Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒక సిద్ శ్రీరామ్ – ఒక ఎస్పీ బాలు … పూర్తి కంట్రాస్టు ఉచ్చారణ…

July 30, 2026 by M S R

.

మిత్రుడు గౌతమ్ కశ్యప్ పోస్టు…… అలవైకుంఠపురం సినిమాలో ‘‘సామజవర గమనా…” ఈ పాట వినని వారుండరు. ఎంతో మధురమైన బాణీ, అంతకంటే అద్భుతమైన సాహిత్యం. కానీ, రికార్డింగ్ లో జరిగే అనవసర హడావుడి, ఉచ్ఛారణ దోషం…
ఒక మంచి కవి రాసిన అక్షరాల్లోని ప్రాణాన్ని ఎలా కనుమరుగు చేస్తుందో చెప్పడానికి ఈ పాటలోని ఒక చరణం ప్రత్యక్ష ఉదాహరణ…

పాటలో ఒక లైన్ ఇలా వినిపిస్తుంది… “నీ కళ్ళకి కావలి కాస్త అయ్యే… కాటుకల నా కలలు”… నిజం చెప్పాలంటే ఈ వాక్యం మొదట విన్నప్పుడు నాకూ ఏమీ అర్థం కాలేదు. “కాస్త అయ్యే” ఏమిటి? అని బుర్ర బద్దలు కొట్టుకున్నాను. సిరివెన్నెల వంటి ఉద్దండుడు రాసిన సాహిత్యాన్ని నలుగురిలోనూ అర్థం కాలేదంటూ ఆయన్ని ప్రశ్నించే సాహసం చేయలేక చాలామందిలాగే నేనూ మౌనంగా ఉండిపోయాను.

Ads

కానీ ఆయనతో ఉన్న చనువు కొద్దీ ఇంక ఆగలేక ఒకసారి స్వయంగా ఆయన్నే అడిగాను, “ఏమిటి సార్ దీని అర్థం?” అని. ఆయన ఎంతో విచిత్రంగా, ఆశ్చర్యంగా, “ఇది కూడా నీకు అర్థం కాలేదా?” అని అడిగి, అసలు భావం వివరించారు. అది విన్నాక ఆ వాక్యం వెనుక ఉన్న అందం తెలిసి మనసు ఆనందంతో నిండిపోయింది.

శాస్త్రి గారు రాసిన అసలు వాక్యం ఇది: “నీ కళ్ళకి కావలి కాస్తాయే.. కాటుకలా నా కలలు” ఆయన భావం ఏమిటంటే… “ఓ ప్రియురాలా! నువ్వు కళ్ళకు పెట్టుకునే కాటుక నీకు దిష్టి తగలకుండా ఎలాగైతే రక్షణగా నిలుస్తుందో, నా కలలు కూడా ఆ కాటుకలాగా మారి నీ కళ్ళకు ఎప్పుడూ కాపలాగా ఉంటాయి.” అని.
ఎంత సున్నితమైన, అద్భుతమైన పోలిక కదా!

కానీ, గాయకుడు సిడ్ శ్రీరామ్ గారు హడావుడిగా “కాస్తాయే” (కాపలా ఉంటాయి) అనే పదాన్ని విడదీసి “కాస్త + అయ్యే” అని పలకడం వల్ల… అలాగే “కాటుకలా” అని దీర్ఘం తీయకుండా “కాటు కల” పాడటం వల్ల ఆ కవిత్వం కాస్తా అర్థం లేని వాక్యంగా మారిపోయింది.
కవి మనసులోని భావం ఎటువంటి వక్రీకరణలు లేకుండా శ్రోతలకు స్పష్టంగా చేరాలి. అప్పుడే ఆ పాటకు, ఆ కవిత్వానికి సంపూర్ణమైన న్యాయం జరుగుతుంది…’’



