Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇందిరకు నచ్చినా… విడుదలకు ససేమిరా..! అదీ మరి ‘‘గరం హవా’’..!!

July 10, 2021 by M S R

Taadi Prakash……   ఎం.ఎస్‌.సత్యు ‘గరంహవా’

A LANDMARK POLITICAL FILM

————————————————–

Ads

సరిగ్గా 46 సంవత్సరాల క్రితం 1974లో ‘గరంహవా’ (Scorching Wind)

విడుదల అయింది.

’వేడిగాలి’ లేదా ‘వడగాడ్పు’ అనొచ్చు.

కొందరు ఈ సినిమాని నిషేధించాలి అన్నారు.

హిందూ ముస్లిం గొడవల్ని ఇంకా పెంచే ప్రమాదకరమైన సినిమా అని ఇంకొందరు అన్నారు. మనదేశంలో వచ్చిన గొప్ప రాజకీయ చిత్రం అన్నారు విమర్శకులు. దేశవిభజన తర్వాత పరిణామాలని యింత బాగా తెరకెక్కించడం అసాధారణం అన్నారు చాలామంది. ఉత్తర ప్రదేశ్‌లోని ఒక ముస్లిం కుటుంబం, విభజన తర్వాత పడిన అగచాట్లే ‘గరంహవా’.

ఆరుగురు మహానుభావుల సృజనాత్మక కృషి ఫలితం ఈLand Mark Film. కథ : ఇస్మత్‌ చుగ్తాయ్‌, స్క్రీన్‌ప్లే : కైఫీ ఆజ్మీ, షామాజైదీ, ఫోటోగ్రఫీ : ఇషాన్‌ ఆర్య, సంగీతం : ఉస్తాద్ బహదూర్ ఖాన్

హీరో : బలరాజ్‌ సహానీ

దర్శకత్వం : ఎం.ఎస్‌. సత్యు.

మైసూర్‌ శ్రీనివాస్‌ సత్యు కన్నడిగ, బ్రాహ్మిన్‌. దక్షిణాదికి చెందిన ఒక బ్రాహ్మడు, ఉత్తరాది ముస్లింల సమస్య మీద సినిమా తీయడం ఏమిటో?

అని కొందరు వెటకారంగా అన్నారు.

సత్యు బాగా చదువుకున్నవాడు.

వామపక్ష భావాలకు బంధువు. సత్యు భార్య ముస్లిం. ‘‘లోతైన అవగాహన, సరైన దృక్పధం, ఇంగితమూ, స్పందించే గుణమూ వున్న వారెవరైనా యిలాంటి సినిమాలు తీయొచ్చు. ముస్లిములు మాత్రమే యిలాంటి సినిమా తీయాలన్న రూల్ ఏమీ లేదు అన్నారు సత్యు. గొడవలు జరగొచ్చని భయపడిన నిర్మాత వెనక్కి తగ్గాడు. ‘గరంహవా’ తీయడానికి అప్పట్లో 10 లక్షల రూపాయలు ఖర్చయింది.

సత్యు దగ్గర పెద్దగా డబ్బుల్లేవు. ఇండియన్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ రెండున్నర లక్షలు యిచ్చింది. ఇషాన్‌ ఆర్య కొంత డబ్బు పెట్టాడు. మిగిలింది అప్పు చేశాడు సత్యు. ప్రఖ్యాత ఉర్దూ రచయిత్రి ఇస్మత్‌ చుగ్తాయ్‌, ప్రసిద్ధకవి, రచయిత కైఫీ అజ్మికి తన కథ వివరించారు. విభజన వల్ల చుగ్తాయ్‌ బంధువులు పాకిస్థాన్‌ వెళ్లిపోవడంలాంటి అనుభవాలు చెప్పారు. కైఫీ తన సొంత అనుభవాన్నీ, లక్నోలో ముస్లింలు నడిపే లెదర్‌ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాల్ని జోడించి ‘సినిమా కథ’ సిద్ధం చేశారు. కైఫీ, సత్యు భార్య షామా కలిసి స్క్రీన్‌ ప్లే రాశారు. బలరాజ్‌ సహనీతో సహ వీళ్ళంతా అప్పటి ఇండియన్‌

పీపుల్స్‌ థియేటర్‌ (IPTA) లో కలిసి పని చేసేవారు.

