నిజంగా ఇంట్రస్టింగు వార్తే… రీసెంట్ వార్తే… ఢిల్లీ నుంచి చెన్నైకి ఓ విమానం బయల్దేరబోతోంది… ఒకాయన వచ్చి మొదటి వరుస సీట్లలో ఆసీనుడయ్యాడు… కాసేపటికి మాస్క్ ధరించిన కెప్టెన్ వచ్చాడు… ‘‘బోర్డింగ్ అయిపోయింది, ఇక బయల్దేరదాం… మీ అందరినీ క్షేమంగా చెన్నైకి తీసుకెళ్లడం నా బాధ్యత… రిలాక్స్‌గా కూర్చొండి’’ అని సహజంగానే విమానం బయల్దేరేముందు చెప్పే మాటలు చెప్పాడు… రెడీ టు టేకాఫ్… సదరు కెప్టెన్ మాటలు వింటుంటే బాగా పరిచయం ఉన్న గొంతులా ధ్వనిస్తోంది, కానీ ఈ కెప్టెన్ ఎవరో నాకు పరిచయం లేడు కదా, అసలు ఎవరబ్బా ఈయన అని ఆ ముందు వరుస ప్రయాణికుడు ఆశ్చర్యపోతున్నాడు… ఆలోచిస్తున్నాడు… ఆ పైలట్ తన దగ్గర దాకా వచ్చి ‘‘ఏమిటీ, ఇంకా నన్ను గుర్తుపట్టడం లేదా’’ అనడిగాడు… ‘‘ఎంత చించుకున్నా గుర్తురావడం లేదు, గొంతు చిరపరిచితమే, ఆ మాస్క్ తీస్తే ఎవరో చెబుతాను’’ అన్నాడు ఆ ప్రయాణికుడు నవ్వుతూ… ఆ పైలట్ మాస్క్ తీశాడు… ‘‘అరెరె, మీరేనా..? ఏమిటిది..? మీరేమిటి పైలట్‌గా, కెప్టెన్‌గా… నాకేమీ అర్థం కావడం లేదు’’ అని ఆశ్చర్యంతో అడిగాడు…
ఆ ప్రయాణికుడు ఎవరో కాదు… డీఎంకే ఎంపీ దయానిధి మారన్… ఆ కెప్టెన్ కూడా పార్లమెంట్ సభ్యుడే, పేరు రాజీవ్ ప్రతాప్ రూడీ… బీజేపీ అధికార ప్రతినిధి, మాజీ కేంద్ర మంత్రి… నిజానికి ఇద్దరూ రెండు గంటల ముందే ఎస్టిమేట్స్ కమిటీ సభ్యులుగా చాలాసేపు చర్చల్లో ఉన్నారు… కానీ ఎంపీగా రూడీ వేషధారణ వేరు… అది విప్పేసి, ఎయిర్‌లైన్స్ కెప్టెన్ డ్రెస్ ధరిస్తే ఎవరూ అంత త్వరగా గుర్తుపట్టలేరు… అదీ జరిగింది… దయానిధి మారన్ ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు సరికదా… సాధారణంగా తన భావాల్ని పెద్దగా బయటికి వ్యక్తీకరించే అలవాటు లేని ఆయన ఏకంగా తన లెటర్ హెడ్ మీద మరిచిపోలేని విమాన ప్రయాణం అంటూ ఓ లేఖను విడుదల చేశాడు… ఇది జరిగింది జులై 13, 2021 అంటే మంగళవారం… ఢిల్లీ నుంచి చెన్నై ప్రయాణించిన ఇండిగో విమానానికి రూడీ కెప్టెన్‌గా వ్యవహరించారు…
Ads
అవునూ, ఎంపీ ఏమిటి..? కెప్టెన్ ఏమిటి..? అనే కదా మీ సందేహం… బీఏ ఆనర్స్తోపాటు న్యాయవిద్య కూడా చదువుకున్న రూడీ లైసెన్స్డ్ పైలట్ కూడా… కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉంది… ఇండిగో ఎయిర్‌బస్-320 నడిపి, కమర్షియల్ ఫ్లయిట్ నడిపిన ఏకైక ఎంపీగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి కూడా ఎక్కాడు… అప్పుడప్పుడూ ఇండిగో ఫ్లయిట్లలో అకస్మాత్తుగా పైలట్‌గా మారిపోతుంటాడు… ఇప్పుడు జరిగిందీ అదే… ఢిల్లీ టు చెన్నై ఫ్లయిట్‌కు పైలట్ అయ్యాడు… దయానిధి మారన్‌ను తన కెప్టెన్ వేషధారణలో పలకరించాడు… నిజానికి వీళ్లిద్దరూ ఒకరికొకరు బాగా పరిచయస్తులు… ఇప్పుడు ఎస్టిమేట్స్ కమిటీలో సహసభ్యులే కాదు… దయానిధి తండ్రి మురసోలి మారన్ కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రూడీ సహాయమంత్రిగా అదే శాఖకు పనిచేశాడు… బాగుంది… రాజకీయాల్లో ఉన్నంతమాత్రాన తమ పాత వృత్తుల్ని, ప్రవృత్తుల్ని మొత్తంగానే మరిచిపోవాల్సిన పనేముంది..? రూడీ అలా చేయలేదు… ఎప్పుడో ఓసారి అలా తన పాత జీవితంలోకి వెళ్లిపోతుంటాడు… ఇండిగో కూడా ఆయన సర్వీస్‌ను గౌరవిస్తూ ఉంటుంది… తను కాస్త డిఫరెంటే… ఇద్దరు పిల్లల్లో పెద్ద బిడ్డ లాయర్, పోలో ప్లేయర్… చిన్న బిడ్డ కూచిపూడి డాన్సర్… స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి కేంద్ర మంత్రి దాకా ఎదిగిన కొద్దిమందిలో రూడీ ఒకరు…!!
Share this Article