……….. By……… Abdul Rajahussain…………… *సకల కళా వల్లభుడు… హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణ దాస్..!! *అబ్బురానికే అబ్బురం కలిగించే వ్యక్తిత్వం… ఆయన సొంతం…!! ఆదిభట్ల నారాయణ దాసు (1864..1945 ) గారి గురించి ఈతరం వారికి తెలీక పోవచ్చుగానీ, ఆయన తరం వారికి మాత్రం చిరపరిచితుడాయన. సంగీతం, సాహిత్యం ఆయనకు రెండు కళ్ళు. రెంటినీ సమంగా సమాదరించిన మహానుభావుడాయన. నాణానికి రెండు వైపులున్నట్లే ఆయన వ్యక్తిత్వంలో కూడా వైవిధ్యం వుంది. ఓ వైపున సకలకళా పారంగతుడు. పుంభావ సరస్వతి. మరోవైపున మదన కామరాజు, విలాసాల్లో పైలా పచ్చీసు… మాంసం తినడం అబద్ధాలాడటం మినహా మిగిలినవన్నీ ఆదిభట్లవారి ఖాతాలో వున్నాయి. పాతికేళ్ళ పైలా పచ్చీసు వయసులో విశృంఖలంగా తిరిగిన షోకిల్లా రాయుడాయన. లోకం ఏమనుకుంటే నాకేం? అనుకునే మనస్తత్వం ఆయనది. అందుకే ఆయన లోకాన్నెప్పుడూ లక్ష్యపెట్టలేదు. తను ఎలా వుండాలనుకున్నాడో అలానే వున్నారు. తన ఇష్టం వచ్చిన వేషం వేసేవాడు. ఆయన కలహప్రియుడు. నోటికేదొస్తే అది మాట్లాడే వాడు.. కారణం వున్నా లేకున్నా ఇతరులతో కలహించేవాడు. అలాగే ఏ కారణం లేకున్నా అమితంగా ప్రేమించేవాడు. ముందు చూపున్న మహాముదురుగా పేరుపడ్డాడు. బరంపురం వీథుల్లో ఆయన ఎలా తిరిగేవాడో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం…
“అప్పటణమునం బడుచులం గని బోరవిరిచి బోరచూపులు చూచుచు, నూత్న యౌవన మదంబున నెట్టివారనైనను నలక్ష్యముగా గనుచు, గడియ గడియ కద్దము చూచుకొని గేరా దిద్దుకొనుచు, సిగకు పూలుముడుపు , కనులకు గాటుక, మెడలో పూలదండ, మొలకు పట్టుధోవతి, కాళ్ళకు గజ్జెలు, చేతు జరుతాళములు ధరించి, గావు కేకలు వేయుచు, నందరిని హాస్యములసేసి వెక్కిరించుచు, పిట్టకథలచే బామరులను సంతోష వెట్టుచు, శివాచారివలె గోలబెట్టి తిరుగుదాసుని రీతి పోతు పేరంటాల పోల్కి, సానిపాప కైవడి శృంగార రసమును, శక్తిహీనుని భంగి మెట్ట వేదాంతమును, ఆపన్నుని గతి భక్తియుం దెలుపుచు, హరికథలు చెప్పుచు, నొక నెల యచట గడిపి పళాసకు పోయి నారము.
నా వయసపుడు పందొమ్మిదేండ్లు… విజయనగరం ఆనంద గజపతి మహారాజుతో స్నేహం రెండేళ్ళు కొనసాగింది. ఈ రెండేళ్ళలో సంగీత, సాహిత్యాల మాట అటుంచి పేకాట, చదరంగం వంటి వినోదాలక్కూడా దాసుగారి ప్రతిభ విస్తరించింది. ఇదీ ఆదిభట్ల వారి అల్లరి చిల్లర జీవితం. సుఖపురుషుడుకు ఉదాహరణ చెప్పాల్సివస్తే టక్కున ఆదిభట్లవారే గుర్తొస్తారు. అయితే చదువులో పుంభావ సరస్వతి. ఓ సారి పుస్తకం పట్టుకున్నాడంటే జెట్ స్పీడుతో గిరగిరా తిప్పుతూ సంస్కృతాంధ్రాల్ని చదవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇక సంగీతపరంగా ఆయన మహావిద్వాంసుడు. కోరినతాళంలో పల్లవి పాడటం ఆయనకు మంచినీళ్ళప్రాయం. ఆయనకు తెలీని రాగాలే లేవంటే అతిశయోక్తిగా అనిపించినా, ఇది నిజం. ఏ రాగంలో పాడమంటే ఆ రాగంలో పాట పాడటం ఆయన ప్రత్యేకత. సంస్కృతంలో, తెలుగులో అశువుగా కవిత్వం చెప్పడం, అష్టావధానం చేయడం, వేలాది మంది సమక్షంలో తెలుగులోను, ఇంగ్లీషులోను పాటలు పాడటం వంటి విద్యలన్నీ ఆయన సొంతం…
Ads
*వేశ్యలతో సావాసం…!!
