ఒక్కసారిగా విస్మయం ఆవరించింది… దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లేదా పురస్కారం నటుడు సుమన్‌కు ప్రకటించడం ఏమిటి..? కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ ప్రకటనా రాకముందే ఫాల్కే మనమడు చంద్రశేఖర్ అవార్డును అందజేయడం ఏమిటి..? తెలుగు మెయిన్ మీడియా సైట్లు కూడా చకచకా రాసేసుకుని, చంకలు గుద్దుకోవడం ఏమిటి..? ఐనా ఈ సంవత్సరం రజినీకాంత్‌కు కదా దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించింది… మరి సుమన్ ఎలా వచ్చాడు మధ్యలోకి..? భారతీయ సినిమా పితామహుడిగా చెప్పుకునే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ఇండస్ట్రీలో ఔట్ స్టాండింగ్ సర్వీస్ ఇచ్చినవాళ్లకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటిస్తుంటుంది… ఇవి జాతీయ సినిమా అవార్డుల్లో ఓ భాగం… ఒక్కసారి ఈ ఫోటో చూడండి… లెజెండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు_2021 అని రాసి ఉంది ఫ్లెక్సీపై… ఒక్కరైనా ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారా ఆ ఫోటోలో..? అంటే అర్థమైందా మీకు ఏమైనా..?
సినిమా ఇండస్ట్రీకి సంబంధించి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు భారతరత్నతో సమానం… 2019 రజినీకాంత్, 2018 అమితాబ్ బచ్చన్, 2017 వినోద్ ఖన్నా, 2016 దర్శకుడు కె. విశ్వనాథ్… ఇలా వెనక్కి వెళ్లేకొద్దీ భారతీయ సినిమాకు ఎక్సలెంట్ సర్వీస్ అందించిన అతిరథమహారథులను ఎంపిక చేసిన తీరు కనిపిస్తుంది… అది ఇండస్ట్రీలో ఎవరికైనా అతి గొప్ప గర్వకారణం… ఆ అవార్డు బహూకరణ కూడా ప్రభుత్వం ఓ రేంజిలో జరుపుతుంది… అధికారికంగా, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఆ అవార్డును బహూకరిస్తారు… ఉదాహరణకు అమితాబ్ బచ్చన్ ఆ పురస్కారాన్ని తీసుకుంటున్న ఈ ఫోటో చూడండి… గుర్తించారు కదా… ఏకంగా రాష్ట్రపతి అందిస్తున్నాడు… అదీ ఆ అవార్డు రేంజ్…
Ads
మరి సుమన్‌కు వచ్చిన అవార్డు ఏమిటి..? ఏమో… ఆ అవార్డు ఇచ్చినవాళ్లే చెప్పాలి… ఆమధ్య హిందుస్థాన్ టైమ్స్‌లో ఓ వార్త వచ్చింది… దాదాసాహెబ్ ఫాల్కే పేరిట రకరకాల అవార్డులు ఇస్తున్నారు అని… దాదాసాహెబ్ ఫాల్కే ఎక్సలెన్స్ అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫౌండేషన్ అవార్డు వంటి పేర్లతో ఎవరెవరో ఎవరెవరికో అవార్డులు ఇచ్చేస్తున్నారు, అది అంతులేని గందరగోళానికి దారితీస్తోంది అని… దీనిపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతినిధులు కూడా ఏమీ చర్యలు తీసుకోలేమని చేతులెత్తేశారు… ఇప్పుడు సుమన్‌కు ఇచ్చిన అవార్డు ‘లెజెండ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’… ఈ అవార్డుల్ని ఇచ్చే సంస్థ ఎవరో మరి..? 2020లో సందీప్ కుమార్ దే అనే ఫిలిమ్ క్రిటిక్ కమ్ వాయిస్ ఓవర్ ఆర్టిస్టుకు ఇచ్చారు… వాళ్లిష్టం… ఓ అప్రెసియేషన్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు… సంతకం పెట్టింది ఎవరో తెలుసా,.? చూడండి…
డైరెక్టర్ కృష్ణ చౌహాన్ అట… బహుశా వీటిని స్పాన్సర్ చేస్తున్న కేసీఎఫ్ సంస్థకు డైరెక్టర్ కావచ్చు… ఏమిటీ కేసీఎఫ్ అని జుత్తుపీక్కోకండి… దాని ఫుల్ ఫామ్ కృష్ణ చౌహాన్ ఫౌండేషన్… ఇప్పుడు అర్థమైందా..? అసలు ఒక ఫిలిమ్ క్రిటిక్ కమ్ వాయిస్ ఓవర్ ఆర్టిస్టుకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఊహించగలమా..? కానీ కేసీఎఫ్ వాడు ఇచ్చేస్తాడు… అయితే ప్రభుత్వం నుంచి ఏ ప్రకటన లేకుండా, ఏ ఫంక్షనూ లేకుండా సుమన్‌కు ఫాల్కే అవార్డును ఎలా ఇస్తారనే బేసిక్ సందేహం రాలేదా ఈనాడు, జ్యోతి ఎట్సెట్రా సైట్లకు..? వాళ్లే కాదు, పెద్ద పెద్ద పేరున్న సైట్లూ ఆ వార్తను కుమ్మి పారేశాయి… రాస్తే రాశాయి, కానీ పాఠకులకు ఇది ఓ ప్రైవేటు సంస్థ ఇచ్చే అనుకరణ అవార్డు అనే క్లారిటీ ఐనా ఇవ్వాలి కదా…. ఏమున్నర్రా భయ్..?!
Share this Article