జజ్జనకరి జనారే… డప్పు కొట్టుకుంటూ ఉండాలి… ఆ డప్పింగును బట్టే యాడ్స్ వస్తుంటయ్… కానీ నానా అవలక్షణాలు, ట్యాంపరింగు బాగోతాలు గట్రా ఉన్నా సరే, టీవీల రేటింగు తేల్చడానికి బార్క్ ఉంది… కానీ ఈ రేటింగ్ దందాలతో అది న్యూస్ చానెళ్ల రేటింగ్స్ మొత్తమే నిలిపేసింది… రిపబ్లిక్ టీవీ దగ్గర నుంచి బోలెడు టీవీ చానెళ్ల దందాల్ని తేల్చే పని ముంబై పోలీసులు చూసుకుంటున్నారు… అఫ్ కోర్స్, ముంబై పోలీసుల కేసులు అంటేనే మళ్లీ దందాలు, పొలిటికల్ కదా… అందుకని ఇదిప్పట్లో తేలదు… ఎప్పుడూ లిస్టులో టీవీ9 ఫస్టులో ఉండేది కదా.,. ఇప్పుడది ఆగిపోయింది… మరి డప్పు ఎలా..? ఇదుగో ఈ తీగ పట్టుకుంది… డప్పు మొదలెట్టింది… మాకన్నా గొప్పోళ్లు ఎవరూ లేరహో… మేం తోపులమహో… అని డబ్బా కొట్టుకుంటోంది… ఈ రేటింగులు, ఈ ర్యాంకులు, ఈ లెక్కలు అర్థమయ్యేవాడికి నవ్వొచ్చే యవ్వారం…
ఇది చూడగానే మీకు అనిపించేది ఏమిటి..? అబ్బో, టీవీ9కి తిరుగులేదు అనే కదా..! అది తేల్చింది ఎవరు..? ఎవడో… స్కోచ్ అవార్డులు ఇచ్చే సంస్థల్లాంటివి… కామ్‌స్కోర్, మొబైల్ మెట్రిక్స్ ఎట్సెట్రా… ఒక నెలలో మిలియన్ వ్యూస్ లెక్క తీసుకుని టీవీ9 నంబర్ వన్ అట… అసలు ఈ సైట్ల వ్యూస్ లెక్కలే ఓ పెద్ద బోగస్ యవ్వారం… బార్క్ రేటింగులనే ట్యాంపర్ చేసిపారేసే ఈ రోజుల్లో ఈ సైట్ల ర్యాంకులు, వ్యూస్ లెక్కలు ఓ లెక్కా..? సరే, టీవీ9 తోపు, తోపున్నర, డబుల్ తోపు… మరి ఎంచక్కా టీవీ ప్లస్ మెయిన్ స్ట్రీమ్ పెద్ద పత్రికల సైట్లతో పోల్చుకోవచ్చు కదా… ఆ గ్రేటాంధ్ర, ఆ సమయం, ఆ బీబీసీ సైట్లతో పోలిక ఏమిటి..? ఒరేయ్, ఆంధ్రజ్యోతోడా నీ బతుకు, నీ రేంజ్ వాటితో సమానం అని తిట్టిపోయడానికా..? ఓ లెక్క మనం చూద్దాం… ఇదే టీవీ9తెలుగు సైటు డిజిటల్ వ్యూస్ 16.53 మిలియన్ వ్యూస్ అంటున్నారు కదా… గత ఏడాది ఏప్రిల్‌లో తెలుగుఅడ్డా అనే సైటు ఏకంగా 24.7 మిలియన్ వ్యూస్ సాధించినట్టు ఇదుగో ఆధారం… అంటే టీవీ9కన్నా అదే తోపు, సూపర్ స్టార్ అని అంగీకరించినట్టేనా..?
Ads
పోనీ, ఓసారి అలెక్సా ర్యాంకులు చూద్దాం… టీవీ9… 991, సాక్షి 152, ఈనాడు 122, ఆంధ్రజ్యోతి 156, గ్రేటాంధ్ర 177, సమయం 522, ఈటీవీ భారత్ 741… జాగ్రత్తగా చూడండి… టీవీ9 చానెల్ క్లెయిమ్ చేసుకునే లెక్కల్లో తనకు 16.53 మిలియన్ల వ్యూస్ అయితే ఆంధ్రజ్యోతి కేవలం 1.83 మిలియన్ల వ్యూస్… అంటే టీవీ9తో పోలిస్తే పది ఆమడలకు మించి దూరం ఉన్నట్టు లెక్క… ఛఛ, అసలు పోటీలోనే లేనట్టు లెక్క… కానీ అలెక్సాలో చూస్తే… టీవీ9 ర్యాంకు 991 అయితే, ఆంధ్రజ్యోతి 156… అంటే టీవీ9 ఎక్కడున్నట్టు..? న్యూస్18 సైట్ ర్యాంకు మరీ 83… అంటే అందరికన్నా తోపా..? ఇదే తెలుగు అడ్డా అలెక్సా ర్యాంకు 525… ఒక దశలో 125… మరి ఎవరు తోపులు..? ఎవరి కళ్లకు గంతలు కట్టడానికి ఈ దిక్కుమాలిన లెక్కలు..? నిజానికి అలెక్సా, బార్క్, కామ్‌స్కోర్ ఎట్సెట్రా అన్నీ పెద్ద పెద్ద యవ్వారాలే… పెయిడ్ ర్యాంకులు వేరే, అన్ పెయిడ్ వేరే… టెక్నికల్ జిత్తులు తెలిసినవాడు తలుచుకుంటే గూగుల్‌ను కూడా కొట్టేసి నంబర్ వన్ అని లెక్క తేల్చవచ్చు… అవునూ, ఆంధ్రజ్యోతి వాడు ఇంకా ఏమీ మాట్లాడలేదా..? పోనీలే, ఇజ్జత్ పోతేపోయిందిలే అని అన్నీ మూసుకున్నాడా..?! అన్నట్టూ… ఈ లెక్క ఏమిటి, మన పతనాన్ని చూపిస్తోంది…
Share this Article