“ఒక యువతి కాళ్ళు పిసుకుచు నిద్రలేపుట, యొక జవ్వని పలుదోము పుల్వయు, నీరందించుట, యొక వన్నెలాడి తలదువ్వుట, యొక మదిరాక్షి చీనచన గురుని తయారు చేసి వెండి గిన్నెలోన వడబోసి యిచ్చుట, యొక పూబోడి స్నానమాడించుట, యొక లతాంగి బ్రాహ్మణునిచే మృష్టాన్నములు దెప్పించి వడ్డించుట, యొక నీలవేణి భోజనానంతరము చుట్ట యందించుట, యొక మధుర రాశి విడమిచ్చుట, యొక హరిమధ్య శయ్యనమర్చుట, యొక సరోజముఖి చందనమలదుట, యోక హరి మధ్య పూలు ముడుచుట, యొక మదవతి వీవనను పట్టి విసురుట,…. యిట్వహోరాత్రములు విడువక పెక్కు వేశ్యారత్నములు శుశ్రూష జేయుచు, నన్వీధిలోనికి గదలనీయక గానమభ్యసించుచుండిరి “…!!
దాసుగారు కందుకూరి వీరేశలింగం పంతులు గారికి సమకాలికులు. ఇద్దరి మధ్య సుహృద్భావసంబంధాలుండేవి. అయితే వీరేశలింగం గారి విధవా వివాహాలు, బ్రహ్మసమాజం అంటే ఆయనకు ఇష్టం వుండేది కాదు. స్త్రీలపట్ల దాసు గారి ఆలోచన వేరు. వినడానికి వింతగా, చోద్యంగా వుంటుంది. “వెలయాండ్ర సహవాసము సేయుట, కొంచెము గురుని సేవకలవడుట, సంగీత, సాహిత్య రసజ్ఞత కలిగియుంట… ఈ మూడు కలవారే లోకములో దరచూ భూత దయాపరులు పరోపకారులు, వితరణ శీలురునై యుండెదరు. తక్కనవారల హృదయము సరసము కాదని యనుకొనుచుందును “ అన్నది దాసుగారి నిశ్చితాభిప్రాయం…
*సోగ్గాడు………!! దాసు గారు రూపంలో మన్మథుడు. మగవాళ్ళను సైతం మోహింపజేసే రూపం ఆయనది. ఆయన జుత్తు నీలాలు పొదిగిన వుంగరాల్లా వుండేదట. ముంగురుల్ని పాయగాతీసి దిద్దుకునేవారు. వెండ్రుకల్ని నున్నగా దువ్వి పట్టెడు సిగవేసుకునే వారు. సిగలో పూలు తురుముకునేవారు. కళ్ళకు సుర్మా, కాళ్ళకు గజ్జెలు, నుదుట చిన్న అగరు బొట్టుతో…. చూడ చక్కగా వుండే వారు. ఆయనది గంభీరమైన శరీరం. ఆరోజుల్లో అటువంటి దృఢకాయుడు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన చైన్ స్మోకర్. నోట్లో చుట్ట… ఎప్పుడూ చుట్ట పొగల భుగభుగలు వుండాల్సిందే.
*బహుభాషా కోవిదుడు…!!
*హరికథ పితామహుడు…!!
హరికథ ‘ అనగానే ఆదిభట్ల వారు తప్ప మరొకరు గుర్తుకు రారు. అందుకే ఆయన్ను హరికథ పితామహుడిగా పిలుస్తారు. ఆయన ఇంట గెలిచి రచ్చ గెలిచారు. దాసు గారి హరికథ ప్రతిభకు మైసూరు రాజు ముగ్ధుడయ్యాడు. దాసుగారి హరికథలు విని పరవశించిన విజయనగరం దివాను తన చేతికర్రతో దాసు గారి పొట్ట మీద ముద్దుగా పొడిచి “ఇంత విద్య నీ కడుపులో ఎలా వుందంటూ? ఆశ్చర్యపోయాడట. పిఠాపురం మహారాజు. దాసు గారి హరికథకు పరవశించి తాను మోజుపడి కొత్తగా కుట్టించుకున్నఅంగీని ఆయనకు తొడిగారట. కేవలం వినికిడితో తన ఊహను జోడించి శ్రావ్యంగా సంగీతం పాడటం వల్ల దాసు గారి హరికథ మరింతగా రాణించేది. హిందూస్తానీ,.. కర్ణాటకం జోడించి జుగల్ బందీగా పాడటం ఆయనకే చెల్లింది. ముఖ్యంగా పల్లవి పాడటంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన పల్లవి పాడుతుంటే వాయిద్య గాళ్ళు నోళ్ళు వెళ్ళబెట్టుకొని చూస్తూ విస్తుపోయేవారట. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో సంగీత సాహిత్య, నృత్యాల మేళవింపుతో ఆయన హరికథ చెబుతుంటే చూసే కళ్ళు, వినే చెవులు మన ఆధీనంలో వుండేవి కావట. అపూర్వం, అనితర సాధ్యం ఆయన హరికథ పారాయణం. ఆరోజుల్లో హరికథ కోసం గజ్జెకట్టిన వాళ్ళెవరైనా వున్నారంటే.. వారంతా దాసుగారి శిష్యులే…
*అవధానం..!!