అందరూ కమ్యూనిస్టులే.

garamhawa

సెట్టింగులు ఏమీ వేయకుండా, లక్నోలోని కొన్ని ప్రాంతాల్లో సహజంగా వుండేలా షూట్‌ చేయాలని సత్యు నిర్ణయించారు. వామపక్షవాదులంతా కలిసి ముస్లింలకు అనుకూలంగా సినిమా తీస్తున్నారన్న కోపంలో కొందరు షూటింగ్‌ని అడ్డుకున్నారు.

దానికి విరుగుడు కనిపెట్టాడు సత్యు.

రీలులేని కేమెరా యిచ్చి ఒకచోట ఉత్తుత్తి షూటింగ్‌ చేయించాడు. అక్కడ నిరసనకారులు గొడవచేస్తుంటే, మరో ప్రాంతంలో ఆయన అసలు సినిమా షూట్‌ చేసుకున్నాడు. లక్నోలో ఆయన మిత్రులు కొందరు ఎంతో సహాయం చేశారు.

తగినంత డబ్బులేకపోవడం వల్ల మాటలు, సంగీతం లేకుండా ‘మూకీ’ గానే షూట్‌ చేశారు.

పోస్ట్‌ ప్రొడక్షన్‌లో వాటిని కలిపారు.

కమర్షియల్‌గా లేకుండా, హిందుస్థానీ శాస్త్రీయ సంగీత పండితుడు బహుదూర్‌ ఖాన్‌ని మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తీసుకున్నారు. లక్నో యిరుకు వీధుల్లో, పాత హవేలీల్లో నానా తిప్పలు పడి షూటింగ్‌ ముగించారు.

సినిమా సిద్ధం అయింది. విడుదల ఎలా?

బొంబాయిలోని భారత సినీ సెన్సారువారు సినిమా చూశారు. దీన్ని తక్షణం నిషేధించాలి అన్నారు. రివ్యూ కమిటీకి వెళ్ళాడు సత్యు. సినిమా చాలా బావుందని కమిటీ వాళ్ళన్నారు. ఎటూ తేల్చకుండా వూరుకున్నారు బోర్డువాళ్ళు. సినిమా ఆగిపోయేట్టు వుందన్న అనుమానంతో సత్యు నాటి ప్రధాని ఇందిరాగాంధీని కలిశారు. ఆమె ‘గరంహవా’ చూస్తానని అన్నారు. ఒక ఆదివారం రాష్ట్రపతిభవన్‌లో షో వేశారు. ఇందిరాగాంధీ, సమాచారమంత్రి ఐ.కె.గుజ్రాల్‌, సుభద్రాజోషి మరికొందరు కేంద్రమంత్రులు సినిమా చూశారు.

‘ఫిల్మ్‌ అచ్ఛాహై’ అని సత్యుతో చెప్పి ఇందిర వెళ్ళిపోయారు. ఏం చేయమంటారు? అని సత్యు అడిగితే, మా కాంగ్రెస్‌ ఎంపీలకు ఓసారి చూపించండి అన్నారామె. అదయ్యాక, ప్రతిపక్షాలూ చూస్తే బావుంటుందిగా అన్నారు ఇందిర. ఆ షో కూడా అయింది. కొంపమునిగేట్టు వుందని భయపడిన సత్యు, కమ్యూనిస్టు నాయకులు, వామపక్ష జర్నలిస్టులు అందరికీ ఒక స్పెషల్‌ షో వేసి చూపించారు. అందరూ గొప్ప సినిమా అనే అన్నారు. మళ్ళీ ఇందిరాగాంధీని కలిసి అడిగారు సత్యు.

