ఆయన పేరు చారి… తన స్వస్థలం మన మహబూబ్‌నగర్… అప్పట్లో ఉస్మానియా యూనివర్శిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్‌గా చేసేవాడు… తక్కువ వయస్సులోనే కన్నుమూశాడు… ఆయన కొడుకు పేరు శ్రీనివాసచారి… కష్టమైనా సరే, ధైర్యంగా శ్రీనివాసచారిని తల్లి, అత్త పెంచారు, చదివించారు… ఉస్మానియా యూనివర్శిటీ కాలేజీలో ఇంజనీరింగ్ చేశాడు… సక్సెస్ కోసం వెతుకులాటలో… చదువు అయిపోగానే అమెరికా వెళ్లాడు… అమెరికా వస్తాననే ఇంట్రస్టు చూపించిన చాలా మంది బంధువులకు, స్నేహితులకు సాయం చేశాడు… అయోవాలోని సెడార్ ఫాల్స్‌లో ఉండేవాడు… పెగ్గీ ఎగ్బర్ట్ అనే అమెరికన్‌ను అక్కడే పెళ్లి చేసుకున్నాడు… ఆమె నర్స్, తరువాత టీచర్ అయ్యింది… వాళ్లకు పుట్టినవాడే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథానాయకుడు… పేరు రాజా జాన్ వుర్పుటూర్ చారి… అలియాస్ చారి… చారి అనే పిలుద్దాం… ఇంతకీ ఈ చారి గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… బండ్ల శిరీష గురించి చెప్పుకుంటున్నాం కదా… ఈ చారి గుర్తొచ్చాడు… కాలం అనుకూలిస్తే చాలారోజుల క్రితమే మనం చారి గురించి కూడా ఘనంగా చెప్పుకునేవాళ్లం… అదింకా బాకీ ఉంది… చెప్పుకోవాల్సి ఉంది… ఆ కథ ఏమిటంటే..?
ఎస్… పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తే మన కథానాయకుడు చారి… తనకు చిన్నప్పటి నుంచే ఖగోళం, ఆకాశం అంటే ఇంట్రస్టు… చదువుతున్నప్పుడూ అదే… ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో చేరాడు… ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ సైన్స్ సబ్జెక్టుల్లో డిగ్రీ పొందాడు… తరువాత ఫెలో షిప్… మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ఆస్ట్రోనాటిక్స్, ఏరోనాటిక్స్‌లో మాస్టర్స్ చేశాడు… మాస్టర్స్ అయిపోయాక అండర్ గ్రాడ్యుయేట్ పైలట్ ట్రెయినింగ్… తరువాత ఎయిర్‌ఫోర్స్‌లో చేరిక, క్రమేపీ కల్నల్ స్థాయి దాకా… ఇరాక్ వార్ తదితర ఆపరేషన్లలోనూ పాల్గొన్నాడు… తను NASA SpaceX Crew-3కు కమాండర్‌గా ఎంపికయ్యాడు… అది అంతరిక్షంలోని అంతర్జాతీయ స్పేస్ సెంటర్‌కు వ్యోమగాముల్ని తీసుకెళ్లాలి… అంతేకాదు, నాసా ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌లో కూడా తను గ్రాడ్యుయేట్… అందుకని అమెరికా ఆలోచించే చంద్రుడి సంబంధ ఆపరేషన్లకూ అర్హుడు… ఎలాగూ అమెరికా 2024లో ఒక మహిళను, ఒక పురుషుడిని చంద్రుడి మీదకు పంపించాలని అనుకుంటోంది… సో, నాసా ఖగోళ ఆపరేషన్లకు పర్ఫెక్ట్లీ ఫిట్ కేరక్టర్ మన చారి…
Ads
నిజానికి 2020 అక్టోబరులో స్పేస్ఎక్స్ క్రూ-3 ఆపరేషన్ స్టార్ట్ కావల్సింది… వాయిదా పడుతూ వస్తోంది… షెడ్యూల్ ప్రకారం జరిగి ఉంటే… రాకేష్ శర్మ తరువాత రెండో భారతీయ వ్యోమగామి అని ఘనంగా వార్తలు రాసుకునేవాళ్లం… అఫ్ కోర్స్, కొన్నాళ్లు ఆగితే రాసుకుంటాం… కుందాం… ఏమో, చంద్రుడి మీదకూ వెళ్తాడేమో… అర్థమైంది కదా, మన చారి… ఏ వెయిటింగులో ఉన్నాడో… దటీజ్ చారి… తను కూడా తండ్రిలాగే అమెరికన్నే పెళ్లి చేసుకున్నాడు… ఆమె పేరు హోలీ షాఫ్టర్… ఆమె కూడా సెడార్ ఫాల్స్ నేటివే… ఇద్దరూ ఇప్పుడు హూస్టన్‌లో ఉంటారు… ముగ్గురు పిల్లలు… హైదరాబాద్‌కు మూడుసార్లు వచ్చాడు… బంధువులున్నారు… తన రూట్స్ మీద తనకు సోయి, ప్రేమ ఉన్నవాడే… తను వేచిచూస్తున్న తరుణం రానివ్వండి… మళ్లీ చెప్పుకుందాం… ఇంకా ఘనంగా… ఆల్ ది బెస్ట్ చారీ..!! (స్టోరీ మీకు నచ్చితే ‘ముచ్చట’కు ఆర్థికంగా అండగా నిలవండి)…
Share this Article