అధికార దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి, అహాల్ని సంతృప్తిపరుచుకోవడానికి ఇక వేరే మార్గాలే లేవా..? గతంలో ఉండేది ఓ పైత్యం… ప్రభువుల వారు వస్తున్నారంటే ఆ పరిధుల్లోని బళ్లను ఖాళీ చేసి, పిల్లలను దారికిరువైపులా నిలబెట్టి చేతులు ఊపించాలి… ఎండయినా, వానొచ్చినా బేఫికర్… పిల్లలకు అదొక నరకం… ఆ స్వాగతాల్ని అందుకునే మొహాలకు అదో ఆనందం… అయ్యో పాపం అనే సోయి కూడా ఉండదు… అలా ఉంటే రాజకీయ నాయకులు ఎలా అవుతారులే… ఇది కూడా అంతే… యాక్టింగ్ ప్రభువుల వారు, కాబోయే ప్రభువుల వారు, ప్రస్తుతం రాచకుమారులుంగారు శ్రీమాన్ కేటీయార్ గారు విచ్చేస్తున్నారనగానే… అక్కడి అధికారగణం, అనగా సాగిలబడే భృత్యగణం… అర్జెంటుగా అంగన్వాడీ వర్కర్లను తరలించారు… తలా ఓ మొక్క ఇచ్చారు, రోడ్డు పక్కన నిలబెట్టారు… సారు గారు తన రాజవాహన శ్రేణితో ఆ బాట వెంబడి వెళ్తుంటే వీళ్లు ఆ మొక్కల్ని చూపిస్తూ దండాలు పెట్టాలి… ఇంకా ఏ కాలంలో ఉన్నారు మన పాలకులు..? మన అధికారులు..? కావచ్చు, మన కేసీయారుడు పదే పదే మెచ్చుకునే నిజాం కాలంలో ఉండేదేమో… మళ్లీ ఆ వైభవంలోకి తీసుకెళ్తున్నారు… భేష్…
అసలు అధికార పార్టీ వాళ్ల మీటింగులు ఏం జరిగినా ఫస్ట్ బలయ్యేది డ్వాక్రాలు, అంగన్వాడీలు… రావల్సిందే… చప్పట్లు కొట్టాల్సిందే… అసలు ఈ కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకోవడాలు, అంగన్వాడీ వర్కర్లతో మొక్కల స్వాగతాలు చెప్పించుకోవడాలతో నిజంగా ఒరిగేదేమిటి..? కాళ్లు మొక్కాలని కేసీయార్ కలెక్టర్లకు చెప్పాడా..? అంగన్వాడీ వర్కర్లను రోడ్డు పక్కన నిలబెట్టించాలని కేటీయార్ చెప్పాడా..? అనేవి వృథా సమర్థనలు… జనం అలా రిసీవ్ చేసుకోరు… ‘‘బాగా ఎక్కువైంది’’ అనే భావిస్తారు… Vulgar exhibition of power is always harmful… ఈ విషయం ఇంకా కేటీయార్‌కు అర్థం కాదేమో… రాజకీయాల్లో చాలా తాకులు తిన్న కేసీయార్‌కు తెలియదా..? మరి ఎవరో అధికారులు చేసిన పనికి వాళ్లనెందుకు నిందించడం అనేది మరో వాదన…
Ads
అత్యుత్సాహం చూపే ఒక్క అధికారి తోక కత్తిరిస్తే అందరూ తొవ్వకొస్తరు… కానీ నువ్వు ఆ పనిచేయడం లేదంటే పరోక్షంగా ఎంకరేజ్ చేసినట్టే… ఈ పనికిమాలిన చేష్టల్ని ఎంజాయ్ చేస్తున్నట్టే లెక్క… నిజమైనా కాకపోయినా జనం అలాగే పరిగణిస్తారు… ఐనా ఈ అంగన్వాడీ మొక్కలు, దండాల ప్రదర్శనతో దొరవారి మెప్పు పొందాలనుకున్న అధికారి ఎవరో కానీ, తను ఏ లోకంలో బతుకుతున్నాడో కానీ, సరైన అవగాహన లేనట్టుంది… ఇలాంటి ప్రదర్శనల్ని కాన్వాయ్‌లో ఉన్న సారు గారు చూస్తారా..? చూసినా సరే, ఏమోయ్, భలే రాజభక్తిని ప్రదర్శించావోయ్ అని భుజం తట్టి ప్రశంసిస్తాడా..? సరే, తెలంగాణలో కలెక్టర్లు చివరకు ఎలా మారిపోయారో మనం సిద్దిపేట, కామారెడ్డి ఉదాహరణల్ని చూస్తున్నాం కదా… ఈ ఏరియా కలెక్టర్‌కు కూడా అభినందనలు… మెయిన్ స్ట్రీమ్‌లో కలిసినందుకు..!! చివరగా :: ఆ మహిళల్ని కూడా యూనిఫామ్ చీరెలతో నిలబెట్టించారు…!!
Share this Article