నిష్పాక్షిక మీడియా అంటూ ఏం సచ్చింది గనుక… టీవీ, పత్రిక… ప్రతిదీ ఏదో ఓ భజనసంఘమే కదా… భజన సైట్లు మరీ దరిద్రం, ఆమధ్య సెక్యులర్ అనే ముసుగు ఉండేది, ఇప్పుడు నిజ కులస్వరూపం ప్రదర్శిస్తూ రెచ్చిపోతున్నయ్… సారీ, ట్యూబ్ చానెళ్ల గురించి అడగొద్దు… ఇక పార్టీల అనుబంధ విభాగాలుగా వర్ధిల్లే పత్రికలు, టీవీలయితే చెప్పనక్కర్లేదు… సుప్రభాతం దగ్గర్నుంచి రాత్రి నిద్రపుచ్చే పాట దాకా… ప్రతిదీ ఓ కీర్తనే… ఐతే… ఇదొక కళ… అది కూడా చేతకానివాళ్లు ఉన్నారంటేనే ఆశ్చర్యం వేస్తుంది… నమస్తే తెలంగాణ పత్రిక చూడండి, టీన్యూస్ చూడండి, క్రిస్టల్ క్లియర్ పాలసీ… కేసీయార్ తప్ప ఇంకేమీ కనిపించకుండా పరుగు తీస్తూనే ఉంటయ్, చూసేవాడు చూస్తాడు, చదివేవాడు చదువుతాడు… పిసరంత కూడా ఆ లైన్ తప్పరు… ఆంధ్రజ్యోతి పైకి ఏం ముసుగు వేసుకున్నా సరే, నేను ముసుగు వేసుకున్నాను, నేను తటస్థంగా కనిపిస్తాను అని తాను అనుకుంటుంది కానీ… జనమందరికీ తెలుసు, అది ప్యూర్ తెలుగుదేశం లైన్, చంద్రబాబు లైన్, ‘ఆంధ్రా’జ్యోతి అది… ఈనాడు ఇంకాస్త న్యూట్రల్‌గా కనిపించాలని తెగ ఆయాసపడుతూ ఉంటుంది… కానీ జనానికి కూడా అదేమిటో తెలుసు… సాక్షి, అదీ ప్యూర్ వైసీపీయే… కానీ దానికి ఓ డైరెక్షన్ లేదు, అది నిజంగా జగన్ లైన్‌లో పోతుందా అనేది వైసీపీ క్యాంపుకే అర్థం కాదు… ఫాఫం, జగన్ ఎప్పుడూ తలపట్టుకునే వ్యవస్థ అది… ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే….
నిన్న మూడు పేజీలు ఓ అంశం మీద కుమ్మేసింది… పేరు కృష్ణా తులాభారం… పేజీనేషన్ బాగుంది, గ్రాఫిక్స్ బాగున్నయ్, టేబుల్స్ బాగున్నయ్… రాసిన రిపోర్టర్లూ సాగునీటి మీద అవగాహన ఉన్నవాళ్లే… కావల్సినంత స్పేస్ తీసుకున్నారు… కానీ ఎటొచ్చీ మొత్తం చదివితే ఇంతకీ ఆ పత్రిక ఏం చెప్పాలనుకుంటుందో బోధపడలేదు… పోనీ, మనమంటే సాగునీటి సబ్జెక్టు తెలియని పామరులం, అర్థం కాలేదు అనుకుందాం… కానీ నిన్నటి నుంచీ ఆ ఆర్టికల్ చదివిన ‘బుద్ధిజీవులు’ కూడా కొందరు జుత్తు పీక్కుంటూ కాల్స్ చేస్తున్నారు, బాసూ, నీకేమైనా అర్థమైందా అని…! అసలు వాళ్ల లైన్ ఏమిటి..? ఏం చెప్పాలనుకున్నారు..? ఇది తేలాలంటే రెండు ట్రిబ్యునళ్లు అవసరమేమో… రాయడంలో తప్పు లేదు, రాసిన అంశాల్లో తప్పుల్లేవు… కానీ క్రక్స్ ఏమిటో చెప్పలేకపోవడంతో ఆ మూడు పేజీలూ ఓ వృథా ప్రయాసగా మిగిలిపోయింది… సబ్జెక్టు, వర్తమాన వివాదం తెలిసిన ఓ మంచి సబ్‌ఎడిటర్ డీల్ చేయాల్సింది… ఎలాగూ పెద్దలకు ఏమీ తెలియదు కదా…
Ads
సాక్షి జగన్ పత్రిక, జగన్ ఏపీ సీఎం… తెర వెనుక సంగతి పక్కన పెడదాం… తెరపై మాత్రం తెలంగాణ వైఖరి మీద కస్సుమంటున్నాడు… సీమ లిఫ్టు కట్టితీరతాను అంటున్నాడు… పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని డబుల్ చేస్తాను అంటున్నాడు, తెలంగాణ శ్రీశైలం 800 అడుగుల కనీసనీటిమట్టం దగ్గర నీళ్లు తోడుకునే సౌలభ్యాన్ని అనుభవిస్తున్నప్పుడు, నేనెందుకు ఆ మట్టం నుంచి నీళ్లు తీసుకోవద్దు అనడుగుతున్నాడు… మా సీమ ప్రయోజనాల మాటేమిటి అంటున్నాడు… నీ జలవిద్యుదుత్పత్తితో నాకు నష్టం వాటిల్లుతోంది అని రుసరుసలాడుతున్నాడు… ఏపీ సీఎంగా అది తన లైన్, తను సమర్థించుకునే లైన్… అఫ్ కోర్స్, తెలంగాణకూ ఓ వాదన ఉంటుంది… ఓ సమర్థన ఉంటుంది… ఈ స్థితిలో రెండింటి సమతూకమూ సాక్షి వంటి మీడియా సంస్థకు కుదరదు, ఆ హెడ్డింగులో చెప్పినట్టు తులాభారం సరిపోదు… దాని లైన్ జగన్ లైనే… కానీ ఏపీ, తెలంగాణ ప్రయోజనాలన్నీ కలిపి, ఒకే కథనంలో కుట్టేయాలనుకోవడంలోనే తప్పు జరిగిపోయింది… అబ్బే, మేం తీర్పులు చెప్పడానికి కాదు రాసింది, సబ్జెక్టు రాశాం అనడానికి లేదు, కృష్ణాజల వివాదం రగులుతున్నవేళ, రాష్ట్రాలు బాణాలు విసురుకుంటున్నవేళ… గట్టు మీద కూర్చుకుంటాను అనడం ఇతర మీడియా సంస్థలకు వోకే, కానీ సాక్షికి కుదరదు… ఎందుకంటే అది జగన్ పత్రిక కాబట్టి… భిన్నంగా పోవడం తనకుమాలిన ధర్మం కాబట్టి… పోనీ, నిష్పాక్షికత అనే ఫోజు పెట్టాలనుకుంటే… పేజీల నిండా వైసీపీ అక్షర ‘పరిమళాలే’ కదా… మరిక న్యూట్రల్ ముసుగు ఎలా సాధ్యం..? సార్, పోతేపోయింది, ఈసారి ఆరు పేజీలు కుమ్మేయండి.., కానీ కాస్త మీరు ఏం చెప్పదలుచుకున్నారో కాస్త క్లారిటీ ఇవ్వండి, దానికి ముందు మీ లైన్ ఏమిటో, మీ బాట ఏమిటో మీరైనా కాస్త క్లారిటీ తెచ్చుకొండి… అంతే…!
Share this Article