నో, నో, నేను టీఎంసీలో చేరడమా..? నెవ్వర్, ఈ ప్రచారం అబద్ధం అని బల్లగుద్ది తీవ్రంగా ఖండించాడు… ఒక నాయకుడు పదే పదే అలా చెబుతున్నాడూ అంటే… అది జంపుతున్న కేసే అని అర్థం చేసుకోవాలి మనం… అనుకున్నట్టుగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొడుకు అభిజిత్ ముఖర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు… సరే, అలా పార్టీ జంపడానికి ఆయన లెక్కలు ఆయనకు ఉండి ఉండవచ్చగానీ… కానీ పార్టీలో చేరుతున్న ఫోటో చూస్తే మాత్రం జాలి, సానుభూతి కలుగుతాయి ఎందుకో గానీ…!! ఈటల అంతమందిని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకుపోయి.., బీజేపీ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో గానీ, అమిత్ షా చేతుల మీదుగా గానీ పార్టీ కండువా కప్పుకోకుండా… ఆయనెవరో ఓ మంత్రి చేతుల మీదుగా పార్టీ తీర్థం తీసుకున్న తీరు గుర్తొచ్చింది… ఫాఫం, అభిజిత్ ముఖర్జీ సాదాసీదా కార్యకర్త ఏమీ కాదు కదా… ఓ స్టేచర్ అయితే ఉందిగా…
మమత బెనర్జీ సమక్షంలో చేరినా కాస్త బాగుండేది… టీఎంసీ నాయకులు పార్థా ఛటర్జీ, సుదీప్ బంధోపాధ్యాయలు కండువా కప్పి ఆహ్వానించారు… సరే, పార్థా ఛటర్జీ గతంలో ప్రతిపక్ష నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి.., సుదీప్ కేవలం ఎంపీ… కానీ జీవితాంతం కాంగ్రెస్ పార్టీలోనే కమిటెడ్‌గా ఉండిపోయిన ఆ ప్రణబ్ ముఖర్జీ కొడుకు ఆ పార్టీని వీడి, మమత పార్టీలో చేరడం కాంగ్రెస్‌వాదులకు చివుక్కుమనిపించే అంశమే… ప్రణబ్ బిడ్డ ఈరోజుకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉంది, బ్యాక్ ఆఫీస్ వర్క్ చూస్తుంటుంది… సోదరుడు కాంగ్రెస్ వీడి, టీఎంసీలో చేరడం మీద నిర్లిప్తంగా ‘‘విచారకరం’’ అని స్పందించింది… (ప్రణబ్ మరో కొడుకు పేరు కూడా ఎవరికీ పెద్దగా తెలియదు..).. 61 ఏళ్ల వయస్సులో కుటుంబగౌరవాన్ని చెడగొడుతున్నాడు అనే విమర్శలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి… అయితే అసలు అభిజిత్ లెక్కలు ఏమిటి..?
Ads
BHEL, SAIL, Maruti సంస్థలకు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించాక మొదట ఒక టరమ్ ఎమ్మెల్యేగా చేశాడు, తండ్రి మరణం తరువాత ఖాళీ అయిన జంగీపూర్ ఎంపీ సీటు నుంచి ఉపఎన్నికలో 2012లో నిలబడి గెలిచాడు, తరువాత 2014 ఎన్నికల్లో కూడా గెలిచాడు… కానీ 2019లో ఓడిపోయాడు… ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్, కాంగ్రెస్ మొత్తం తుడిచిపెట్టుకుపోయిన సంగతి తెలుసు కదా… తనకేమో అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఉంది… రాజకీయవాది కదా ఆశ సహజం… జంగీపూర్ అసెంబ్లీ సీటు ఖాళీగానే ఉంది ఏదో కారణం వల్ల… ఈమధ్య కొంతకాలంగా మమతను పొగుడుతూ, కాకా పడుతూ ట్వీట్లు కొడుతున్నాడు… ఇక్కడ పోటీచేయాలని ఆహ్వానిస్తున్నాడు… నిజానికి అక్కడి నుంచి తనే పోటీచేయాలని ఆశిస్తున్నాడు… కాంగ్రెస్, లెఫ్ట్‌ను నమ్మితే వేస్టు, బీజేపీ హవా బాగా తగ్గిపోయింది… అందుకని మంచి రూట్ చూసుకుని మమత పార్టీలోకి ఇలా జంపైపోయాడు… అబ్బబ్బే, ప్రస్తుతం నేను ఏ పొజిషన్‌లోనూ లేను, నాకు టీఎంసీ ఏ పదవీ హామీ ఇవ్వలేదు, నేనే ఓ సాధారణ కార్యకర్తలా చేరాను అని కబుర్లు చెబుతున్నాడు బయటికి… కానీ అసలు కథ అదీ… బహుశా వచ్చే ఉపఎన్నికలో టీఎంసీ అభ్యర్థి తనే అవుతాడేమో అక్కడ…!! లెక్కయితే బాగానే ఉంది… అంతేలెండి, పాలిటిక్సుల్లో ఇప్పుడు ఇలాంటి లెక్కలే చెలామణీ అవుతున్నయ్…!!
Share this Article