.
( రమణ కొంటికర్ల ) …. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడా లేకుండా… ఏ వుడ్డైనా ఒక సందేశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. హీరోలైతే వయస్సు పెరిగినా కుర్రపాత్రల్లో ఒదిగిపోవచ్చు. కానీ, హీరోయిన్స్ మాత్రం వయస్సు పెరిగితే, పెళ్లయితే నటనకు దూరం జరగాల్సిందే.. లేదా, తమ వయస్సుకు తగ్గ పాత్రలు వేయాల్సిందే.
బాలీవుడ్ లో తాజాగా ఆల్ఫా అనే కొత్త సినిమా రూపకల్పనతో… ఈ చర్చ ఇప్పుడు తెరపైకొచ్చింది. ఆల్ఫాలో 33 ఏళ్ల ఆలియాభట్.. ఇప్పటికే ఓ పిల్ల తల్లిగా కూడా ఉన్న హీరోయిన్ 18 ఏళ్ల యువతి పాత్రలో అదీ పూర్తిగా లేడీ ఒరియెంటెడ్ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటించడంతో ఈ చర్చ మొదలైంది.
Ads
ఆల్ఫా నిర్మాత ఆదిత్య చోప్రా. దర్శకుడు శివ్ రావైల్. ఈ టీజర్ విడుదలై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఉత్కంఠభరితమైన విజువల్స్ తో లేడీ ఒరియెంటెండ్ స్పై థ్రిల్లర్ గా ఈ సినిమా అలరించబోతున్నట్టు సమాచారం. సీత అనే యువతి ఓ మిషన్ ను పూర్తి చేసేందుకు ఒక ఆయుధంగా ఎలా మారింది.. అందుకు ఎలాంటి శిక్షణ తీసుకుందనేది ప్రధాన ఇతివృత్తం.
మరి ఇంతకుముందు బాలీవుడ్ లో లేడీ ఒరియెంటెడ్ మూవీస్ రాలేదా..?
రాణీముఖర్జీ నటించిన మర్దానీ మూడు సినిమాల సీరిస్ తో పాటు.. శ్రీదేవి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన ఇంగ్లీష్ వింగ్లీష్, కంగనా రనౌత్ క్వీన్, మణికర్ణిక, ది క్వీన్ ఆప్ ఝాన్సీ, అలాగే, విద్యాబాలన్ కహానీ, ది డర్టీ పిక్చర్ వంటి సినిమాలు లేడీ ఒరియెంటేషన్ తో అడపాదడపా వచ్చినవే. కానీ, ఈ ధోరణి అలవాటుగా మారలేదు. దీంతో బాలీవుడ్ లో తాజాగా వస్తున్న ఆలియాభట్ సినిమాతోనైనా నటులకు ఎంత ప్రాధాన్యత దక్కుతుందో.. నటీమణులకూ అంతే దక్కే ధోరణి కొనసాగుతుందా అనే చర్చకు తెరలేపింది.
వయసు రీత్యా సినిమా ఇండస్ట్రీలో స్పష్టంగా కనిపించే అసమానతలు!
దశాబ్దాలుగా తెలుగు, తమిళ, హిందీ అన్న తేడా లేకుండా చిత్ర పరిశ్రమలో హీరోలకు స్టార్ డమ్ ఉన్నంత కాలం వాళ్లకు 60, 70 ఏళ్లు వచ్చినా వారు కుర్ర హీరోల పాత్రలు చేయొచ్చు. కానీ, హీరోయిన్స్ మాత్రం అందుకు పనికిరారు. 30 ఏళ్లు దాటితే వారు కొత్త దశలోకి అడుగుపెట్టినట్టే. ఆ తర్వాత వారి అవకాశాలు తగ్గిపోతాయి. ఒకవేళ వచ్చినా వారి వయస్సుకు తగ్గ పాత్రలే చేయాల్సిన అవకాశాలవి.
ఈ క్రమంలో 33 ఏళ్ల ఆలియాభట్ ఒక భారీ యాక్షన్ చిత్రమైన ఆల్ఫాలో ఓ 18 ఏళ్ల యువతిగా నటించడాన్ని సాధారణంగా మాత్రమే చూడలేం. తరాలుగా కొనసాగుతున్న పరిశ్రమ పక్షపాతాన్ని సవాల్ చేసే పరిణామం.
పురుషాధిక్య ఇండస్ట్రీగానే కొనసాగుతున్న సినీ పరిశ్రమ!
వాస్తవానికి ఇలాంటి అసమానతలు బహిరంగంగా పెద్దగా చర్చకు రాకపోవచ్చు. వచ్చినా అంత ఇంపాక్ట్ కూడా చూపించకపోవచ్చు. కానీ, నిశితంగా పరిశిలీస్తే ఈ నటులు, నటీమణుల మధ్య స్టార్ డమ్ విషయంలో ఈ అసమానతలు స్పష్టంగా కనిపిస్తాయి.