హరికథ మాత్రమే కాదు ఆయన అవధాన సరస్వతి కూడా. చాలా సుదీర్ఘ అవధానాలు చేయడంలో ఆయన దిట్ట. ముఫ్ఫై గంటలకు ఒక్కో చరణంగా పృచ్ఛకులు కోరిన ఛందస్సులో కవిత్వం చెప్పేవారు. అంతేకాదు… ముప్ఫై రెండు అక్షరాల వ్యస్తాక్షరీ చేయడం, నోటి లెక్కలకు సమాధానం చెప్పడం, పువ్వులు లెక్క పెట్టడం, గంటలు లెక్క పెట్టడం, అప్రస్తుత ప్రసంగం, నిషేధాక్షరి, కోరిన రాగంలో రాగయుక్తంగా పురాణం చెప్పడం ఆయన అవధాన విద్య ప్రత్యేకత.
*బహుగ్రంథ కర్త…!!
హరికథలు చెప్పడం, అవధానాలు చేయడం, కవిత్వం రాయడమే కాదు. ఆయన ఎన్నో అమూల్యమైన గ్రంథాల్ని రచించారు. ధ్రువచరిత్రం, అంబరీష చరిత్రం, గజేంద్ర మోక్షము, రుక్మిణీ కల్యాణం, జానకీ శపథం, గౌరమ్మ పెండ్లి, హరిశ్చంద్రోపాఖ్యానము, మార్కండేయ చరిత్రము, యదార్థ రామాయణము, భీష్మ చరిత్రము, గోవర్థనోద్ధరణము, శ్రీహరికథామృతమ్, హరికథలు.. ఫలశృతి వంటి గ్రంథాలు ఆయనకు చిరయశః కీర్తిని తెచ్చిపెట్టాయి. కాగా శతక ప్రక్రియలో ఆయన అనేక రచనలు చేశారు .కాశీ శతకమ్, రామచన్ద్ర శతకమ్, ముకుంద శతకమ్, సూర్యనారాయణ శతకమ్, మృత్యుంజయ శివ శతకమ్, సీమ పలుకులో వేల్పువంద శతకమ్ రచించారు. ఇక ప్రహసన రచనలో కూడా దాసు గారిది అందె వేసిన చేయే. ఆయన ”దంభపుర ప్రహసనం“ అలభ్యం. ఇక సారంగధర పేరుతో అయిదంకాల నాటకాన్ని రాశారు.
పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో దాసుగారు స్వీయ రచన చేశారు దాని పేరు “నా యెరుక “ 30 సంవత్సరాల వరకు దాసు గారి జీవితాన్ని ఇందులో చూడొచ్చు. దాచుకునే విషయాలను కూడా దాపరికం లేకుండా చెప్పడం దాసుగారి తోనే మొదలైంది. (ఆ తర్వాత చలం, శ్రీశ్రీ గారు కూడా ఇలాగే దాపరికం లేకుండా ఆత్మకథలు రాసుకున్నారు)భగవద్గీత ప్రేరణతో మంజరీ ద్విపదలో “వేల్పుమాట“ రాశారు. ”అచ్చ తెలుగు పల్కుబడి“ అనే పుస్తకాన్నిరాసి “తేట తీయని యచ్చ తెలుగు రాకున్న.. తెలుగు వారికెద్ది తెలియుట సున్న“ అంటూ ప్రచారం చేశారు. అలాగే తల్లి విన్కి, మొక్కుబడి, నవరస తరంగిణి, ఉమరు కయాము రుబాయెతు, వెన్నుని వేయి పేర్ల వినకరి, నురుగంటి పేర్లతో అనువాద గ్రంథాలు రచించారు. దాసుగారు విజ్ఞానఖని. తన శాస్త్రీయ విజ్ఞానాన్ని తెలుపుతూ.. తర్క సంగ్రహము, వ్యాకరణ సంగ్రహము, చాతుర్వర్గ సాధనమ్, మన్కి మిన్కు, సీమ పల్కువహి, జగజ్జోతి, పురుషార్థ సాథకమ్, దశ విధ రాగ కుసుమ మంజరి వంటి గ్రంథాలు రాశారు.
సమ్మానాలు.. బిరుదులు.!!
దాసుగారికి సమ్మానాలకు, బిరుదులకు కొదవే లేదు. ఆయనకు “లయ బ్రహ్మ“ అనే బిరుదు వుంది. చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి గారు “హరికథా పితామహుడు“ అనే బిరుదుతో సత్కరించారు. ఆయనకు “పంచముఖీ పరమేశ్వరుడు“అనే బిరుదు కూడా వుంది. అలాగే ఆయన్ను “ఆంధ్రదేశం భూషణం” గా పిలుచుకున్నారు. అంతేకాదు, ఆయనకు “ఆటపాటల మేటి“ అనే బిరుదు కూడా వుంది.
“నోబెల్ దరఖాస్తు తృణీకరణ…!!
ఎ.రజాహుస్సేన్..!!
Share this Article