కావచ్చు… మండల స్థాయిలోనో, జిల్లా స్థాయిలోనో… పంచాయతీ కార్యదర్శులను పరీక్షించడానికి ఉద్దేశించిన ప్రశ్నపత్రమే కావచ్చు… లేదా ప్రతి జిల్లాలోనూ విధిగా ప్రయోగిస్తున్న మరో చికాకు బాణమే కావచ్చు… లేదా ప్రజలకు ఏమేరకు గ్రామ విభిన్నాంశాలపై అవగాహన ఏర్పడిందో తెలుసుకునే ప్రయత్నమే కావచ్చు… ఒకవైపు సరిపడా నిధులుండవ్ గానీ బ్రహ్మాండమైన టార్గెట్లు పెట్టి… అసలే ఊళ్లల్లో ప్రతి పనికీ పంచాయతీ కార్యదర్శే బాధ్యుడు అన్నట్టుగా తరుముతున్నది ప్రభుత్వం… వాళ్లకిచ్చే జీతం తక్కువ… కొలువులకు గ్యారంటీ లేదు… ఖాళీగా ఉండలేక, పెద్ద పెద్ద చదువులు ఉద్దరించిన యువకులు కూడా తప్పనిసరై ఈ కొలువులు చేస్తున్నారు… సర్పంచుల ధోరణి సరిగ్గా లేనిచోట వీళ్ల పని మరీ నరకం… ఈ స్థితిలో వాళ్లకు సరైన డైరెక్షన్ ఉందా అంటే అదీ లేదు… సరిగ్గా పల్లెప్రగతి దశ, దిశ ఎలా ఉందో, ఈ ప్రశ్నపత్రం కూడా అలాగే ఓ రీతి లేకుండా ఉంది… ఇది ప్రజలకూ పరీక్షే, పంచాయతీ కార్యదర్శులకూ పరీక్షే… ఎంత దారుణం అంటే..? ఎంత నవ్వొచ్చేలా ఉందీ అంటే…? ఒకసారి మొదటి ప్రశ్న చదవండి…
‘‘ఫ్రైడే- డ్రైడే ఏవారం..?’’ ఇదీ ప్రశ్న… నవ్వొచ్చిందా..? నవ్వకండి, మన అధికారులు, మన ప్రభుత్వాలు ఇలాగే పనిచేస్తుంటయ్…? ఎవరికీ సీరియస్‌నెస్ ఉండదు… లేకపోతే ఏమిటీ ప్రశ్న..? ఒరేయ్ యాదగిరీ, నీ పేరేమిట్రా అనడిగినట్టు లేదా..? మిగతా ప్రశ్నల గురించి చర్చ వద్దులే గానీ… ఆ చివరి ప్రశ్న చదవండి… కరోనా రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి… ఒక్కమాటలో… ఇదీ ప్రశ్న..! ఒక్క మాటలో చెప్పాలంటే… ఈ ప్రశ్నపత్రం రూపొందించిన నిపుణుడు ఎవరో గానీ హేట్సాఫ్… వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనగా, WHO డైరెక్టర్, ఆ సైంటిస్టులు కూడా చెప్పలేని జవాబు… అసలు ఒక్క మాటలో చెప్పడం అనేది సాధ్యమేనా..? చైనా వుహాన్‌లోని వైరాలజిస్టులు, కరోనా పేరెంటల్ సైంటిస్టులు కూడా చెప్పలేరు… అంతెందుకు, జస్ట్, పారసెటమాల్తో కరోనాను కంట్రోల్ చేస్తున్న కేసీయార్ కూడా చెప్పలేడు, గ్యారంటీ…!! ఇంకా నయం, వార్డు సభ్యుడి దగ్గర నుంచి సర్పంచి వరకూ అందరికీ ఈ ప్రశ్నలేసి, మార్కులేసి, ఫెయిలైతే అనర్హత వేటు వేయాలని చెప్పలేదు, హమ్మయ్య…!
Ads
Share this Article