ఒకరు ఒక అబద్దాన్ని పదే పదే ప్రచారంలోకి తీసుకొస్తున్నాడంటే కొన్ని కారణాలుంటయ్… 1) విషయం తెలియకపోవడం 2) తెలిసీ వక్రమార్గం పట్టించడం 3) తెలిసీ తెలియని రీతిలో ప్రత్యర్థి శిబిరం ప్రభావానికి గురికావడం……… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పెద్ద ముదురు టెంక… తనకు విషయం తెలియదు అనలేం… అన్నీ తెలుస్తయ్… కానీ వాటిని తనకు అనుకూలంగా, తనకు అనువైన రీతిలో ప్రజల మెదళ్లను ట్యూన్ చేయగలను అనుకునే వెర్రి జ్ఞానం ఒకటి తను పీడిస్తున్నది… ఆ పోకడలో తాను ప్రత్యర్థి శిబిరానికే అనుకూలంగా మాట్లాడుతున్నాననే సోయి కూడా కోల్పోతున్నాడు… నిజంగా తన బాసు చంద్రబాబు ఏ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడో తను కూడా అంతే… ఈరోజు తను రాసుకున్న కొత్త పలుకే కాదు, కొద్దిరోజులుగా షర్మిల మీద రాస్తున్న కథనాలన్నీ అంతే… ఫాఫం, ఇప్పుడు ఆర్కేను చూస్తే కోపం రావడం లేదు, జాలి కూడా వేయడం లేదు… చివరకు ఆర్కే తనకుతాను ఓ అయోమయవాస్థలోకి జారిపోతున్న తీరు కనిపిస్తోంది…
ఎంతసేపూ జగన్ జైలుకెళ్తాడు, తరువాత ఎవరు, ఇదే కుటుంబంలో చిచ్చు అనే ప్రచారంతో… జనాన్ని మిస్‌గైడ్ చేయవచ్చనే ఓ ఈనాడు మార్కు కాంక్ష తప్ప ఇంకేమీ కనిపించడం లేదు… ఆ యావలో పడి, చివరకు తను జగన్ క్యాంపు కోరుకునే ప్రచారాన్నే సాగిస్తున్నాడనీ, ఆ క్యాంపు ట్రాపులో పడిపోయాడనీ తెలుసుకోలేని అజ్ఙానం… తనేమంటాడంటే..? 1) జగన్, షర్మిల నడుమ విభేదాలున్నయ్… 2) షర్మిల కోరుకున్న పదవుల్ని జగన్ ఇవ్వలేదు కాబట్టి ఆమె తెలంగాణలో వైఎస్సార్ పార్టీ పెట్టింది… 3) దీన్ని సహించని కేసీయార్ లోటస్ పాండ్ మీదకు జేసీబీలు నడిపిస్తాడనే భయంతో గంగవెర్రులెత్తిపోయి జగన్ పదే పదే కేసీయార్‌కు సంజాయిషీలు ఇచ్చుకుంటున్నాడు… 4) రేప్పొద్దున భారతి సీఎం గాకుండా విజయమమ్మ సీఎం కావాలనేదే షర్మిల లోగుట్టు… ఏమాత్రం కామన్ సెన్స్‌తో ఆలోచించినా ఇవన్నీ ఉత్త ట్రాష్ అని సగటు రాజకీయ పరిశీలకుడు కూడా అర్థం చేసుకుంటాడు… నా అంతటి మేధోజర్నలిస్టు లేడనే భ్రమల్లోకి జారిపోతున్న రాధాకృష్ణ తప్ప…
Ads
- జగన్ మీద కోపముంటే ఏపీలో పార్టీ పెట్టాలి గానీ తెలంగాణలో పెట్టడం ఏమిటి..?
- తెలంగాణలో రాజన్నరాజ్యం లేదు కాబట్టి ఇక్కడే పార్టీ పెడుతున్నాను అనేపక్షంలో ఏపీలో రాజన్నరాజ్యం ఉన్నట్టు షర్మిల సర్టిఫికెట్టు ఇస్తున్నట్టేనా..? మరిక జగన్ మీద కోపం ఏముంది..?
