.
Subramanyam Dogiparthi … తేజ ధర్మతేజ God Father ధర్మతేజ అనే కృష్ణ డైలాగ్ ఆయన అభిమానుల చేత చప్పట్లు కొట్టించింది థియేటర్లో ఆరోజుల్లో . అండర్ వరల్డ్ డాన్ పాత్ర కృష్ణది ఈ సినిమాలో . హిందీలో బ్లాక్ బస్టరయిన ఫూల్ ఔర్ కాంటే సినిమా ఆధారంగా తీయబడింది మన వారసుడు సినిమా . హిందీలో అజయ్ దేవగన్ , మధుబాల , అరుణా ఇరానీ , జగదీప్ , అమ్రీష్ పురి ప్రధాన పాత్రల్లో నటించారు .
1993 లో వచ్చిన ఈ వారసుడు సినిమా కూడా బ్రహ్మాండంగా ఆడింది . 23 సెంటర్లలో వంద రోజుల పోస్టర్ పడింది . మట్టి పట్టుకున్నా బంగారం అయ్యే చేతులు కల నటుడు మురళీమోహన్ సమర్పణలో జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను నిర్మించారు .
Ads
కామెడీ స్కూల్ మాస్టారయిన ఇవివి ఈ ఏక్షన్ కం రొమాంటిక్ సినిమాకు దర్శకుడు . బిర్రయిన స్క్రీన్ ప్లేని తయారు చేసుకుని తెర మీదకు చక్కగా ఎక్కించారు . కృష్ణ సూపర్ స్టార్ ఇమేజిని , నాగార్జున లవర్ బాయ్ ఇమేజిని , నగ్మా గ్లామరుని అద్భుతంగా వినియోగించుకున్నారు .
MLA లు సైతం వణికిపోయే డాన్ ధర్మతేజ పాత్రలో కృష్ణ . ఆయన కొడుకు నాగార్జున . తన తల్లికి అన్యాయం చేసాడనే అపోహతో తండ్రిని ద్వేషిస్తూ ఉంటాడు . కొడుకుని దగ్గరకు తెచ్చుకోవాలని తహతహపడుతూ ఉంటాడు తండ్రి . కాలేజీ గొడవల్లో విరోధిగా మారిన శ్రీకాంత్ తండ్రి MLA నుండి కృష్ణ తన కొడుకుని కాపాడుకుంటూ ఉంటాడు .
ఆ క్రమంలో శ్రీకాంత్ ని లేపిస్తాడు కృష్ణ . దానితో రెచ్చిపోయిన MLA పాత్రలో తనికెళ్ళ భరణి మరో విలన్ శరత్ సక్సేనాతో కలిసి నాగార్జున పసిబిడ్డను కిడ్నాప్ చేస్తారు . క్లైమాక్సులో తండ్రీకొడుకులు ఏకమై విలన్లను మట్టుబెడతారు . ఆ ఘర్షణలో కృష్ణ ప్రాణాలను కోల్పోతాడు . టూకీగా ఇదీ కధ .
సినిమాకు కీరవాణి సంగీతం , నృత్య దర్శకులు తార (ఒరిస్సా) , ప్రభు దేవాల డాన్సుల కంపోజిషన్ పాటలనన్నీ హిట్ చేసాయి . సినిమా విజయానికి తోడ్పడ్డాయి . వేటూరి , వెన్నెలకంటి , భువనచంద్రలు పాటల్ని వ్రాసారు .
ధీం తనక ధీం తనక ధీం కొత్తగుంది ప్రేమ , సిలక లాగా కులుకుతుంటే , వచ్చేసింది ప్రేమ ప్రేమ డేంజర్ యమ డేంజర్ , ఛం ఛం ఛం ప్రియా మరింక నీ దయా అంటూ సాగుతాయి నాలుగు డ్యూయెట్లు నాగార్జున , నగ్మాల మీద . నగ్మాను టీజ్ చేసే సాంగ్ పాపా హల్లో హల్లో చిట్టి పాపా ఇస్తావా డేటు చాలా హుషారుగా ఉంటుంది .
సినిమా ఓపెనింగే నగ్మా ఎంట్రీ అదిరేలా తీసాడు ఇవివి . అర్ధరాత్రి 12 గంటలకు రైలు దిగి ప్లాట్ఫారం మీద , స్టేషన్లో పోర్టర్లని , రిక్షా ఆటో వాళ్ళని , చివరకు రేప్ చేద్దామని వచ్చిన రౌడీలను అదరగొట్టేస్తుంది నగ్మా . ఆ ఊపు ఊపుని సినిమా అయ్యేంతవరకు లాగించాడు ఇవివి .
కృష్ణ , నాగార్జున , నగ్మా , గీత , దేవరాజ్ , శరత్ సక్సేనా , శ్రీకాంత్ , బాలయ్య , బ్రహ్మానందం , పృధ్వీరాజ్ , బాబూమోహన్ , గుమ్మడి , తనికెళ్ళ భరణి , ఆలీ , మా గుంటూరు వాడయిన జీవా , కోట శంకరరావు తదితరులు నటించారు .
కృష్ణ అభిమానులకు సంతోషకరమైన విషయం ఏంటంటే నాగార్జునకన్నా కృష్ణే అందంగా కనిపిస్తాడు . ఇంతకుముందు చూసి ఉన్నా మరలా చూడవచ్చు . An excellent romantic , action-oriented , hilarious movie .
Share this Article