సల్మాన్ ఖాన్ ముదురు వయస్సులో కూడా తన కంటే చిన్న హీరోయిన్స్ తో నటిస్తాడు. చిరంజీవైనా, ఒక బాలయ్య అయినా, రజనీదైనా ఇదే స్టైల్. 50 ఏళ్లు గాటినా షారుక్ ఖాన్ పఠాన్ వంటి సినిమాల్లో యువ హీరో అయిపోతాడు. సామ్రాట్ పృథ్వీరాజ్ వంటి సినిమాల్లో అక్షయ్ కుమార్ తనకంటే ఎంతో చిన్నైన మానుషీ చిల్లార్ తో స్టెప్పులేస్తాడు.
ఈ వయసు మీరిన హీరోలందరినీ మేకప్ వేసి, విగ్గులు పెట్టి కథలకు వీళ్లే అవసరమన్నట్టుగా కటింగ్స్ ఇస్తుంటారు. కానీ, హీరోయిన్స్, నటీమణుల విషయంకొచ్చేసరికి మాత్రం మొత్తం ఉల్టాపల్టా.

మహిళా నటీమణులపై పరిమితులెందుకు?
1990ల దశకం నుంచి 2000 ఆరంభం వరకూ కూడా అగ్రస్థానంలో ఉన్న మాధురి దీక్షిత్, రవీనా టాండన్ వంటి నటీమణులంతా వివాహం కాగానే.. లేదా, వయస్సు 30 దాటిన తర్వాత క్రమంగా తల్లి పాత్రలు, లేదా సహాయక పాత్రలకే పరిమితమయ్యారు. షెఫాళీ షానైతే అక్షయ్ కుమార్ కంటే చిన్న వయస్సైనప్పటికీ… వక్త్ – ది రేస్ ఎగైనస్ట్ టైం సినిమాలో ఆయనకు తల్లి పాత్రలో నటించాల్సి వచ్చింది.
ఇక రాణీముఖర్జీ, విద్యాబాలన్, టబు వంటివారంతా కూడా తమ వయస్సుకు తగ్గ పాత్రలనే ఎంచుకోవడమో.. లేదంటే కథా ప్రధానమైన పాత్రల్లో కీరోల్స్ చేయడానికో మాత్రమే పరిమితమయ్యారుగానీ.. మళ్లీ హీరోయిన్స్ గా ఒక ఏజ్ తర్వాత కనిపించిన దాఖలాల్లేవు. అంటే పురుషుల వయస్సు పెరిగినా వారి స్టార్ డమ్ వారిని కుర్ర హీరోలుగా నటించేందుకు అనుమతిస్తోంది. కానీ, మహిళా నటులు మాత్రం తమ వయస్సుకు తగ్గ పాత్రలే చేయాలనే సందేశం స్పష్టంగా సినిమా ఇండస్ట్రీలో కనిపిస్తుంది.

మొనాటనీ బ్రేక్ చేస్తున్న కొందరు హీరోయిన్స్!
వయసొక నంబర్ గేమ్ మాత్రమేనని… మగవారికి అడ్డంకి కానిది ఏజ్ తమకెందుకైతుందన్నట్టుగా కొందరు హీరోయిన్స్ దూసుకొస్తున్నారు. ఆ కోవలోనే ఇప్పుడు ఆలియాభట్ ఒక ప్రస్తావనగా మారింది.
33 ఏళ్ల ఈ నటి ఒక యువతి పాత్రలో భారీ యాక్షన్ చిత్రాన్ని తన భుజాలపై మోస్తోంది. ప్రతిభకు వయస్సు అడ్డంకి కాదని మరోసారి నిరూపించబోతోంది. ఎందుకంటే, ఈమె కెరీర్ ను ఓసారి పరిశీలిస్తే.. ఒక ఉడ్తా పంజాబ్, రాజీ, డార్లింగ్స్, గంగూభాయి కథియావాడి వంటి సినిమాల్లో లోతైన, బలమైన పాత్రల్లో ఒదిగిపోయింది.
ప్రతీ సినిమాలో ఒక సింబాలిక్ సందేశమూ కనిపిస్తుంది. ఫర్ సపోజ్ ఉడ్తా పంజాబ్ లో బతుకు పోరాటం కనిపిస్తే.. డార్లింగ్స్ లో ప్రతిఘటన కనిపిస్తుంది. గంగూభాయి కథియావాడిలో ఆధిపత్యం ఎలా ఉంటుందో చూపిస్తుంది. ఇప్పుడు ఆయుధంగా మారిన ఓ నాయకురాలి పాత్రలో ఆల్ఫాలో అలరించబోతోంది.
మొత్తంగా ఇలాంటి సినిమాలతో ఎన్నో ఏళ్లుగా మహిళలపై విధించిన పరిమితులకు చెక్ పెట్టే ఒక కొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టి ఆలియాభట్ వంటి హీరోయిన్స్ మొనాటనీని బ్రేక్ చేయడంతో పాటే… పలు సామాజిక అసమానతలకు సంబంధించిన అంశాలను చర్చకు పెడుతున్నారు.
Share this Article