మీరు దక్షణాదిన విడుదల చేసుకోండి అన్నారామె. అదేమిటీ? అంటే, ఉత్తరాదిన మధ్యంతర ఎన్నికలు వున్నాయి, ముస్లిం వోట్ల కోసం కాంగ్రెస్‌ వాళ్ళు స్పాన్సర్‌ చేసి ‘గరంహవా’ తీయించారంటారు.

అది మాకు యిబ్బంది అవుతుందని ఇందిరాగాంధీ చెప్పారు. ఇంత మంచి సినిమా తీసి దేశమంతా విడుదల చేయలేకపోతున్నానని సత్యు విలవిల్లాడిపోయారు.

garamhawa1

పారిస్‌నుంచి దర్శకుడికి ఓ ఫోన్‌ వచ్చింది. ఢిల్లీలో ‘గరంహవా’ చూసిన వాళ్ళు సినిమా అద్భుతంగా వుందని అంటున్నారు. పారిస్‌రండి, యిక్కడ ప్రీమియర్‌ షో వేద్దాం అని సత్యు మిత్రుడు అన్నాడు. పారిస్‌ వెళ్ళాలి. విమానం టికెట్‌కి డబ్బుల్లేవు.

ఓ పెద్దాయన ఫోన్‌తో ఎయిర్‌ఇండియా ఉచిత ప్రయాణం సాధ్యమైంది. ‘గరంహవా’ చూసిన పారిస్‌ సినీ పండితులు ఉద్వేగంతో ఊగిపోయారు.

దీన్ని ప్రతిష్టాత్మకమైన కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి పంపాలి అన్నారు. కాన్స్‌లో ‘గరంహవా’ చూసి, దీన్ని ఆస్కార్‌ అవార్డుకి నామినేట్‌ చేయాలన్నారు. విదేశీ వార్తలు విన్న భారత ప్రభుత్వం ‘‘చాల్లే సంబడం, యిక్కడ రిలీజ్‌ చేసుకోండి’’ అంది. సత్యు మిత్రుడొకాయన, బెంగళూరులోని తన రెండు థియేటర్లలో ముందు ప్రదర్శించాడు. విమర్శకులు ‘కెవ్వుకేక’ అన్నారు. Land mark film in Indian histroy అని పత్రికలు రాశాయి. ఎం.ఎస్‌.సత్యు, ఇషాన్‌ ఆర్య,

బలరాజ్‌ సహానీ, కైఫీ ఆజ్మి పేర్లు దేశం అంతటా మోగిపోయాయి. ఇది కమర్షియల్‌ సినిమా కాకపోయినా, న్యూవేవ్‌ ఆర్ట్‌ ఫిలిం కేటగిరీకి చెందిందే అయినా లాభాలు రాబట్టగలిగింది.

బెస్ట్‌ ఫారెన్‌ లాంగ్వేజి ఫిల్మ్‌ కేటగిరిలో ఇండియన్‌ ఎంట్రీగా ‘గరంహవా’ ఆస్కార్‌ అవార్డుకి నామినేట్‌ అయింది. గమ్మత్తేమిటంటే దేశ సమైక్యతను

చాటి చెప్పిన చిత్రంగా ఆ ఏడాది నర్గీస్‌దత్‌ అవార్డు గెలుచుకుంది. 1975లో ఉత్తమ డైలాగులు

కైఫీ ఆజ్మి, ఉత్తమ స్క్రీన్ ప్లే కైఫీ ఆజ్మీ, షామా జైది, ఉత్తమ కథ ఇస్మత్‌ చుగ్తాయ్‌

ఫిలిం ఫేర్‌ అవార్డులు పొందారు.

*** *** ***

garamhawa2

లక్నో జీవితం… కష్టాల కొలిమి

The land is divided

Lives are shattered

Storms rage in every heart:

It’s the same here or there.

Funeral pyres on every home:

The flames mount higher.

Every city is deserted:

It’s the same here or there.

No one heeds the Gita:

No one heeds the Koran

Faith has lost all meaning:

Here or there.

