మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ ఛైర్మన్, వైఎస్ వీరానుచరుడు గోనె ప్రకాష్‌రావు ధాటిగా మాట్లాడగలడు… టీవీ డిబేట్లలో కూర్చుకుంటే ఎదుటివాడిని గుక్కతిప్పుకోనివ్వడు… కానీ చాలాకాలంగా అసలు రాజకీయ తెర మీద లేడు… అసలు రాజకీయాల్లోనే లేడు… ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఇలాంటి నేతలు చాలామంది కనుమరుగయ్యారు, అందులో విశేషం ఏమీ లేదు… ఇప్పుడు హఠాత్తుగా తెర మీదకు వచ్చి ధూంధాం అంటున్నా సరే, పెద్దగా సాధించగలిగేది కూడా ఏమీ లేదు… వయోభారం గురించి కాదు, అప్పటి పాలిటిక్స్‌కూ ఇప్పటికీ తెలంగాణ రాజకీయాల డైనమిక్సే మారిపోయినయ్… ఐతే కేసీయార్ మీద, ఆయన కుటుంబం మీద గట్టిగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు అకస్మాత్తుగా… ఎందుకో తెలియదు… జగన్ వైఎస్ విధేయుల్లో చాలామందిని దూరం పెట్టాడు… మరి గోనె సంగతేమిటి..? షర్మిల పార్టీలో చేరి, యాక్టివ్ కావాలని అనుకుంటున్నాడా..? అసలు అన్నింటికీ మించి మళ్లీ ‘ఈనాడు’ మీద పడ్డాడు ఎందుకు..? కేసీయార్‌ను ఇరుకునపెట్టడానికా..? ఈనాడును బజారుకు లాగడానికా..?
వైఎస్ అప్పట్లో ఈనాడు జవసత్వాలు పిసికేయడానికి మార్గదర్శి మీదకు ఉండవల్లిని ప్రయోగించాడు… రామోజీ ఫిలిమ్ సిటీ భూబాగోతాలపై పలు దర్యాప్తులు చేయించాడు… ఒక దశలో ఈనాడు గ్రూపు షేక్ అయిపోయింది… అప్పట్లో ఈనాడు మీద చెడామడా విమర్శలు చేసిన బ్యాచులో గోనె కూడా ఉన్నాడు… కానీ ఇప్పుడు మళ్లీ ఈనాడు ఎందుకు టార్గెట్ అయ్యింది..? తను తాజాగా ఓ బహిరంగ లేఖ రాశాడు… సహజంగానే వేరే మీడియా ఏదీ పట్టించుకోలేదు… యెల్లో మీడియాకు అది కనిపించదు… సాక్షికి గోనె అనే కేరక్టరే అక్కర్లేదు… పింక్ మీడియాకు అది వార్తే కాదు, అవసరమైతే ఖండఖండాలుగా నరుకుతుంది… అందుకని అది పెద్దగా చర్చకు దారితీయలేదేమో… అయిదారు పేజీల ఆ లేఖలో కొన్ని వాక్యాలు ఇంట్రస్టింగుగా ఉన్నయ్… అవేమిటంటే..?
Ads
2008లో ప్రభుత్వం ఫిలిమ్ సిటీ పరిసరాల్లోని 14.3 ఎకరాల భూమిని పేదలకు ఇచ్చింది… 4 గ్రామాలకు చెందిన 606 ఇళ్లపట్టాలు కూడా పంపిణీ చేసింది… ఫిలిమ్ సిటీని దెబ్బతీయడమే అప్పట్లో వైఎస్ ఉద్దేశం, అది అందరికీ తెలుసు… అయితే ఈరోజుకూ అవి అలాగే వాళ్ల పేరిటే ఉన్నాయని గోనె చెబుతున్నాడు… ఆ భూముల్లోకి ఫిలిమ్ సిటీ యాజమాన్యం పోనివ్వడం లేదు… నువ్వెందుకు పట్టించుకోవడం లేదు అని కేసీయార్‌ను గోనె అడుగుతున్నాడు… అంతేకాదు, గతంలో అసైన్డ్ భూముల మీద దర్యాప్తు నివేదికలు రామోజీరావుకు వ్యతిరేకంగా వస్తే, అందులో ఇంచు కూడా అక్రమం లేదు అని కేసీయార్ సర్టిఫికెట్ ఇవ్వడం ఏమిటనేది మరో ప్రశ్న… ఓం సిటీ కోసం 300 ఎకరాలు ఇచ్చినవ్, రామోజీయే ఆ ప్రాజెక్టును రద్దు చేసుకున్నాడు, మరి ఆ భూమిని ఎందుకు వాపస్ తీసుకోవడం లేదనేది ఇంకో ప్రశ్న… ఫిలిమ్ సిటీ నడవడం లేదు, వాళ్లే రియల్ ఎస్టేట్ చేయబోతున్నారు, ఓ రోడ్డుకు అక్రమంగా గేట్లు కట్టి, రాకపోకల్ని అడ్డుకుంటున్నారు అనేది మరో విమర్శ…
సరే, కేసీయార్ కోణంలో చూస్తే… తను ఆంధ్రా వాళ్ల కాళ్లల్లో ముళ్లు విరిగితే తన పంటితో పీకాలి… కాబట్టి ఫిలిమ్ సిటీ జోలికి పోడు…! అంతటి రామోజీయే తనకు అణిగిమణిగి ఉంటున్నప్పుడు.., భయభక్తులతో వ్యవహరిస్తున్నప్పుడు ఇక కక్షసాధింపు దేనికి..? అనేకానేక కారణాల రీత్యా ఆంధ్రా పెట్టుబడిదార్ల జోలికి పోడు తను… సో, కేసీయార్ ఇవన్నీ లైట్ తీసుకుంటాడు… గోనె ఆరోపిస్తే అసలు చెవిలోనికే పోనివ్వడు… ఐతే ఇళ్లస్థలాలు పొందిన వాళ్లు కోర్టుకు వెళ్తే..? 13 ఏళ్లయింది, మాకు ప్రభుత్వం పొజిషన్ ఇవ్వడం లేదు, ఆ భూమి చూపించడం లేదు అని పిటిషన్లు వేస్తే… ఫిలిమ్ సిటీ ఇరుకునపడుతుందా..? ప్రస్తుతానికి రామోజీకి వ్యతిరేకంగా వెళ్లే పార్టీ ఏమీ లేదు తెలంగాణలో… ఎవరైనా ఉన్నా ఘర్షణకు దిగే మూడ్‌లో ఆయన లేడు… నిజంగానే లబ్దిదారులు కోర్టుకు వెళ్తే కేసీయార్ ప్రభుత్వం ఏం చేస్తుంది..?! ఎవరి పక్షాన నిలబడుతుంది..?!
Share this Article