ఆయన పేరు… Gangadhara Tilak Katnam …. ప్రతి సిటిజెన్, ప్రతి రిటైర్డ్ ఎంప్లాయీ ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి… నిస్వార్థంగా సమాజ శ్రేయస్సు కొరకు పరితపించే వ్యక్తి… ఎప్పుడో ఓరోజు… రోడ్డు పక్కన నిలబడి ఉంటే, రోడ్డు మీద గుంత కారణంగా ఓ ద్విచక్రవాహనదారుడు ప్రాణాలు కోల్పోయిన విషాదాన్ని ప్రత్యక్షంగా చూశాడు… ఆ తరువాత ఆ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి బతుకు పంథాయే మారిపోయింది… తను, తన శ్రీమతి… ఒకటే పని… పొద్దున్నే రోడ్డెక్కడం, ఎక్కడ గుంత కనిపిస్తే అక్కడ ఇద్దరూ కలిసి పూడ్చేయడం… అదీ అల్లాటప్పాగా మొరమో, మట్టో నింపేయడం కాదు… తారు, కంకర… పర్‌ఫెక్ట్‌గా చేసేవాళ్లు… జీవితాన్ని సార్థకం చేసుకుంటున్న జంట… ఎంతమందికి ఈ సార్థకజీవనం లభిస్తుంది… సంకల్ప బలమో, పట్టుదలో… కొన్నేళ్లుగా చేస్తూనే ఉన్నాడు… (భర్త అడుగుజాడల్లో, ఆయన్ని అర్థం చేసుకుంటూ పనిచేస్తున్న ఆమెకు దక్కాలి ఎక్కువ క్రెడిట్స్…)
తనకు రిటైర్మెంట్ తరువాత వచ్చిన డబ్బు ప్లస్ తన పెన్షన్ డబ్బులు… అమెరికాలో ఉండే తమ అబ్బాయి పంపించే డబ్బులు… అన్నీ రోడ్డు మీద గుంతలకే…! తెలుగు మీడియా, సోషల్ మీడియా మొత్తానికీ తెలుసు వాళ్లేమిటో…. రోడ్డు మీద గుంత కనిపిస్తే 1000 రూపాయలు ఇస్తాం అని గప్పాలు కొట్టిన దరిద్రపు సర్కారీ అధికారులకు, నేతలకు చెంపపెట్టు… అఫ్ కోర్స్, అధికారులు, నేతలు అంటేనే అలా ఉంటారు కదా… వాళ్లకు డబ్బులు కావాలి… ఓ ప్రణాళిక మన్నూమశానం ఉంటే కదా… ఎడాపెడా వర్షాకాలంలో సైతం రోడ్లు వేయడం, నాలుగు రోజులకు అవి కొట్టుకుపోవడం… కేసీయార్ సర్కారు అయితేనేం, ఇంకా ఎవరుంటేనేం..? ప్రభుత్వం అంటేనే అలా ఉంటుంది కదా… టీఆర్ఎస్ భిన్నమేమీ కాదు కదా… పైగా కంట్రాక్టర్లకు డబ్బులు కావాలి… ఆ డబ్బుల్లో అధికారులు, నేతలకు వాటాలు కావాలి…. అంతా ప్రజల ఖర్మ… ఈయన నిస్వార్థ సేవ వివరాలు తెలిసిన అమితాబ్ బచ్చన్ ఆయన్ని ముంబైకి పిలిపించి మరీ ఓ కారును బహూకరించాడు… ఈమధ్య గవర్నర్ తమిళిసై కూడా సత్కరించి అభినందించింది…
Ads
ఇప్పుడు అకస్మాత్తుగా ఏదో ఇంగ్లిష్ పత్రికలో వచ్చిన ఈ వృద్ధ దంపతుల నిస్వార్థ సేవ వార్త హైకోర్టు దృష్టికి వచ్చిందట… చాలా గ్రేట్… అసలు తమ చుట్టూ ఏం జరుగుతున్నదో గమనించడమే గ్రేట్, అర్థం చేసుకోవడం గ్రేటర్… స్పందించడం గ్రేటెస్టు… ఒరేయ్, జీహెచ్ఎంసీ అధికారుల్లారా, మీకు సిగ్గుందా, మీరేం చేస్తున్నారురా అనడిగింది… ఎస్, ఖచ్చితంగా కేసీయార్ పదే పదే ప్రవచించే విశ్వనగరం అనే ఓ భ్రమాత్మక భావనకు చెంపపెట్టు… ఐనా, తన గురించి మనకు తెలిసిందేగా… వదిలేద్దాం… చినుకు పడితే వణికిపోతూ, అంధకారం, ముంపు, వరద మనం చూస్తున్నవే కదా… విశ్వనగరం అంటే ఈమాత్రం లేకపోతే ఎలా..? మన మల్లారెడ్డిలు, మన తలసానిలు మన గొప్ప పాలకులైన దురవస్థలో ఈమాత్రం అనుభవించకపోతే ఎలా..? కేసీయార్ ఘన కీర్తికిరీటాలు కదా… సంబరపడిపో దొరా… తట్టుకోలేనంత సంబరం… ఎంతసేపూ ఈటల, తొక్కాతోలూ… రాజకీయాలు, అధికారం, డబ్బులు, కంట్రాక్టులు ఇదే కదా… ఈ వయస్సులోనూ తమరి ఆలోచనల పంథా…
గుర్తుంది కదా… గత జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు వరదలు, వానలు, ముంపు… పరిహారం పేరిట గొడవ… ఎవడికి దక్కాయో, ఎవడి నోట్లో మట్టి గొట్టారో ఓ పాత కథ… టీఆర్ఎస్ అయితేనేం, బీజేపీ అయితేనేం… మళ్లీ ఎవడైనా మాట్లాడితే ఒట్టు… ఇది అంతే ఇక… రాజకీయ పార్టీ అంటేనే అంత… అది కాషాయం అయితేనేం..? అది గులాబీ వర్ణం అయితేనేం..? కడదాం, అదేదో చెరువు మీద సస్పెన్షన్ బ్రిడ్జి కట్టి విశ్వనగరమని వార్తలు రాయిద్దాం, ఆ లైట్ల వెలుతురుల్లో ధగధగ నగరం అని ప్రకటనలు వేయిద్దాం… మన జబ్బలు, మన చంకలు మనమే చరుచుకుందాం… ఇప్పుడు హైకోర్టు ఏమంటోంది..? మరి గుంతల సంగతేమిట్రా అనడుగుతోంది..? నిజంగానే సిగ్గులేని నగరపాలన… అసలు నగరపాలన ఎలా ఉండకూడదో చెప్పేందుకు ప్రబలమైన ఉదాహరణ… ఏదీ, మళ్లీ ఒక్కసారి అనండి, విశ్వనగరం అని…! ఏడున్నరేళ్లయింది… నయాపైసా ఆచరణ లేదు, అడుగు కదిలింది లేదు… పైగా అంతర్జాతీయ పెట్టుబడులకు ఇది అంతిమ గమ్యమట… అవున్లెండి… తిట్టేవాడు తిడుతూనే ఉంటాడు, ఆ జేబులో గుట్కా తీయండి బ్రదర్… నోట్లో వేసుకుని, గుట్టుచప్పుడు గాకుండా నములుతూ అలా అలా సాగిపోదాం…!! ఈ విషయం మీద హైకోర్టు ఇలాగే స్థిరంగా నిలబడుతుంది అంటారా..? చూద్దాం…!!
Share this Article