వేదనా భరితమైన ఈ మాటలతో సినిమా

ప్రారంభం అవుతుంది. ఆవిర్లు చిమ్ముతూ లక్నో నుంచి రైలు పాకిస్తాన్‌ వెళుతుంటుంది.

ఫ్లాట్‌ఫాం మీద నించుని వున్న సలీం మీర్జా (బలరాజ్‌ సహానీ) చెయ్యి వూపుతూ మిత్రులకు వీడుకోలు చెబుతుంటాడు. అలా మొదవుతుంది ‘గరంహవా’. ఆ ఒక్క సీన్‌తోనే దేశవిభజనలోని లోతైన వేదనని మన కళ్ళముందుంచుతాడు సత్యు. సలీం మీర్జా లక్నోలో ఒక లెదర్‌ బూట్ల కంపెనీ యజమాని. చదువూ సంస్కారంతో హుందాగా ప్రవర్తించే పెద్దమనిషి ఆయన. తల్లి, భార్య, ఎదిగిన ఇద్దరు కొడుకులు, కూతురు, కోడలు, మనవడు… మీర్జా కుటుంబం. ఒక పురాతన హవేలీలో వుంటారు. విభజన వల్ల ముస్లింలని అనుమానంగా చూస్తుంటుంది సమాజం. రోజూ అనేక మంది ముస్లింలు పాకిస్తాన్‌ వెళ్ళిపోతుంటారు.

garamhava

తరతరాలుగా ఉత్తరప్రదేశ్‌లోనే వుండి, పెళ్ళిళ్ళు చేసుకుని బిడ్డల్నికని, ఇండియానే మాతృభూమి

అని గట్టిగా నమ్మే ముస్లింలు సందిగ్ధంలో నలిగిపోతుంటారు.

ఒక్కటే ప్రశ్న, పాకిస్థాన్‌ వెళ్ళిపోవడమా?

సమస్యల్ని తట్టుకుని ఇక్కడే ఉండిపోవడమా?

‘‘మీర్జాగారు, మీరెప్పుడైనా పాకిస్తాన్‌ వెళిపోవచ్చు. మీ లెదర్‌ కంపెనీకి యిక రుణం ఇవ్వలేం’’ అంటుంది బ్యాంకు. బూట్లకి పెద్ద ఆర్డరు వుంటుంది.

అడిగిన రోజుకి బూట్లు తయారు చేసి పంపించాలి. వర్కర్లకి జీతాలు యివ్వాలి. ఆర్డర్‌ కేన్సిల్‌ అయిపోతుంది. చిన్నకొడుకు పాకిస్తాన్‌ వెళిపోతాడు. ముస్లిం అని పెద్ద కొడుక్కి ఎవరూ ఉద్యోగం యివ్వరు. కూతురు ప్రేమించిన యువకుడు పాకిస్తాన్‌ వెళిపోతాడు. కొంత కాలం తర్వాత మరో యువకుడితో పెళ్ళికి సిద్ధపడుతుంది.

అనుకోని పరిస్థితుల్లో అతను పాకిస్తాన్‌లో మరో అమ్మాయిని చేసుకుంటాడు. నిరాశతో మీర్జా కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది.

చాలా అప్పు వుందని ఇల్లు మరొకరు స్వాధీనం చేసుకుంటారు. బూట్ల ఫ్యాక్టరీ మూతపడుతుంది. ఎలాగైనా బతకాలని, సలీంమిర్జా బూట్లు తయారు చేసి, ఒక కుర్రాడితో బజార్లో తిరిగి అమ్ముతుండగా, మిర్జాని ‘పాకిస్తాన్‌ గూఢాచారి’ అంటారు.

విషాదంలో ఒంటరిగా మిగిలిపోతాడు.

కోర్టు మిర్జాని విడుదల చేస్తుంది.

