్చర్ నేర్పిన తెలుగుదేశం ఉండనే ఉంటుంది… సో, దేవుడా… కేసీయార్ పార్టీ అధికారంలో లేకుండా ఇక బంగారు తెలంగాణ ఎలా సాధ్యం తండ్రీ… మరో అయిదారు టరమ్స్ ఆ పార్టీ పాలిస్తే తప్ప బంగారు తెలంగాణ దిశలో బలంగా నాలుగు అడుగులు పడేట్టు లేవు…!!
Share this Article