- షర్మిల పార్టీ మీద కేసీయార్ అసహనంతో జగన్‌ను అడుగుతున్నాడు, జగన్ ఏదో సంజాయిషీ ఇచ్చుకుంటున్నాడు అనేదే నిజమైతే… ఈరోజుకూ షర్మిల పట్ల కేసీయార్ అత్యంత సానుకూల, సహృదయ, ఉదార, సహనాన్ని ఎందుకు కనబరుస్తున్నట్టు..? జేసీబీల కేసీయార్ అనేదే నిజమైతే ఆమె పార్టీ మీద మొగ్గ దశలోనే దాడికి దిగేవాడు కాదా..?
- జగన్, కేసీయార్ నీటిపంచాయితీ అనేదే ఓ పెద్ద నాటకం… కేసీయార్ కోపమే నిజమైతే సీమ లిఫ్టు టెండర్ల దశలోనే లోటస్ పాండ్ మీదకు జేసీబీలను నడిపించకపోయేవాడా..?
- అటు జగన్ దగ్గర, ఇటు షర్మిల దగ్గర ప్రశాంత్ కిషోర్ మంతనాలు సూచిస్తున్న మర్మమేమిటి..? కేసీయార్ క్యాంపుతో కూడా పీకే టచ్‌లో ఉన్నాడనేది నిజం కాదా..?
- ఇదే రాధాకృష్ణ జాన్ జిగ్రీ రేవంతుడు కూడా పాత పీకే టీం సభ్యులతో సఖ్యతతో లేడా..? తనకు తెలియదా అసలు కథేమిటో… తను చెప్పలేదా రాధాకృష్ణకు..? మరి ఏం అర్థం చేసుకున్నట్టు..?
- పోనీ రాధాకృష్ణ క్యాంపులోనే పాత పీకే సహచరుడు రాబిన్ శర్మ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నాడు కదా, తను చెప్పలేదా పీకే అడుగుల పరమార్థం ఏమిటో..?
- అసలు సీమ లిఫ్టు లొల్లికీ, జగన్ ఇంటి లొల్లికీ లింకేమిటి..? ఇదొక మైండ్‌లెస్ యాంగిల్…
- నిజంగానే షర్మిలకు పదవుల మీద ధ్యాస, ఆశ ఉంటే, ఈ రెండేళ్లలో మౌనంగా ఎందుకు ఉన్నట్టు..? ఆమె ఎప్పుడైనా పదవుల కోసం ప్రయత్నిస్తుట్టుగా తెర మీద కనిపించిందా అసలు..? ఆమె ఒక బాణం అంతే… తనకంటూ ఏ లక్ష్యాలూ ఉండవ్, విలుకాడు ఏది చెబితే అదే…
- అన్నీ తెలిసినా సరే, జగన్, షర్మిల పంచాయితీ నిజమే అని జనాన్ని నమ్మించడానికి రాధాకృష్ణ తన రాతల ద్వారా ప్రయత్నిస్తున్నాడా..? ఐతే ఎందుకు..? షర్మిలను ఆకాశానికి ఎందుకు ఎత్తుతున్నట్టు..? పైగా వైసీపీ లీడర్లే ఆమెను కలిసి ఏపీలో కార్యాచరణ స్టార్ట్ చేయాలి అని చెబుతున్నారట… హహహ…! ఎటొచ్చీ… జగన్, కేసీయార్, షర్మిల రాజకీయాల మర్మమేమిటో అర్థం గాక జనం జుత్తుపీక్కోవడమే… రాధాకృష్ణ వంటి అప్రకటిత మేధోపాత్రికేయుల రాతలు, కూతలు అదనపు నష్టాలు…!!
- చివరగా రాధాకృష్ణకు ఓ ప్రశ్న…. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్సార్టీపీకి కూడా గౌరవాధ్యక్షురాలేనా..? ఈ చోద్యం వెనుక అసలు అర్థం బోధపడలేదా..? బోధపడీ కొత్త బాష్యాలు బోధిస్తున్నట్టా తమరు..? జనం చెవుల్లో రఫ్లీషియా పూలు ఎందుకు పెడుతున్నట్టు..?!
- ((ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్టయితే ‘ముచ్చట’కు డొనేట్ చేయండి, దిగువన బటన్ స్కాన్ చేయండి…))
Share this Article