చివరి సన్నివేశం : భార్య, కొడుకులతో సలీం మిర్జా గుర్రపుబండి (టాంగా)లో బయల్దేరుతాడు. స్టేషన్‌కి వెళ్ళి, పాకిస్తాన్‌కి రైలు ఎక్కాలి, దారిలో టాంగాకి ఒక పెద్ద ప్రదర్శన అడ్డువస్తుంది. వందలమంది యువకులు, ‘ఉద్యోగాలు కావాలి’ అని నినాదాలు చేస్తుంటారు. ఎర్ర బేనర్లు, ఎర్ర జెండాలు పట్టుకున్న

ఆ యువకులు ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అని గట్టిగా అంటూంటారు. ‘‘నాన్నా, నేను వాళ్ళతోనే వెళతా’’ అంటాడు కొడుకు (ఫారూక్‌ షేక్‌), టాంగా దిగుతూ, వెళ్ళు… నేనూ మీతోనే… అంటూ సలీం మిర్జా

టాంగా దిగుతాడు. తాళం భార్య చేతికిచ్చి, ఆమెని ఇంటికి తీసికెళ్ళు అని టాంగా వాడితో చెబుతాడు. ఆవేశంతో నినాదాలు చేస్తున్న యువకులతో కలిసి నడుస్తాడు మిర్జా. చావోరేవో భారతదేశంలోనే వుండాలన్నదే పెద్దాయన అంతిమనిర్ణయం.

*** *** ***

garmhava

కొన్ని తెరవెనుక కబుర్లు

నిజజీవితంలో బలరాజ్‌ సహాని మొదటి భార్యకి

ఒక కూతురు. ఆమె ఒక ముస్లింని ప్రేమించింది. దానికి బలరాజ్‌ తల్లి ఒప్పుకోలేదు.

దాంతో ఓ హిందూ యువకునితో కూతురిపెళ్ళి చేశాడు బలరాజ్‌ సహాని. తర్వాత కూతురు ఆత్మహత్య చేసుకుంది. సినిమాలో కూడా ఆయన కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది.

‘‘బొంబాయిలో అచేతనంగా వున్న నీ కూతుర్ని చూస్తూ నిబడిపోయావు. కన్నీళ్ళు పెట్టుకోలేదు. ఇక్కడ సినిమాలో కూడా చనిపోయి వున్న కూతుర్ని విషాదంగా చూస్తూ నిలబడు. ఇది నీకు క్రూయెల్‌గా అనిపించినా, దర్శకుడిగా నా పని అది’’ అని బలరాజ్‌ సహానీతో సత్యు చెప్పారు.

సినిమాలో సలీంమిర్జా తల్లిపాత్రకి 70 ఏళ్ళ వయసుండే వృద్ధురాలు కావాలి. ఆ పాత్ర చేయాలని గాయని షంషాద్‌ బేగంని అడిగారు.

ఆమె ఒప్పుకోలేదు. బాదర్‌ బేగం అనే ఆమె 16 ఏళ్ళకే బొంబాయి పారిపోయి సినిమాల్లో చిన్నచిన్న వేషాలు వేసింది. కొన్నేళ్ళ తర్వాత లక్నో తిరిగి వచ్చి వ్యభిచారం చేసింది. పెద్దయ్యాక ఒక వ్యభిచారగృహం నడిపింది. 70 ఏళ్ళ బాదర్‌ బేగంని ఒక మిత్రుడు పరిచయం చేశాడు సత్యుకి. కళ్ళుకూడా సరిగా కనిపించని ఆమెకి బలరాజ్‌ సహానీ తల్లిపాత్ర యిచ్చాడు. ఆ పాత్రలో ఆమె చెప్పలేనంత బాగా వొదిగిపోయింది. ఆ పాత్రకి ప్రఖ్యాత నటి దీనా పాఠక్‌ డబ్బింగ్‌ చెప్పింది.

*** *** ***

1953లో లెజండరీ బిమల్‌రాయ్‌ తీసిన

‘దోబిఘా జమీన్‌’ సినిమాలో బరాజ్‌ సహానీ అప్పు తీర్చడంలేదని పొలం లాక్కోబోతాడు భూస్వామి. అప్పు తీర్చడం కోసం ఆ పేద రైతు కలకత్తా వీధుల్లో రిక్షాతొక్కుతాడు. ఆ తలపాగా చుట్టిన రిక్షా కార్మికునిగా బలరాజ్‌ సహానీ, భారతీయ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచివుంటాడు.

