.
ఒక ధన్‌రాజ్… జబర్దస్త్ కమెడియన్ కమ్ సినిమాల్లోనూ కమెడియన్… దర్శకుడయ్యాడు, ప్చ్, నో సక్సెస్… ఒక అదిరె అభి… తనూ జబర్దస్త్ కుటుంబం నుంచే వచ్చిన కమెడియన్… దర్శకుడయ్యాడు, త్వరలో ఓ సినిమా విడుదల, ఫలితం చూడాలి… జబర్దస్త్ చాలామందికి సినిమా ఇండస్ట్రీలోకి మార్గం చూపిస్తుంది…
బలగం వేణు మాత్రం తన మొదటి సినిమాతోనే దర్శకుడిగా హిట్… రెండో సినిమా ఎల్లమ్మకు ఈరోజుకూ ఇంకా పూర్తి మోక్షం లేదు… ఇలా జబర్దస్త నుంచి వచ్చిన దర్శకులు కిందామీదా పడుతున్నారు, మరో కమెడియన్ మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడు… కాదు, పట్టుకున్నాడు కూడా…
Ads
సరే, ఎవరి అదృష్టం ఎలా ఉందో… ఎవరెవరో వస్తుంటారు, పోతుంటారు జబర్దస్త్‌లోకి… కానీ కమెడియన్‌గా, టీమ్ లీడర్‌గా రాఘవ దాన్నే అంటిపెట్టుకుని ఉన్నాడు… సక్సెస్ కూడా… కానీ దర్శకుడిగా..? చూడాలిక…
ఒక సుడిగాలి సుధీర్ హీరో అయ్యాడు… ఒక హైపర్ ఆది, గెటప్ శ్రీను తదితరులు సినిమాల్లో వేషాలు సంపాదించుకుంటున్నారు… ఆది కథ వేరు… తను జనసేన యాక్టివిస్టు… ఐనా పాడిబర్రె వంటి ఈటీవీ మాత్రం వదలడు… తెలివైనోడు… జబర్దస్త్ నుంచే వెళ్లిన అనసూయ పూర్తి స్థాయి నటిగా మారిపోయింది… రష్మికి అప్పుడప్పుడూ అవకాశాలు వస్తుంటాయి…
మరి రాఘవ..? బుల్లితెరపై తనదైన శైలి డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్‌తో ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న తను ఇప్పుడు ఎలాంటి ముందస్తు హడావుడి లేకుండా ఒక పూర్తి స్థాయి సినిమాను తెరకెక్కించాడట… ఈ చిత్రానికి ‘అలా అలా జరిగిందా?’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు…
ఇందులో యువ నటులు సాయి రోనక్, టీనా శ్రావ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారట, కొత్త వాళ్లు… బడ్జెట్ విషయంలో రాఘవ జాగ్రత్త అన్నమాట… ఈ సినిమా షూటింగ్ పనులు ఇప్పటికే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పూర్తయ్యాయి… ప్రస్తుతం చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ (నిర్మాణాంతర పనులు) కార్యక్రమాల్లో బిజీగా ఉంది… త్వరలోనే మేకర్స్ ఈ సినిమా విడుదలకు సంబంధించిన అధికారిక తేదీని ప్రకటించనున్నారు…
ఎల్లప్పుడూ తన స్కిట్లలో విభిన్న పాత్రలు వేస్తూ నవ్వించే రాఘవ.. ఇప్పుడు ఒక సినిమాను ఎలా డీల్ చేశారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది… కమెడియన్‌గా అందరినీ నవ్వించిన రాఘవ, దర్శకుడిగా ఎలాంటి భావోద్వేగాలను పండిస్తాడు? బాక్సాఫీస్ వద్ద ఈ ‘అలా అలా జరిగిందా?’ ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందనేది త్వరలోనే తేలనుంది… తను క్లిక్కయితే అదే జబర్దస్త్ నుంచి ఒకరిద్దరు కూడా కొత్తగా మెగాఫోన్ పట్టుకుంటారు!!
Share this Article