.
యోగి ఆదిత్యనాథ్: కఠినమైన ‘బుల్డోజర్’ వెనుక ఉన్న ఒక సహృదయపు సన్యాసి …ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో యోగి ఆదిత్యనాథ్ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది.. కఠినమైన చట్టాలు, వేగవంతమైన అరెస్టులు, వేలాది ఎన్‌కౌంటర్లు, నేరగాళ్లపై ఉక్కుపాదం మోపే ‘బుల్డోజర్’ ఇమేజ్.
బయటి ప్రపంచానికి ఆయన ఒక కఠినాత్ముడిగా కనిపించినా, ఆయన వ్యక్తిత్వంలో చాలామందికి తెలియని ఒక కోణం ఉంది. అది ఒక నిష్కల్మషమైన సన్యాసి జీవనం, రాజకీయాలకు అతీతమైన మానవీయ విలువలు. నిన్నటి ఓ వార్త నిజంగా ప్రముఖంగా చెప్పుకోవాల్సిన విశేషమే…
Ads
- ప్రత్యేకించి ఇళ్లల్లో ఆడవాళ్లను, రాజకీయాలతో సంబంధం లేని మహిళల్ని కూడా బజారుకులాగి, దూషించి, చిల్లర వెగటు రోత ట్రోలింగులు, ప్రచారాలతో కుళ్లి కంపుకొడుతున్న తెలుగు క్షుద్ర రాజకీయాలతో ఓసారి పోల్చిచూడాల్సిన వార్త ఇది…
విషయం ఏమిటంటే..? సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు ముగ్గురు పిల్లలు, పెద్దమ్మాయి పేరు అదితి యాదవ్… లండన్‌లో చదువుతోంది… ఆమె ఓ సౌత్ ఆఫ్రికన్ ప్రేమలో పడిందట… తప్పేముంది..? కానీ అసలే ప్రస్తుతం క్షుద్ర సోషల్ మీడియా కాలం కదా… మార్ఫింగ్ ఫోటోలు, అనేక రోత రాతలతో రెండుమూడు రోజులుగా ట్రోలింగ్ సాగుతోంది…
ఇది తన దృష్టికి రాగానే యోగి ఓ అఖిలేష్‌ను ఓ రాజకీయ ప్రత్యర్థి కోణంలో చూడలేదు, ఓ ఆడపిల్ల తండ్రిలా మాత్రమే చూశాడు… ఆ ట్రోలర్ల పనిపట్టాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించాడు… కేసులు పెట్టి లోపలకు నెట్టండన్నాడు… వెంటనే ఓ ముగ్గురిని బుక్ చేసిన పోలీసులు, మిగతావాళ్ల కోసం వెతుకుతున్నారు… ఎస్, సోషల్ మీడియా అక్రమార్కులకు యోగి మార్క్ శిక్షలే అవసరం ఈరోజుల్లో…

రాజకీయాలు వేరు.. గౌరవం వేరు! ప్రస్తుత రాజకీయాల్లో ప్రత్యర్థులను దెబ్బతీయడానికి వ్యక్తిగత దూషణలు, కుటుంబాలను బదనాం చేయడం ఒక ఆచారంగా మారిపోయింది. కానీ, తన రాజకీయ ప్రత్యర్థి అఖిలేష్ యాదవ్ కుమార్తెపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్యకర ప్రచారాన్ని చూసినప్పుడు, యోగి ఆదిత్యనాథ్ స్పందించిన తీరు ఆయనలోని అసలైన ‘నిజ సన్యాసి’ మనస్తత్వాన్ని బయటపెట్టింది.
ఆయన కేవలం ముఖ్యమంత్రిగా కాకుండా, ఒక తండ్రిగా, ఒక సోదరుడిగా బాధ్యత తీసుకున్నాడు. “రాజకీయ విమర్శలు ఎవరికైనా ఉండవచ్చు, కానీ ఆడబిడ్డల గౌరవాన్ని పణంగా పెట్టి వ్యక్తిత్వ హననం చేయడం అమానుషం” అని ఆయన అన్నప్పుడు, అందులో ఒక నాయకుడి గళం కంటే, విలువలను కాపాడాలనుకునే ఒక సంస్కారవంతుడి ఆవేదన కనిపించింది. అందుకే నార్తరన్ మీడియా ఈ వార్తకు మంచి ప్రాధాన్యం ఇచ్చింది…
“ఆమె నా బిడ్డ కూడా…“ ఆజంగఢ్ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేశాయి. “మన సంస్కృతిలో ఒక గ్రామంలోని ఆడపిల్ల ఆ ఊరి మొత్తానికి కూతురు వంటిది. రాజకీయాల్లో ఇన్ని ఏళ్లు ఉన్నా, మహిళల గౌరవం విషయంలో ఎప్పుడూ వివక్ష చూపలేదు” అని యోగి భావోద్వేగంగా చెప్పిన మాటలు, ఆయనలోని సున్నితమైన కోణాన్ని ఆవిష్కరించాయి. అఖిలేష్ యాదవ్ కూతురు అయినా, సామాన్యుడి కూతురు అయినా.. యోగి దృష్టిలో ఆమె ఒక ‘ఆడబిడ్డ’ మాత్రమే. ఈ సన్యాసికి సొంత కుటుంబం లేదు, రాష్ట్రమే కుటుంబం, ప్రతి మహిళా తన బిడ్డే అనే ధోరణి మెచ్చదగిందే.

కఠినత్వం వెనుక కరుణ… నిజానికి, యోగి ఆదిత్యనాథ్ పరిపాలనా శైలికి , ఆయన వ్యక్తిగత సన్యాస జీవనానికి ఒక విడదీయలేని సంబంధం ఉంది. గోరఖ్‌నాథ్ మఠాధిపతిగా, ఒక యోగిగా ఆయన చిన్నప్పటి నుంచి క్రమశిక్షణను, సమాజ శ్రేయస్సును నేర్చుకున్నాడు. తప్పు చేసిన వారిపై కఠినంగా ఉండటం ‘ధర్మం’ అయితే, అబలలను, పిల్లలను రక్షించడం ‘సంస్కారం’…
అఖిలేష్ యాదవ్‌కు ఆయన చేసిన హెచ్చరికలో కూడా ఒక తండ్రి తపన ఉంది… “మీ కార్యకర్తలు కూడా ద్వేషవ్యాప్తిలో ఉన్నారు… మీ వాళ్లకు ముందుగా సంస్కారం నేర్పించండి” అని చెప్పడం ద్వారా, రాజకీయాల్లో విలువలు పడిపోతున్న తరుణంలో, తాను కాపాడుకోవాలనుకుంటున్న నైతిక విలువలను ఆయన గుర్తుచేశాడు…
ఒక నాయకుడు ఎంతటి కఠిన నిర్ణయాలు తీసుకున్నా, అతని గుండెల్లో మానవీయత ఉంటేనే అతను ప్రజా నాయకుడిగా నిలబడతాడు. కత్తులతో విమర్శలు చేసే రాజకీయ ప్రపంచంలో, కరుణతో అండగా నిలిచే యోగి నిజంగానే ఒక ప్రత్యేకమైన నాయకుడు… (యోగి ప్రతి నవరాత్రుల్లో తప్పకుండా కన్యపూజ నిర్వహిస్తాడు...)
Share this Article