1973లో ‘గరంహవా’ నిర్మాణం ముగిశాక, డబ్బింగ్‌ పూర్తయిన మర్నాడే బరాజ్‌ సహానీ మరణించారు.

దుర్భరవేదన, విషాదం కగలిసిన భావోద్వేగాన్ని తెరమీద బలరాజ్‌ సహానీ పలికించిన తీరు మనల్ని కన్నీళ్ళ పర్యంతం చేస్తుంది.

దేశ విభజన తర్వాత పాకిస్తాన్‌ వెళ్ళినవాళ్ళు అక్కడ బాగుపండిదేమీ లేదు. ఇక్కడున్న ముస్లింలు, పాక్‌నించి వచ్చిన సింధీలు, తదితరులు బావుకున్నదీ ఏమీ లేదు. చివరికి ఇండియా, పాకిస్తాన్‌ ప్రభుత్వాలు సామాన్య జనం, మధ్య తరగతి వాళ్ళ బతుకుల్ని గాలికి వదిలేశాయని అర్థం అయినపుడు మనసుకెంతో కష్టంగా వుంటుంది.

sathyu

‘గరంహవా’ ఫిలిం రీళ్ళు పాడయిపోతే సినిమాని పునరుద్ధరించడానికీ, డాల్బీ సరౌండ్‌కి మార్చడానికీ కోటి రూపాయలు ఖర్చయింది. కాలిఫోర్నియాలోని ఫిలింలాబ్‌లో ‘గరంహవా’ని యిలా బతికించి, 2004లో ఇండియా అంతా 80 మల్టీప్లెక్సుల్లో

మళ్ళీ విడుదల చేశారు.

చరిత్రలో ఒక సంక్లిష్టమైన దశలో భారత ముస్లింల వేదనాభరిత జీవితాన్ని సహజసుందరంగా తెరకెక్కించిన ఇషాన్‌ ఆర్య, ఎం.ఎస్‌.సత్యు ధన్యులు.

తర్వాత ముత్యాలముగ్గు సినిమాకి

ఉత్తమ ఫోటోగ్రాఫర్‌గా ఇషాన్‌ ఆర్య

జాతీయ అవార్డు పొందారు.

గరంహవాకి ఒరిజినల్‌ కథరాసిన ఉర్దూ రచయిత్రి ఇస్మత్‌ చుగ్తాయ్‌,Woman Sexuality, Femininity మీద దిగ్భ్రాంతి పరిచే కథలు, నవలలు రాసి సంప్రదాయ సమాజం వీపు పగలగొట్టారు.

ఆమె మన గుడిపాటి వెంకట చెలంగారికి ఉర్దూ వెర్షన్‌ అన్నమాట. అనేక భాషల్లోకి తర్జుమా అయిన చుగ్తాయ్‌ కథ ‘Quilt’ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.

నటి షబానా ఆజ్మీ తండ్రి కైఫీ ఆజ్మీ.

గరంహవాలో కైఫీ సహచరి షౌకత్‌ ఆజ్మీ

బలరాజ్‌ సహానీ భార్యగా నటించారు.

సత్యజిత్ రే పథేర్ పాంచాలి కూడా మొదట పారిస్ లో పెద్ద ఎత్తున ప్రశంసలు పొందాక మాత్రమే ఇక్కడ రిలీజ్ కి నోచుకుంది. అదీ మన దుర్గతి.

తాడి ప్రకాష్ – 9704541559

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?
  • కథ ప్రజెంట్ చేసే దమ్ముండాలే గానీ… పనిమనిషి కూడా కథానాయికే…
  • పర్లేదు, వితండవీరులు కూడా చదవొచ్చు ఈ కథను… కథ కాదు, చరిత్రే…
  • ఒక పనిమనిషి మరణిస్తే ఇంత దయా..?! ఇప్పటికీ వెంటాడే ఆశ్చర్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions