.
ఒక వార్త చదువుతుంటే ప్రధానంగా ఆకట్టుకున్న అంశం ఒకటి… టూ వీలర్స్ అంటే, బైక్స్, స్కూటీలు, స్కూటర్ల విషయంలో ఈవీలు పెరుగుతున్నాయి… అదే సమయంలో హైఎండ్ మోడల్స్ కార్ల ధరలతో సమానంగా ఉంటున్నాయి… మరోవైపు ఈరోజుకూ సగటు మధ్యతరగతి, పేదవర్గాలు, రైతులకు, కూలీలకు, ఇతర చిన్న వృత్తుల వారు తమ అవసరాల కోసం నమ్ముకుంటున్నది, కొంటున్నది ఏమిటో తెలుసా..? మోపెడ్..!
జనంలో కొనుగోలు శక్తి పెరిగింది, సెకండ్ కార్ సేల్స్ పెరిగాయి, అదేసమయంలో టూవీలర్ సేల్స్ కూడా పెరుగుతున్నాయి… ఇప్పటికీ ఈ దేశం రవాణాకు బలంగా నమ్మే వాహనం ద్విచక్రమే…
Ads
తాజాగా మే 2026 దేశీయ వాహనాల అమ్మకాల గణాంకాలు విడుదలయ్యాయి… ఈ నెలలో కూడా ఎప్పటిలాగే హీరో స్ప్లెండర్ (Hero Splendor) అమ్మకాల్లో నంబర్ వన్ స్థానం…. ఈ బైక్ ఏకంగా 3,48,115 యూనిట్ల రికార్డు విక్రయాలను నమోదు చేసింది… గతేడాది మే 2025 లో జరిగిన 3,10,335 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే.. ఈసారి అదనంగా 37,780 బైకులు అమ్ముడయ్యాయి… మొత్తం టూ-వీలర్ మార్కెట్లో ఏకంగా 27.43 శాతం వాటా దీనిది… ఇది అంబాసిడర్ కారు టైపు… మన్నిక, రేటు, మైలేజ్, మెయింటెనెన్స్ విషయాల్లో ఇదే టాప్…
స్కూటర్ల విభాగంలో హోండా యాక్టివా (Honda Activa)ది రెండో స్థానం… యాక్టివా మే 2026లో 2,28,955 యూనిట్ల విక్రయాలను జరిపింది. మే 2025లో నమోదైన 1,90,713 యూనిట్లతో పోలిస్తే ఈసారి 38,242 స్కూటర్లు అదనంగా అమ్ముడయ్యాయి. మార్కెట్లో 18.04 శాతం షేర్… ఈ విభాగంలో ఇదే తోపు… నాణ్యతే దీనికి కారణం…
మూడో స్థానాన్ని 12.25 శాతం మార్కెట్ షేర్‌తో హోండా షైన్ (Honda Shine) దక్కించుకుంది… మే 2026లో షైన్ బైకులు 1,55,441 యూనిట్లు అమ్ముడయ్యాయి… గత ఏడాది అమ్మకాలతో పోలిస్తే ఈ బైకుల అమ్మకాలు స్వల్పంగా తగ్గినా, ఇప్పటికీ మూడో స్థానం దానిదే…
నాలుగో స్థానంలో నిలిచింది టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter)… జూపిటర్ స్కూటర్ మే 2026 లో 1,24,767 యూనిట్ల విక్రయాలతో దుమ్ములేపింది. గతేడాది ఇదే నెలలో జరిగిన 97,606 యూనిట్ల సేల్స్‌తో పోలిస్తే ఈసారి ఏకంగా 27,161 స్కూటర్లు ఎక్కువగా అమ్ముడైంది, మార్కెట్ షేర్ ప్రస్తుతం 9.83 శాతం…
యువత కలల బైక్ బజాజ్ పల్సర్ ఐదో స్థానం… మే 2026లో పల్సర్ సిరీస్ బైకులు 1,24,270 యూనిట్లు విక్రయించబడ్డాయి. గతేడాది మే 2025 లో జరిగిన 1,22,151 యూనిట్ల సేల్స్‌తో పోలిస్తే ఈసారి కేవలం 2,119 బైకులు మాత్రమే అదనంగా అమ్ముడయ్యాయి. ప్రస్తుతం మొత్తం మార్కెట్లో పల్సర్ 9.79 శాతం మార్కెట్ షేర్…
ఆరో స్థానంలో నిలిచిన సుజుకి యాక్సెస్ (Suzuki Access) స్కూటర్ మే 2026లో 75,729 యూనిట్ల స్థిరమైన విక్రయాలను నమోదు చేసింది. దీని మార్కెట్ షేర్ 5.97 శాతం…
ఈ నివేదికలో అందరినీ షాక్‌కు గురిచేసింది ఏడో స్థానంలో ఉన్న హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe). మే 2026లో ఇది కేవలం 66,722 యూనిట్ల అమ్మకాలకు పరిమితమైంది. గతేడాది మే నెలలో ఏకంగా 1,07,768 యూనిట్లు అమ్ముడైన ఈ బైక్.. ఈసారి ఏకంగా 41,046 యూనిట్లను కోల్పోయి 38.09 శాతం ఘోరమైన మైనస్ గ్రోత్‌ను మూటగట్టుకుంది. దీని మార్కెట్ షేర్ 5.26 శాతానికి పడిపోయింది.
స్పోర్ట్స్ బైక్ టీవీఎస్ అపాచే (TVS Apache) మే 2026లో 53,900 యూనిట్ల విక్రయాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. గతేడాది జరిగిన 49,099 యూనిట్ల సేల్స్‌తో పోలిస్తే 4,801 బైకులు ఎక్కువగా అమ్ముడైంది, దీని మార్కెట్ షేర్ 4.25 శాతం…
- ఇక్కడ చెప్పుకోవాల్సింది ఈరోజుకూ గ్రామీణ ప్రాంతాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న మోపెడ్ వాహనం టీవీఎస్ ఎక్స్‌ఎల్ (TVS XL)… ఇది తొమ్మిదో స్థానంలో నిలిచింది…. మే 2026లో ఇది 48,569 యూనిట్లు అమ్ముడైంది. గతేడాది జరిగిన 37,264 యూనిట్ల కంటే ఈసారి 11,305 వాహనాలు ఎక్కువగా విక్రయించబడి, 30.34 శాతం అద్భుతమైన వృద్ధిని సాధించింది… దీని మార్కెట్ షేర్ 3.83 శాతం…
ఈ మొత్తం టాప్-10 జాబితాలో నిలిచిన ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)… ఇది పదో స్థానం… ఐక్యూబ్ ఏకంగా 52.64 శాతం అసాధారణమైన వార్షిక వృద్ధిని సొంతం చేసుకుంది… మొత్తంగా చూస్తే, ఈ టాప్-10 టూ-వీలర్ల విక్రయాలు మే 2026 లో 12,68,886 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది జరిగిన 11,76,627 యూనిట్లతో పోలిస్తే మొత్తం మార్కెట్ 92,259 యూనిట్ల పెంపుతో 7.84 శాతం ఆరోగ్యకరమైన వృద్ధిని సాధించింది…
Share this Article