.
Shankar G …. జంజీర్ (1973)
ఈ సినిమా అమితాబ్ బచ్చన్ కోసమే రాసిపెట్టి ఉంది. అంతకు ముందు ఆయన 12 చిత్రాలలో నటించారు, వాటిలో 10 ఫ్లాప్ అయ్యాయి, ఒకటి యావరేజ్ బిజినెస్ చేసింది, కేవలం ఒక్కటి మాత్రమే హిట్టయింది, అది కూడా సహాయ పాత్రలో (ఆనంద్). కాబట్టి, జంజీర్ సినిమా ఆఫర్ వచ్చే నాటికి అమితాబ్ కెరీర్ దాదాపుగా క్లోజ్ ఐనట్టే అనుకున్నారు.
సలీం జావేద్ రాసిన స్క్రిప్ట్‌ను మొదట ధర్మేంద్ర 2500 రూపాయలకు కొనుగోలు చేశారు, కానీ గతంలో ప్రకాష్ మెహ్రాతో పనిచేసిన చేదు అనుభవం కారణంగా ఈ సినిమా చేయవద్దని ఆయన కజిన్ సోదరి కోరారు. ప్రకాష్ మెహ్రా రాజ్‌కుమార్, దేవానంద్, రాజేష్ ఖన్నా వంటి అనేక మంది నటులను సంప్రదించారు, కానీ వారందరూ నిరాకరించారు.
Ads
వింత చేష్టలకు కేరాఫ్ ఐన రాజ్‌కుమార్‌కు ప్రకాష్ మెహ్రా గెటప్ నచ్చక నిరాకరించారు, ప్రధాన నటుడిపై పాటలు చిత్రీకరించనందున దేవానంద్ నిరాకరించారు. కథ చాలా సీరియస్ గా ఉందని రాజేష్ ఖన్నా భావించారు. చివరికి, ‘బాంబే టు గోవా’ సినిమా క్లిప్‌లో అమితాబ్ శాండ్‌విచ్ తింటూ కొట్లాడుతుండగా చూసి, సలీం జావేద్ ఆయన పేరును సూచించారు. ఆ సన్నివేశంలోని ఆయన స్వాగ్ రచయితలను ఎంతగానో ఆకట్టుకుంది, చివరికి అమితాబ్‌ను ఆ సినిమాకు ఎంపిక చేశారు.
కానీ అమితాబ్ అప్పటికే ఫ్లాప్ నటుడు కావడంతో, ఏ పెద్ద హీరోయిన్ కూడా ఆయన సరసన నటించడానికి ముందుకు రాలేదు. ఆ సమయంలో అమితాబ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్న జయ భాదురి, ఆయన కంటే పెద్ద స్టార్ అయినప్పటికీ ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధపడింది.
అమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ కూడా, అమితాబ్ బచ్చన్ బి-గ్రేడ్ స్టంట్ సినిమాలకు సంతకం చేశారని భావించి, సినిమా ప్రీమియర్‌కు రావడానికి నిరాకరించారు. కానీ చివరికి ‘జంజీర్’ ఆ సంవత్సరంలో అతి పెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది.
ఒక్కో ప్రాంతానికి 12 లక్షలకు (మొత్తం 72 లక్షలు) అమ్ముడుపోయిన ఈ చిత్రం, చివరికి ఒక్కో ప్రాంతానికి 60 లక్షలు (మొత్తం 3.6 కోట్లు) వసూలు చేసింది. ఈ చిత్రం ఓవర్ నైట్ లో అమితాబ్‌ను ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’గా నిలబెట్టింది.
ఇదే సినిమాని ఎన్టీఆర్ హీరోగా నిప్పులాంటి మనిషి పేరుతో వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. హిందీలో ప్రాణ్ వేసిన పాత్ర ఇందులో సత్యనారాయణకు షేర్ ఖాన్ గా మంచిపేరు తెచ్చింది. హిందీలో రామ్ చరణ్ హీరోగా జంజీర్ రీమేక్ చేస్తే ఘోరంగా ఫ్లాప్ అయ్యింది.
Share this Article