ఈ పోస్టు చదివాక కాసేపటికే ఏదేదో యూట్యూబ్‌లో సెర్చుతుంటే… ముద్దమందారం సినిమాలో వేటూరి విరచిత ‘అలివేణి ఆణిముత్యమా పాట’ కనిపించింది… క్లిక్ చేయగానే… ఆ పాటలోని భావంలోలాగే ఆ పదాల రొమాంటిక్ ఉచ్ఛారణతో బాలు, జానకి ఆలపించిన తీరు చెవులకింపు… కర్ణపేయం… ఆ భావం మనసును ఆ సాహిత్యాన్ని మించి అందంగా తడుతుంది…

పాటలో ఆ గాయకుల ఉచ్చారణను కొన్ని పదాల దగ్గర గమనించండి… ఆవిరి చిగురో, ఇది ఊపిరి కబురో అన్న దగ్గర నిజంగానే ఊపిరి పీలుస్తున్నట్టుగా… జాలినవ్వు జాజిదండలో అన్న దగ్గర చిన్న వినీవినిపించని నవ్వు… అడుగుమడుగులొత్తనా- మెత్తగా అన్న దగ్గర బాలు గొంతు అంతే ‘మెత్తగా’ ధ్వనిస్తుంది… పులకింతల పూజగా…. బాలుకన్నా జానకి పదాల భావవ్యక్తీకరణలో ఏం తక్కువ..?

జాబిలి చలువో, ఇది వెన్నెల కొలువో అన్న దగ్గర జానకి గళం పూర్తిగా అదోరకం గ‘మ్మత్తు’ను నింపుకుంటుంది… అవునంటే తప్పుగా, దొరనవ్వుల సామికీ అన్న దగ్గర నిజంగానే దోరనవ్వులు కురిపిస్తుంది ఆమె… చల్లగా… మరుమల్లెలు చల్లినట్టుగానే…

పాటలో తెలుగు పదాల ఉచ్చారణ ఎలా ఉండకూడదో చెప్పడానికి, అభావంగా ఎలా వినిపిస్తాయో చెప్పడానికి ఒక సిడ్ శ్రీరామ్ గానం… గొంతులో మాధుర్యం, శృతిలయ మాత్రమే ముఖ్యం కాదు, ఆ భావం ధ్వనించాలి… (ఈయన గానప్రతిభ గురించి గతంలోనూ చెప్పుకున్నాం)… ఉచ్చారణ నైపుణ్యంతో పాటను పరిపుష్టం చేయడం ఎలాగో చెప్పటానికి బాలు, జానకి ఆల్‌టైమ్ గ్రేట్… పూర్తి కంట్రాస్టు !!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక సిద్ శ్రీరామ్ – ఒక ఎస్పీ బాలు … పూర్తి కంట్రాస్టు ఉచ్చారణ…
  • ‘‘ఇలా కేసులు పడితే, ఇక ఎవరూ దేవుళ్ల మీద సినిమాలు తీయలేరు’’
  • లైక్స్, వ్యూస్ కోసం వెంపర్లాడితే… ఇదుగో ఇలాంటి ప్రమాదాలే !!
  • కథ, సంకల్పం మంచివి! కథ చెప్పే విధానం తెలియక డిజాస్టర్!!
  • మరో వారసుడి నిరాశాపూరిత ఎంట్రీ – మోహన్‌ బాబునూ వాడుకోలేదు !!
  • డీఎంకే స్టాలిన్‌తో స్ట్రెయిట్ ఫైట్‌కే విజయ్ రెడీ! ఇలా మొదలైంది!!
  • ప్రియాంక వ్యంగ్య వ్యాఖ్యలు తప్పు! మేధస్సును అవమానించడమే!!
  • ‘అవతార్’ మార్క్ హై గ్రాఫిక్స్ – ‘ఆది పురుషుడు’ రక్షింపబడ్డాడు !!
  • నడుమ వాళ్లేం తప్పు చేశారు..? ఇక్కడ ఎవరూ ఎవరికీ ఏమీ కారు..!!
  • చెరపకురా పాకీ… నువ్వే చెడేవు! అటు బెలూచ్- ఇటు పీఓకే..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions